'కేటీఆర్ తెలంగాణ సీఎం పీఠాన్ని అధిరోహిస్తారు..' అనే వార్తలు ఈనాటివి కావు. గత టర్మ్ లోనే ఈ వార్తలు వచ్చాయి. తెలంగాణ అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు వచ్చినప్పుడు అయితే ఈ ఊహాగానాలే గట్టిగా వినిపించాయి.
రెండోసారి అసెంబ్లీ ఎన్నికల్లో నెగ్గి తెలంగాణ సీఎం పీఠంపై కేటీఆర్ ను కూర్చోబెట్టి, పార్లమెంట్ ఎన్నికల సమయానికి కేసీఆర్ ఢిల్లీ మీద కన్నేస్తారనే విశ్లేషణలు అప్పుడు గట్టిగా సాగాయి.
అయితే అసెంబ్లీ ఎన్నికల్లో నెగ్గిన టీఆర్ఎస్, లోక్ సభ ఎన్నికల్లో మాత్రం షాకింగ్ రిజల్ట్స్ నే ఎదుర్కొంది. అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ తమ ఉనికిని కొంత వరకూ అయినా చాటుకున్నాయి.
ఇక ప్రస్తుత తెలంగాణ రాజకీయ పరిణామాలు మరింత హాట్ హాట్ గా ఉన్నాయి. దుబ్బాక ఉప ఎన్నిక, జీహెచ్ఎంసీ ఫలితాలు టీఆర్ఎస్ పై వ్యతిరేకత ఉందనే అంశాన్ని కొంత వరకూ చాటాయి. ఇలాంటి తరుణంలో.. కేటీఆర్- సీఎం అనే అంశం మళ్లీ తెరపైకి వచ్చింది.
గతంలో అయితే కేటీఆర్ ను సీఎంగా చేసి కేసీఆర్ ఢిల్లీ వైపు వెళ్తారనే విశ్లేషణలు అయినా ఉండేవి. ఇప్పుడు టీఆర్ఎస్ కు ఉన్న పార్లమెంటరీ సీట్ల సంఖ్యే తగ్గింది. కేంద్రంలోని బీజేపీకి స్పష్టమైన మెజారిటీ ఉంది, టీఆర్ఎస్ ను ఆ పార్టీ శత్రువుగా చూస్తోంది.
ఇలాంటి తరుణంలో కేసీఆర్ కు ఢిల్లీ రాజకీయాల్లో వ్యాక్యూమ్ అయితే ఏ రకంగానూ కనిపించడం లేదు. మరి ఉన్నఫలంగా ఇప్పుడు కేటీఆర్ ను సీఎంగా చేస్తే.. కేసీఆర్ పార్టీ అధ్యక్షుడిగా మిగలవచ్చు.
అటు టీఆర్ఎస్ అధ్యక్షుడుగా ఉంటూ, సీఎంగా కొనసాగుతున్న కేసీఆర్ పై ప్రతిపక్షాలు రొటీన్ విమర్శలు చేస్తూ ఉంటాయి. ఫామ్ హౌస్ అంటూ విరుచుకుపడుతూ ఉంటాయి. అయితే వాటిని కేసీఆర్ లెక్క చేయకుండానే వరసగా రెండో సారి సీఎం అయ్యారు.
ఇక కేటీఆర్ విషయానికి వస్తే.. వాగ్ధాటి, మంచి కమ్యూనికేషన్ తో తన ప్రత్యేకతను చాటుకున్నారు. అటు పార్టీ వ్యవహారాలపై, ఇటు ప్రభుత్వ వ్యవహారాలపై గ్రిప్ సంపాదించుకున్నారు.
కేటీఆర్ ఏ నిమిషం అయినా సీఎం సీట్లో కూర్చోవడానికి తగిన ఎక్స్ పీరియన్స్ అయితే సంపాదించుకున్నారు. కానీ ఎటొచ్చీ.. కేసీఆర్ దిగిపోయి, కేటీఆర్ సీట్లో కూర్చోవాల్సిన అవసరం అయితే బయటి వాళ్లకు కనిపించదు.
కానీ టీఆర్ఎస్ మంత్రులు, నేతలు మాత్రం కేటీఆర్ సీఎం అయితే తప్పేంటని మీడియా ప్రతినిధుల ముందు ప్రశ్నిస్తున్నారు. తప్పేం లేదు కానీ, ఇన్నాళ్లూ కేవలం ఊహాగానంగా నిలిచిన అంశం.. ఇప్పుడు మరోసారి తెరపైకి రావడం మాత్రం విశేషమే.