భాస్క‌ర్‌నాయుడి దోపిడీలో మీ భాగం ఎంత భాను?

గ‌త ఐదేళ్ల‌లో తీవ్ర వివాదాస్ప‌ద‌మైన పద్మావతి హాస్పిటాలిటీ అండ్ మేనేజ్ మెంట్ సర్వీసెస్ సంస్థ అధినేత భాస్కర్ నాయుడికి బీజేపీ నేత భానుప్ర‌కాశ్‌రెడ్డి బ‌హిరంగంగా మ‌ద్ద‌తు ప‌ల‌క‌డంపై సొంత పార్టీ నేత‌లే విస్మ‌యం వ్య‌క్తం…

గ‌త ఐదేళ్ల‌లో తీవ్ర వివాదాస్ప‌ద‌మైన పద్మావతి హాస్పిటాలిటీ అండ్ మేనేజ్ మెంట్ సర్వీసెస్ సంస్థ అధినేత భాస్కర్ నాయుడికి బీజేపీ నేత భానుప్ర‌కాశ్‌రెడ్డి బ‌హిరంగంగా మ‌ద్ద‌తు ప‌ల‌క‌డంపై సొంత పార్టీ నేత‌లే విస్మ‌యం వ్య‌క్తం చేస్తున్నారు. చంద్ర‌బాబు బంధువుగా చెప్పుకుంటూ గ‌త టీడీపీ పాల‌న‌లో శ్ర‌మ‌దోపిడీకి పాల్ప‌డ్డ భాస్క‌ర్‌నాయుడికి మ‌ద్ద‌తుగా నిలిచిన భానుప్ర‌కాశ్‌రెడ్డికి, ఆయ‌న దోపిడీలో భాగ‌మెంతో చెప్పాల‌ని సొంత పార్టీ నేత‌లు ప్ర‌శ్నిస్తున్నారు.  

ఇదే విష‌య‌మై సొంత పార్టీ నేత‌లుగా ప్ర‌శ్నించ‌లేకున్నామ‌ని, కానీ వైసీపీ నేత నిల‌దీయ‌డం ఆనందంగా ఉందంటున్నారు. టీడీపీ-బీజేపీ మిత్ర‌ప‌క్షంలో భాగంగా గ‌తంలో టీటీడీ బోర్డు స‌భ్యుడిగా అవ‌కాశం ద‌క్కించుకున్న భానుప్ర‌కాశ్‌రెడ్డి…ఇటు స్వామి కార్యం, అటు స్వ‌కార్యాల‌ను ఎలాంటి అడ్డంకి లేకుండా పూర్తి చేసుకున్నార‌ని సొంత‌పార్టీ నేత‌లు తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శిస్తున్నారు. టీటీడీ స‌భ్యుడిగా ప‌ద‌విని అడ్డు పెట్టుకుని స్విమ్స్‌లో కాంట్రాక్ట్ ద‌క్కించుకుని, ఆర్థికంగా బ‌ల‌ప‌డ్డాడ‌నే ఆరోప‌ణ‌లున్నాయి. క‌నీసం తాను నివాసం ఉంటున్న వార్డులో కూడా ప‌ది ఓట్లు వేయించ‌లేని భాను, లాబీయింగ్‌తో పెద్ద‌స్థాయి నాయ‌కుడిగా చెలామ‌ణి అవుతున్నాడ‌నే విమ‌ర్శ‌లు ఉన్నాయి.

టీటీడీలో ఎఫ్ఎంఎస్ కాంట్రాక్టు పనులు చేస్తున్న పద్మావతి హాస్పిటాలిటీ అండ్ మేనేజ్ మెంట్ సర్వీసెస్ సంస్థ అధినేత భాస్కర్ నాయుడికి మద్దతుగా ఇటీవల టివి 9 డిబేట్ లోనూ, బుధ‌వారం ఎపి 24 ఛానల్ చర్చలోనూ భానుప్రకాశ్‌రెడ్డి మాట్లాడ‌టంపై బీజేపీ నేత‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. జ‌గ‌న్ స‌ర్కార్ కులాల ప్రాతిప‌దిక‌న క‌క్ష‌సాధింపుల‌కు పాల్ప‌డుతోందంటూ, ఇందుకు ఉదాహ‌ర‌ణ‌గా టీటీడీ లేబర్ కాంట్రాక్టర్ భాస్కర్ నాయుడి ప్రస్తావన తెచ్చాడు.  భాస్క‌ర్‌నాయుడి కాంట్రాక్టు గడువు ఇంకా మూడేళ్లు ఉన్న‌ప్ప‌టికీ రద్దు చేశారని ఆరోపించాడు.

భాను ఆరోప‌ణ‌ల‌పై  వైసీపీ నేత‌ కొండా రాజీవ్ ఘాటుగా స్పందించాడు. “కాంట్రాక్టర్ గురించి మీకెందుకు…ప్రజా సమస్యలు ఉంటే చెప్పండి. కాంట్రాక్టర్ నుంచి మీకు రావాల్సిన కమీషన్ పోయిందా. కాంట్రాక్టర్ ఏం తప్పు చేశారో , ఎందుకు రద్దు చేశారో తెలుసుకోండి. అంతేగానీ ఈ విధంగా బురద చల్లొద్దు” అని రాజీవ్ ఘాటుగా బ‌దులిచ్చారు. ఇటీవల టివి 9 చర్చలో కూడా ఇదే విధ‌మైన ఎదురు ప్ర‌శ్న భానుకు ఎదురైంది.

