టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. గత ఎన్నికల్లో ఉమ్మడి కృష్ణా జిల్లా గన్నవరం నుంచి టీడీపీ తరపున ఆయన ఎన్నికయ్యారు. వైసీపీ సునామీలో కూడా ఆయన గెలుపొందడం విశేషం. ఇందుకు అక్కడి సామాజిక పరిస్థితులో దోహదం చేశాయి. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంత కాలానికి … సీఎం జగన్‌కు వంశీ మద్దతుగా నిలిచారు.
గన్నవరంలో అన్నీ తానై పెత్తనం చెలాయించారు. ఇదే సందర్భంలో వైసీపీ కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా నిలిచిన యార్లగడ్డ వెంకట్రావు, డాక్టర్ దుట్టా రామచంద్రరావులతో వంశీకి విభేదాలు కొనసాగాయి. వంశీ, వైసీపీ పాత నాయకుల మధ్య సయోధ్య కుదర్చడానికి సీఎం వైఎస్ జగన్, పార్టీ పెద్దలు పలు దఫాలు ప్రయత్నించారు. అయినా ఫలితం లేకపోయింది. ఇరు వర్గాల మధ్య మాటల తూటాలు పేలాయి.
గన్నవరం టికెట్ వంశీకి ఇస్తే చేసే ప్రసక్తే లేదని సీఎం జగన్‌కు ఆ ఇద్దరు నాయకులు తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో వంశీకే టికెట్ అని జగన్ చెప్పారనే కారణంతో యార్లగడ్డ వెంకట్రావు పార్టీని వీడారు. గత ఎన్నికల్లో గన్నవరం నుంచి వైసీపీ తరపున యార్లగడ్డ పోటీ చేసి ఓడిపోయారు. వైసీపీ వీడిన ఆయన వెంటనే టీడీపీ కండువా కప్పుకున్నారు. టీడీపీలో చేరడమే ఆలస్యం… ఆయన్ను గన్నవరం ఇన్‌చార్జ్‌గా చంద్రబాబు నియమించారు.
వైసీపీ నిర్వహించిన సర్వేల్లో వంశీకి వ్యతిరేకంగా నివేదికలు వచ్చాయి. ఇటు వైసీపీ నేతలు ఆయనకు అండగా నిలవడం లేదు. అటు టీడీపీ నుంచి వంశీ వెంట నడిచే వాళ్లు పెద్దగా లేరనే వాస్తవాన్ని జగన్ గ్రహించారు. దీంతో గన్నవరం నుంచి బరిలో దింపితే ఓడిపోతావని వంశీకి జగన్ చెప్పారు. కావున మరో నియోజకవర్గానికి మారుస్తానని జగన్ అనడంతో వంశీ అలకబూనారు.
ఇటీవల గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని, వంశీని సీఎం జగన్ పిలిపించుకుని… గన్నవరంలో వాస్తవ పరిస్థితుల్ని వివరించారు. గన్నవరం సీటు మాత్రం ఇచ్చే పరిస్థితి లేదని, పెనమలూరు లేదా మైలవరంలలో ఏదో ఒక చోట నిలబడాలని సీఎం కోరినట్టు తెలిసింది. అవసరమైతే ఆ రెండు నియోజకవర్గాల్లో మార్పుచేర్పులు చేపడతానని జగన్ చెప్పినట్టు తెలిసింది. ఇందుకు వంశీ అంగీకరించలేదు. సీఎంతో భేటీ తర్వాత సెల్ ఫోన్ ఆఫ్ చేసుకుని వంశీ ఎటో తిరుగుతున్నట్టు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం వంశీ రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది.