మొత్తానికి రాహుల్ గాంధీ తమ వినతులకు లొగేలా లేరు అని కాంగ్రెస్ పార్టీ అర్థం చేసుకుంది. మీ కుటుంబం మినహా మాకు గత్యంతరం లేదు మహా ప్రభో.. పగ్గాలు మీ చేతిలో ఉంటే తప్ప మాకు మనుగడ ఉండదు.. అని ఎందరు నాయకులు ఎన్ని రకాలుగా విన్నవించుకున్నా సరే.. రాహుల్ పట్టించుకోకపోయేసరికి.. పార్టీ జాతీయ అధ్యక్షుడిని కొత్తగా నియమించుకోవడానికి ఇవాళ సీడబ్ల్యూసీ సమావేశం అవుతోంది. ఇప్పుడు జరగబోతున్నది కూడా తాత్కాలిక అధ్యక్షుడి ఎంపికేనట. అయితే ఈ భేటీలో.. చిన్న వృద్ధుడిని ఎంచుకుంటారా? పెద్ద వృద్ధుడిని ఎంచుకుంటారా? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా ఉంది.
కాంగ్రెస్ పార్టీకి మొన్నటిదాకా 49 ఏళ్ల రాహుల్ అధ్యక్షుడిగా ఉన్నారు. పార్టీలో వృద్ధుల ప్రాబల్యం పెరిగిపోయిందని… వారసులకోసం పనిచేస్తున్నారే తప్ప, పార్టీకోసం పనిచేసే శ్రద్ధ వారిలో పోయిందని రాహుల్ తొలినుంచి అంటూనే వస్తున్నారు. సీనియర్ల ఒత్తిళ్లను ఆయన వ్యతిరేకిస్తున్నారు. ఆయన మాటలకు తగ్గట్లుగానే సీనియర్లలో చాలావరకు భజన బృందాల్లాగా తయారయ్యారు. ఒకరకంగా పార్టీకి భారంగా మారారు. సోనియా కుటుంబాన్ని కీర్తిస్తూ ఉంటేచాలు.. తమ మనుగడ గడిచిపోతుందనే భావనకు వచ్చేశారు.
ఇలాంటి పోకడలతో విసిగిపోయి, 2019 పరాజయం కూడా పరిపూర్ణం అయిన తర్వాత.. రాహుల్ అధ్యక్ష స్థానం నుంచి పారిపోయారు. పలువురు బతిమాలినా పట్టించుకోలేదు. దాంతో ఇప్పుడు అనివార్యంగా కొత్త అధ్యక్షుడి ఎన్నిక జరగబోతోంది. అయితే… రాహుల్ ఆలోచనలు, ఆశల మేరకు యువనాయకత్వం చేతికి పగ్గాలు దక్కే అవకాశం మాత్రం కనిపించడం లేదు. కాంగ్రెస్ ను వృద్ధనీడలు వదలిపోవడం లేదు. ప్రస్తుతానికి ఆప్షన్స్‌గా ఉన్న వారిలో చిన్న వృద్ధుడినో, పెద్ద వృద్ధుడినో ఎంచుకునే ప్రయత్నాల్లో ఉన్నారు.
ప్రస్తుతం పార్టీ ప్రధాన కార్యదర్శి ముకుల్ వాస్నిక్ (59), కర్నాటక నాయకుడు మల్లికార్జున ఖర్గే (77) పేర్లను పరిశీలిస్తున్నారు. ఇద్దరూ దళితులే. కాకపోతే 49 ఏళ్ల రాహుల్ వారసులుగా ఈ ఇద్దరు వృద్ధుల్లో ఒకరు పగ్గాలు అందుకుంటారు. వీరితో రాహుల్ ఆలోచిస్తున్నట్లుగా.. వృద్ధరక్తాన్ని కడిగేయడం, యువరక్తం ఎక్కించడం అనేవి సాధ్యమవుతాయా? వీరిది తాత్కాలిక ఎంపికే అని చెబుతున్నారు గానీ.. పూర్తిస్థాయి ఎన్నిక నాడైనా ఇంతకంటె వయసులో చిన్నవారిని ఎన్నుకుంటారా? ముసలివారినే ఆశ్రయిస్తారా? అనేది వేచిచూడాలి.