భాను మ‌ద్ద‌తుగా నిలుస్తున్న భాస్క‌ర్‌నాయుడి అరాచ‌కాల‌పై గ‌తంలో లెక్క‌లేన‌న్ని సార్లు టీటీడీ కాంట్రాక్ట్ కార్మికులు ప‌లు రీతుల్లో ఆందోళ‌న‌లు నిర్వ‌హించారు. అలాంటి కాంట్రాక్ట‌ర్‌కు భాను మ‌ద్ద‌తుగా నిల‌వ‌డంపై టీటీడీ కాంట్రాక్ట్ కార్మికులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.  గత తెలుగుదేశం ప్రభుత్వంలోని పెద్దలకు బంధువునంటూ టీటీడీతో పాటు రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాలు, ఆస్పత్రులు, యూనివర్శిటీలలో పారిశుధ్యం, అతిథి గృహాల నిర్వహణ కాంట్రాక్టు పనులను భాస్కర్ నాయుడు దక్కించుకున్నాడు.

కేవ‌లం టీటీడీకి సంబంధించి తిరుమల, తిరుపతిలో వందల కోట్ల పనులు ఆయన వశమయ్యాయి. భాస్కర్ నాయుడి కాంట్రాక్ట్ కార‌ణంగా కార్మికులపై వేధింపులు పెరిగాయి. 50 ఏళ్ల పైబడిన వారిని తొలగించడం, కార్మికుల సంఖ్య తగ్గించ‌డం, ఇష్టా‌నుసారం బదిలీ చేయడం…వంటి చర్యలతో విసిగిపోయిన కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగిన ఘ‌ట‌న‌లు అనేకం.

ఈ నేప‌థ్యంలో పాదయాత్రలో భాగంగా చిత్తూరు జిల్లాకు వచ్చిన అప్పటి ప్రతిపక్ష నేత, ఇప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దృష్టికి భాస్క‌ర్‌నాయుడి విష‌యాన్ని సీఐటీయూ నేతలు కందారపు మురళి, నాగార్జున, వెంకటేశం తదితరులు తీసుకెళ్లారు. దీ‌నిపైన స్పందించిన జగన్ తాము అధికారంలోకి వస్తే లేబర్ కాంట్రాక్టు వ్యవస్థ రద్దు చేస్తామని హామీ ఇచ్చారు.

ఈ క్రమంలోనే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన త‌ర్వాత రాష్ట్ర స్థాయిలో ఔట్‌ సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. టీటీడీతో పాటు ప్రభుత్వ శాఖలు, ఆస్పత్రులు, యూనివర్శిటీలు తదితర వాటిలో పని చేసే కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ కార్మికులందరనీ ఈ కార్పొరేషన్ పరిధిలోకి తెచ్చి, దానిద్వారా వేతనాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.

సంబంధిత  సంస్థల్లో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ , కాంట్రాక్ట్ కార్మికుల వివరాలు అందజేయాలని హౌసింగ్ కార్పొరేషన్ నుంచి ఆదేశాలు అందాయి. టీటీడీ కూడా ఇటువంటి వివరాలను హౌసింగ్ కార్పొరేషన్ పంపించింది. అయితే తన వద్ద పనిచేస్తున్న కార్మికుల వివరాలు అందజేయడంలో భాస్కర్ నాయుడు అలసత్వం ప్రదర్శించినట్లు తెలుస్తోంది. దీంతో అధికారులు ఆయన కాంట్రాక్టును రద్దు చేసినట్లు చెబుతున్నారు.

ఇవేమి పట్టించుకోకుండా భానుప్రకాశ్‌రెడ్డి కులం కోణంలోనే ఈ వ్యవహారంపై మాట్లాడడం, భాస్కర్ రెడ్డిని వెనుకేసుకుని రావ‌డంపై వాళ్లిద్ద‌రి మ‌ధ్య ఆర్థిక లావాదేవీల వ్య‌వ‌హారం ఏమైనా ఉందా అనే అనుమానాల‌కు తావిస్తోంది. మ‌రీ ముఖ్యంగా బీజేపీ నేత‌లే భాను వ్య‌వ‌హార‌శైలిపై మండిప‌డుతున్నారు. సొంత ఎదుగుద‌ల కోసం టీడీపీ కాంట్రాక్ట‌ర్‌కు ఒత్తాసు ప‌లుకుతూ పార్టీని బ‌లి పెడుతున్నాడ‌ని సొంత పార్టీ నేత‌ల నుంచి తీవ్ర ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి.  

కాగా ఏళ్ల తరబడి కాంట్రాక్టర్ల దోపిడీకి గురవుతున్నామని, ఎట్టకేలకు కాంట్రాక్టర్ల పీడ విరగడవుతున్నందుకు సంతోషంగా ఉందని, ఈ పరిస్థితుల్లో తమ మనోభావాలకు వ్యతిరేకంగా భాను మాట్లాడ‌టం ఏంట‌ని టీటీడీ కాంట్రాక్ట్ కార్మికులు ప్ర‌శ్నిస్తున్నారు. ద‌య‌చేసి ఇప్ప‌టికైనా బీజేపీ పెద్ద‌లు జోక్యం చేసుకొని భాస్క‌ర్‌నాయుడితో పాటు ఆయ‌న‌కు వంత పాడుతున్న భాను అక్ర‌మాల‌ను అరిక‌ట్టాల‌ని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.

బాధపడుతున్న వంశీ పైడిపల్లి

తనని కాపీ కొట్టాను అందుకే ఇంత పెద్ద హిట్ అయ్యింది