
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి చేజేతులా బలమైన ప్రత్యర్థి తెచ్చుకుంటున్నారా? అంటే... ఔననే సమాధానం వస్తోంది. శ్రీకాళహస్తిలో రెండో ప్రయత్నంలో బియ్యపు మధుసూదన్‌రెడ్డి విజయం సాధించి ఎమ్మెల్యే ఎన్నికై తన చిరకాల కాంక్ష తీర్చుకున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు సన్నిహితుడిగా పేరు పొందారు. సార్వత్రిక ఎన్నికలకు గట్టిగా ఏడాది సమయం మాత్రమే వుంది.
దీంతో రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. అభ్యర్థుల ఎంపికపై ప్రధాన రాజకీయ పక్షాలైన వైసీపీ, టీడీపీ అధినేతలు తీవ్ర కసరత్తు చేస్తున్నారు. శ్రీకాళహస్తిలో వైసీపీ తరపున మరోసారి బియ్యపు మధుసూదన్‌రెడ్డే పోటీ చేసే అవకాశాలున్నాయి. టీడీపీ తరపున అభ్యర్థి ఎవరనే అంశంపై పలువురి పేర్లు తెరపైకి వస్తున్నాయి. పాదయాత్రలో భాగంగా లోకేశ్ మాత్రం శ్రీకాళహస్తి అభ్యర్థిగా బొజ్జల సుధీర్‌రెడ్డిని గెలిపించాలని అభ్యర్థించడం గమనార్హం.
అయితే లోకేశ్ ప్రకటించిన అభ్యర్థి రానున్న రోజుల్లో మారొచ్చని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. శ్రీకాళహస్తి టీడీపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీఎస్ నాయుడు బరిలో ఉంటారని టీడీపీ ముఖ్య నేతలు చెబుతున్నారు. ప్రస్తుతం వైసీపీలో నాయుడు కొనసాగుతున్నారు. 2004లో బొజ్జల గోపాలకృష్ణారెడ్డిపై ఎస్సీవీ కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందారు. ఆ తర్వాత ఎన్నికల్లో బొజ్జల చేతిలో ఓడిపోయారు. గత సార్వత్రిక ఎన్నికల ముందు టీడీపీ నుంచి వైసీపీలో ఎస్సీవీఎస్ నాయుడు చేరారు. తనకు ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వలేదనే అసంతృప్తి ఆయనలో వుంది.
ఇటీవల ఎస్సీవీఎస్ నాయుడికి ఎమ్మెల్సీ ఇప్పించేందుకు చిత్తూరు జిల్లాలోని వైసీపీ ముఖ్య నాయకులు ప్రయత్నించారు. ఇందుకు సీఎం జగన్ కూడా మొగ్గు చూపారని వార్తలొచ్చాయి. ఈ విషయాన్ని పసిగట్టిన బియ్యపు మధుసూదన్‌రెడ్డి శరవేగంగా పావులు కదిపి, రష్ ఆస్పత్రి అధినేత, టీడీపీ బీసీ నాయకుడు సుబ్రహ్మణ్యాన్ని ముందుకు తెచ్చారు. పల్లె రెడ్ల సామాజిక వర్గానికి చెందిన రష్ సుబ్రహ్మణ్యానికి ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టడం ద్వారా రాజకీయంగా లబ్ధి పొందొచ్చని జగన్‌కు వివరించి, ఆ కోణంలో చివరి నిమిషంలో ఆయనకు పదవి ఇచ్చేలా బియ్యపు మధుసూదన్‌రెడ్డి చక్రం తిప్పారని సమాచారం. ఎస్సీవీఎస్ నాయుడికి ఎమ్మెల్సీ పదవి ఇస్తే, శ్రీకాళహస్తిలో రెండో పవర్ సెంటర్ ఏర్పడుతుందనే భయంతో అడ్డుకున్నట్టు ప్రచారం జరుగుతోంది.
ఈ నేపథ్యంలో ఎస్సీవీఎస్ నాయుడిని చేర్చుకుని బియ్యపు మధుసూదన్‌రెడ్డిపై పోటీ చేయించేందుకు టీడీపీ పెద్దలు పావులు కదుపుతున్నారు. మాజీ మంత్రి దివంగత బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కుటుంబంపై చంద్రబాబుకు అభిమానం ఉన్నప్పటికీ, ఆయన కుమారుడు సుధీర్‌రెడ్డి రాజకీయంగా ఆశించిన స్థాయిలో యాక్టీవ్‌గా లేరని సమాచారం. దీంతో బొజ్జలకు ఇంకో పదవి ఇచ్చి, ఎస్సీవీని చేర్చుకుని, శ్రీకాళహస్తిలో మధును ఓడించాలనే పట్టుదలతో చంద్రబాబు ఉన్నట్టు తెలిసింది. ఎస్సీవీఎస్ నాయుడికి నియోజకవర్గంలో మంచి పేరు వుంది. ఆయన సామాజిక వర్గంతో పాటు బియ్యపు మధుపై అసంతృప్తి కలిసొస్తుందని చంద్రబాబు అంచనా.
పైగా బియ్యపు మధును ఆర్థికంగా ఎదుర్కోవడం నాయుడికే సాధ్యమని టీడీపీ శ్రేణులు అంటున్నాయి. మొత్తానికి ఎమ్మెల్సీ ఇచ్చి, తనకు అనుకూలంగా మలుచుకుని వుంటే బియ్యపు మధుకు ఈజీ అయ్యేది. కానీ బియ్యపు ఒకటి ఆలోచిస్తే, ప్రత్యర్థులు మరొకటి ఆలోచిస్తున్నారు. మొత్తానికి ఎస్సీవీఎస్ నాయుడు ప్రత్యర్థి అయితే మాత్రం బియ్యపు మధుసూదన్‌రెడ్డి చాలా చమటోడ్చాల్సి వస్తుందనడంలో సందేహం లేదు.