ఎమ్మెల్యేగా ఉండి కూడా జబర్దస్త్ లాంటి ఎంటర్టైన్మెంట్ కార్యక్రమానికి జడ్జిగా వ్యవహరిస్తున్నందుకు రోజా ధైర్యాన్ని మెచ్చుకోవాలి. అదే ధైర్యంతో, ప్రజల మద్దతుతో ఆమె రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ దఫా రోజాకి మంత్రివర్గంలో ఛాన్స్ లభించే అవకాశం ఉందని ఊహాగానాలున్నాయి. అది కుదరకపోతే స్పీకర్ గా రోజాకి అవకాశం ఇస్తారనీ అంటున్నారు. ఈ రెండింట్లో ఏది జరిగినా ఆమె జబర్దస్త్ కార్యక్రమానికి వచ్చే అవకాశం లేదని అంటున్నారు.
స్పీకర్ గా గౌరవప్రదమైన పోస్టులో ఉన్నా.. అటు మంత్రిగా ప్రజా సమస్యల పరిష్కారంతో బిజీగా ఉన్నా, రోజా జబర్దస్త్ కార్యక్రమానికి టైమ్ కేటాయించలేరు. గతంలో అసెంబ్లీ సమావేశాలు, ఆ తర్వాత ఎన్నికల ప్రచార సమయంలో కూడా కొన్నిరోజులు రోజా షూటింగ్ లకు హాజరుకాలేకపోయారు. ఇప్పుడు పూర్తిస్థాయిలో మంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తే ఆమె ప్రజాసేవకే అంకితం కావాల్సి ఉంటుంది.
పోనీ స్పీకర్ గా ఉండి అసెంబ్లీ సమావేశాలు లేని సమయంలో షూటింగ్ లకి వెళ్దామంటే.. సభాపతి పదవికి గౌరవం ఇవ్వాలంటే కచ్చితంగా ప్రోగ్రామ్ లు ఆపేసుకోవాల్సిందే. అన్నింటికీ మించి ప్రభుత్వంలో ఉంటూ జబర్దస్త్ చేస్తే, కచ్చితంగా తెలుగుదేశం పార్టీ విమర్శలను రోజా ఎదుర్కోవాల్సి వస్తుంది.
ఇవన్నీ లెక్కలోకి తీసుకుంటే.. రోజా ఇకపై జబర్దస్త్ లో కనిపించడం దాదాపు అసాధ్యమనే చెప్పాలి. ఆమె జబర్దస్త్ లో కొనసాగుతుందా లేదా అనే విషయం ఇవాళ జరిగే వైసీపీ శాసనసభాపక్ష సమావేశంలో తేలిపోతుంది. ఆమెకు పదవి తగ్గితే, జబర్దస్త్ లేనట్టే. రష్మితో ఇక చిందులు బంద్ అయినట్టే.