మూడు రోజులుగా పోలీసు విచారణను ఎదుర్కొంటున్న టీవీ9 బహిష్కృత సీఈవో రవిప్రకాష్, ఈరోజు కీలకమైన మరో విచారణను ఫేస్ చేయబోతున్నారు. చాలా తక్కువ ధరకు టీవీ9 లోగో రైట్స్ ను మరో సంస్థకు అమ్మేసిన వైనంపై రవిప్రకాష్ ను ప్రశ్నించబోతున్నారు పోలీసులు. ఈ మేరకు విచారణకు హాజరుకావాల్సిందిగా మరోసారి నోటీసులు అందజేశారు పోలీసులు. టీవీ9 లోగోను, దానికి సంబంధించిన కాపీరైట్ హక్కుల్ని కేవలం 99వేల రూపాయలకు మోజో టీవీకి అమ్మేశారు రవిప్రకాష్.
ఈ మోజో టీవీలో కూడా రవిప్రకాష్ కు వాటాలు ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే లోపాయికారీ ఒప్పందాలతో, ముందుజాగ్రత్త చర్యగా లోగోను ఇలా మోజో టీవీ పేరిట రిజిస్టర్ చేశారు. కోట్ల రూపాయల విలువైన లోగో, కాపీరైట్ హక్కుల్ని ఇలా కేవలం 99వేల రూపాయలకు అమ్మేయడంపై అలందా మీడియా రవిప్రకాష్ పై కేసు వేసింది. ఆ కేసుకు సంబంధించి పోలీసులు ఈరోజు రవిప్రకాష్ ను ప్రశ్నించబోతున్నారు. రవిప్రకాష్ పై నమోదైన మిగతా రెండు కేసులతో పోలిస్తే, ఈ కేసులో రవిప్రకాష్ కు వ్యతిరేకంగా సాక్ష్యాలు బలంగా ఉన్నట్టు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా, పోలీసు విచారణలో తనను మాట్లాడనివ్వడం లేదంటూ ఆరోపించారు రవిప్రకాష్. మూడో రోజు విచారణకు హాజరైన రవిప్రకాష్.. పోలీసులు తనను మాట్లాడనివ్వడం లేదన్నారు. ఈ సందర్భంగా ఆయన మాఫియా అనే పదం వాడడం సంచలనం సృష్టించింది. మాఫియాకు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటంలో మీడియా విజయం సాధిస్తుందని, తనను మాట్లాడకుండా చేస్తున్నారని ఆరోపించిన రవిప్రకాష్.. మీడియా ఐక్యత వర్థిల్లాలి అంటూ నినాదాలు చేస్తూ వెళ్లిపోయారు.
ఈ విషయంలో తనకు పూర్తి మద్దతు లభిస్తుందనుకున్న రవిప్రకాష్ కు నిరాశ ఎదురైంది. మీడియా నుంచి అతడికి ఎలాంటి మద్దతు లభించడం లేదు. ఇన్నాళ్లూ నిరంకుశత్వంగా నిర్ణయాలు తీసుకోవడం, ఉద్యోగులను రాచిరంపాన పెట్టడంతో తెలుగు మీడియా నుంచి రవిప్రకాష్ కు మద్దతు కరువైంది. ఇతర మీడియా సంస్థలతో సత్సంబంధాలు లేకపోవడం కూడా ఆయనకు ఇప్పుడు మైనస్ గా మారింది. ఇన్నాళ్లూ తనవాళ్లుగా భావించిన టీవీ9లో పనిచేసిన కొంతమంది కీలక ఉద్యోగులు కూడా ఇప్పుడు రవిప్రకాష్ ను వీడారు.
మాఫియా-మీడియా యుద్ధం అంటూ రవిప్రకాష్ చేస్తున్న ఆందోళనను హైదరాబాద్ జర్నలిస్టులతో పాటు, ఏపీ-తెలంగాణ పాత్రికేయులు ఎవరూ సమర్థించడం లేదు. మరో 2 రోజుల విచారణ అనంతరం తగు సాక్ష్యాలతో రవిప్రకాష్ ను పోలీసులు అరెస్ట్ చేసే ఛాన్స్ ఉంది.