
ఇటీవల కాలంలో గన్నవరం నియోజకవర్గం తరచూ వార్తల్లో నిలుస్తోంది. గన్నవరం నుంచి టీడీపీ తరపున గెలుపొందిన వల్లభనేని వంశీ, ఆ తర్వాత కాలంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు మద్దతుగా నిలిచారు. రానున్న ఎన్నికల్లో ఆయన వైసీపీ తరపున బరిలో నిలవనున్నారు. వల్లభనేని వంశీపై టీడీపీ నేతలు అవాకులు చెవాకులు పేలడం, అటు వైపు నుంచి రియాక్షన్‌కు తట్టుకోలేక గిలగిలలాడుతున్నారు.
ఈ నేపథ్యంలో ఎలాగైనా వల్లభనేని వంశీని రానున్న ఎన్నికల్లో ఓడించాలనే పట్టుదలతో చంద్రబాబు, లోకేశ్ ఉన్నారు. మరీ ముఖ్యంగా తన పుట్టుక గురించి వల్లభనేని అనుచిత వ్యాఖ్యలు చేశారని లోకేశ్ కసితో ఉన్నారు. గన్నవరంలో వల్లభనేని వంశీపై గట్టి అభ్యర్థిని నిలబెట్టాలని టీడీపీ అనుకుంటోంది. ఇందులో భాగంగా ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడిని ఇన్‌చార్జ్‌గా నియమించారు. అయితే ఆయన గుండెపోటుతో రెండు రోజుల క్రితం తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో గన్నవరం సమన్వయకర్తగా మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణను టీడీపీ నియమించింది. కానీ వంశీపై ఆయన ఏ మాత్రం పోటీ ఇవ్వలేరని టీడీపీ అధిష్టానం గుర్తించింది. ఈ నియామకం తాత్కాలికమే అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వంశీపై తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవినేని చంద్రశేఖర్ అలియాస్ చందును నిలబెట్టాలని చంద్రబాబు ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. ఇతను వైసీపీ యువనాయకుడు దేవినేని అవినాష్‌కు వరుసకు సోదరుడు అవుతారు.
దివంగత దేవినేని నెహ్రూ సొంత తమ్ముడు బాజీ ప్రసాద్ తనయుడే చందు. బాజీ ప్రసాద్ 2016లో మరణించారు. బాజీ ప్రసాద్ భార్య అపర్ణ విజయవాడలో కార్పొరేటర్‌గా రెండుసార్లు గెలుపొందారు. తెలుగు యువత నాయకుడిగా టీడీపీలో చందు క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. లోకేశ్‌కు సన్నిహితుడిగా పేరు పొందారు. కాస్త పద్ధతైన నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. గన్నవరంలో వంశీని ఎదుర్కోవడం అంత సులువు కాదు. టీడీపీ, ఆ పార్టీ అనుకూల మీడియా వంశీని రౌడీగా చూపిస్తున్న సంగతి తెలిసిందే.
అయితే గన్నవరం నియోజకవర్గ ప్రజానీకంతో వంశీ బలమైన అనుబంధం ఏర్పరచుకున్నారు. తన నియోజకవర్గంలో ఎవరికి ఏ అవసరమొచ్చినా పిలవకనే వెళ్లే నాయకుడిగా వంశీ మంచి పేరు తెచ్చుకున్నారు. టీడీపీ లేదా వైసీపీ పేరు చెప్పుకుని ఆయన రాజకీయ ఉనికి చాటుకోవడం లేదు. ప్రజాసేవకుడిగా తనకంటూ సొంత బలాన్ని కలిగి ఉన్నారు. వంశీని చందు ఎంత వరకు ఢీకొంటారో కాలమే జవాబు చెప్పాల్సి వుంటుంది.