టీవీ9 ఎక్స్ సిఇఓ రవిప్రకాష్ ఎక్కడున్నారు? ముంబాయిలో వున్నారని, ఆంధ్రలో వున్నారని గ్యాసిప్ లు వినిపిస్తున్నాయి. తెలంగాణలో మాత్రం వుండి వుండరు. అదిపక్కా. ఎందుకంటే వుంటే తెలంగాణ పోలీసులు ఏ క్షణమైన అదుపులోకి తీసుకునే ప్రమాదం వుంది. రాజకీయవర్గాల బోగట్టా ప్రకారం రవిప్రకాష్ విజయవాడలోనే వున్నారని తెలుస్తోంది.
విజయవాడలోని ఓ రిసార్ట్ లో ఆయన వున్నారని వినిపిస్తోంది. అక్కడ నుంచి ఈ వ్యవహారానికి ఏ విధంగా బ్రేక్ వేయాలి, అరెస్ట్ అనేది లేకుండా ఏ విధంగా అడ్డుకోవాలి అనే విషయమై న్యాయ నిపుణులతో చర్చలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది.
తెలుగుదేశం పార్టీలోని కీలకవ్యక్తులు ఈ విషయంలో రవిప్రకాష్ ను ఎలాగైనా బెయిల్ అవుట్ చేయాలని తెరవెనుక తమవంతు సలహా, సాయం, సహకారాలు అందిస్తున్నారని బోగట్టా. కేవలం లీగల్ గానే దీన్ని అడ్డుకోవాలని, అందుకు అనుకూలమైన స్టెప్ తీసుకోవాలని రవిప్రకాష్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
వాస్తావానికి రవిప్రకాష్ మీద మరీ భయంకరమైన, తప్పించుకోలేని ఆరోపణలు లేవు. ఒకటి ఫోర్జరీ, రెండు టీవీ9 డేటా వేరేవాళ్లకు ఇచ్చారన్నది. ఈ రెండూ మరీ కోర్టులు యాంటిసిపేటరీ బెయిల్ ను నిరాకరించేంత అయితే కాదని న్యాయనిపుణుల మాటగా తెలుస్తోంది. ఒకసారి యాంటిసిపేటరీ బెయిల్ వచ్చేస్తే ఇక సమస్యలేదు. ఎందుకంటే ఈ వ్యవహారాలు అన్నీ అంత సులువుగా ప్రూవ్ అయ్యేవికావు.
అదీకాక, రవిప్రకాష్ అదృష్టం బాగుంటే ఆంధ్రలో చంద్రబాబు వస్తే సమస్యేలేదు. అన్నివిధాలా సహాయ సహకారాలు అందుతాయి. అదీకాక ప్రస్తుతం కేంద్రంలో ఎన్నికల హడావుడి వుంది. 23 దాటితే పరిస్థితి మారుతుంది. మోడీ వచ్చానా, కాంగ్రెస్ వచ్చినా, రవిప్రకాష్ కు ఫరావలేదని, రెండువర్గాలతో మంచి సంబంధాలు వున్నాయని వినిపిస్తోంది.
అందువల్ల ఎలాగైనా 23 వరకు ఈ వ్యవహారాన్ని అలా సాగదీసే ఆలోచనలో వున్నట్లు, అందుకే విజయవాడలో వుండి సమాలోచనలు సాగిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.