వ్రతము వీడిన పవన్!

తొందరపడి వ్రతం పూనకూడదు. పూనితే దాని మీద నిలబడాలి. జ‌నసేనాధిపతి నిన్నటికి నిన్న మా జ‌నసేన నాయకులందరికీ బెయిల్ వచ్చే వరకు విశాఖ వదలను అని భీష్మించుకున్నారు. పోలీసులు 41 నోటీస్ ఇచ్చి హైదరాబాద్…

తొందరపడి వ్రతం పూనకూడదు. పూనితే దాని మీద నిలబడాలి. జ‌నసేనాధిపతి నిన్నటికి నిన్న మా జ‌నసేన నాయకులందరికీ బెయిల్ వచ్చే వరకు విశాఖ వదలను అని భీష్మించుకున్నారు. పోలీసులు 41 నోటీస్ ఇచ్చి హైదరాబాద్ బయల్దేరమన్నారు. 

హోటల్ గది నుంచి బయటకు వస్తే హైదరాబాద్ వెళ్లాలి తప్ప మరో మార్గం లేదు. సో, హత్యాయత్న నేరం కింద అరెస్ట్ అయిన జ‌న సైనికులలో ఎ వన్ టు నైన్ మినహా మిగిలిన అందరికీ స్టేషన్ బెయిల్ లభించింది.

సో మిగిలిన తొమ్మిది మందికి వచ్చిన తరువాత కానీ విశాఖ వీడనని పంతంగా కూర్చున్నారు. తెలుగుదేశం సామాజిక అను’కుల’ మీడియా ఈ రోజు వాళ్లకూ బెయిల్ వచ్చేస్తుందంటూ ఊహాగానాలతో ట్వీట్ లు వేసాయి. అయిటమ్ లు రాసాయి. కానీ గౌరవ న్యాయమూర్తి ఆ తొమ్మిది మందికీ రిమాండ్ విధించారు.

మరి ఇప్పుడు పవన్ కు కింకర్తవ్యమ్? విశాఖ వదలుటయా? వుండుటయా? వుంటే గదిలో హోటల్ అరెస్ట్ మాదిరిగా వుండాలి. లేదూ అంటే వెళ్లిపోవాలి. వ్రతం విరమించడానికి మధ్యే మార్గం ఆలోచించారు. ఛలో అమరావతి అన్నారు. ఎందుకు? జిల్లా కోర్టులో బెయిల్ రాకుంటే హైకోర్టుకు వెళ్లడం కామన్. అదిగో ఆ పని మీద తాను వెళ్తున్నా అంటూ ఓ వీడియో సందేశం వదిలి, విశాఖ వదిలారు.

నిజానికి బెయిల్ కోసం హైకోర్టుకు వెళ్లేది పవన్ కాదు. జ‌నసేన లీగల్ టీమ్. దీని కోసం పవన్ ఏమీ హైకోర్టుకు వెళ్లి అక్కడ విజిటర్స్ గ్యాలరీలో కూర్చోరు. ఆ అవసరం కూడా లేదు. కానీ విశాఖ ఎందుకు వదులుతున్నారో చెప్పాలంటే ఏదో ఒక సాకు వుండాలి కదా. అదే ఇది అన్నమాట.

కానీ గమ్మత్తేమిటంటే బెయిల్ రావడాలు, రాకపోవడాలు, ఇలాంటివి ఏవీ తెలుగుదేశం అను’కుల’ సామాజిక మీడియాలకు పెద్దగా పట్టకపోవడం. కాదు..కాదు. పట్టించుకోకపోవడం. అలా పట్టించుకుంటే అనవసరంగా జ‌నసేనకు మరింత మైలేజీ వచ్చి తెలుగుదేశానికి ఇబ్బంది అవుతుందనే కదా? అంతకన్నా ఏముంటుంది?