టీవీ9లోకి బిత్తిరి సత్తి.. అసలు కథ ఇది!

తెలంగాణలో మీడియా సమీకరణాలు శరవేగంగా మారిపోతున్నాయి. మరీ ముఖ్యంగా ఇటు టీఆర్ఎస్, అటు బీజేపీ మీడియాపై ప్రత్యేకంగా దృష్టిపెట్టడంలో భారీగా కుదుపులు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా చేవెళ్ల రవి (బిత్తిరి సత్తి) ఛానెల్ మారిన వ్యవహారం…

తెలంగాణలో మీడియా సమీకరణాలు శరవేగంగా మారిపోతున్నాయి. మరీ ముఖ్యంగా ఇటు టీఆర్ఎస్, అటు బీజేపీ మీడియాపై ప్రత్యేకంగా దృష్టిపెట్టడంలో భారీగా కుదుపులు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా చేవెళ్ల రవి (బిత్తిరి సత్తి) ఛానెల్ మారిన వ్యవహారం కూడా ఇందులో భాగంగానే జరిగిందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. నిన్న సాయంత్రం సత్తి టీవీ9లో అధికారికంగా చేరాడు.

తనకు పేరు, డబ్బు తీసుకొచ్చిన వీ6 ఛానెల్ నుంచి బయటకొచ్చేశాడు సత్తి. ఉద్యోగులు ఇలా ఛానెళ్లు మారడం కొత్తకాదు కానీ సత్తి నేరుగా వెళ్లి టీవీ9లో చేరడం మాత్రం రాజకీయంగా కాస్త ఆసక్తికరంగా మారింది. అందరి దృష్టి ఇటువైపు తిరిగేలా చేసింది. దీనికి కారణం ఈ రెండు ఛానెళ్ల వెనకున్న యాజమాన్యాలు. రాజకీయ కారణాలు. ఎవరు ఔనన్నా కాదన్నా తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి అంతోఇంతో వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న ఛానెల్ వీ6 మాత్రమే.

ఈ ఛానెల్ యజమాని మాజీ ఎంపీ వివేక్. ఒకప్పుడు టీఆర్ఎస్, కేసీఆర్ కు అనుకూలంగా వార్తలు వండివార్చిన ఈ ఛానెలే, ఇప్పుడు కేసీఆర్ పై పూర్తి వ్యతిరేకంగా వార్తలు ఇస్తోంది. తాజాగా వివేక్, బీజేపీలో చేరడంతో వీ6 స్టాండ్ స్పష్టంగా కనిపిస్తోంది. దీనికి కౌంటర్ గానే ఆ ఛానెల్ నుంచి సత్తిని బయటకు లాగినట్టు తెలుస్తోంది. వీ6 ఛానెల్ కు ఆయువుపట్టు బిత్తిరిసత్తి ప్రొగ్రామ్. హైదరాబాద్ లో ఈ ఒక్క కార్యక్రమం వల్లనే వీ6 ఛానెల్ టాప్ లో కొనసాగుతోంది.

ఓవరాల్ గా తెలంగాణలో కూడా ఈ కార్యక్రమమే ఛానెల్ ను నిలబెడుతోంది. ఇలాంటి కార్యక్రమంలో కీలకంగా వ్యవహరిస్తున్న సత్తిని బయటకు లాగింది కేసీఆర్ అనుకూల సంస్థ అలంద మీడియా. కేసీఆర్ అండదండలతో తెలంగాణలో ఇప్పుడిప్పుడే మీడియాను తమ చేతుల్లోకి తీసుకుంటున్న ఈ సంస్థ, కేవలం వీ6ను బలహీన పరిచేందుకే సత్తిని ఇలా తమవైపు లాక్కుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

రీసెంట్ గా టీవీ9 ఛానెల్ ను అలంద మీడియా దక్కించుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సంస్థ తమకు చెందిన మోజో టీవీని కూడా మూసేసింది. మరోవైపు 10టీవీని దిగ్విజయంగా కొనసాగిస్తోంది. ఇంకోవైపు ఎన్టీవీతో తీవ్రంగా చర్చలు సాగిస్తోంది. మరోవైపు యాప్, న్యూస్ పేపర్ తీసుకొచ్చే పనుల్లో కూడా బిజీగా ఉంది.

ఇలా తెలంగాణ మీడియా రంగంలోకి శరవేగంగా దూసుకొస్తున్న అలందా మీడియా… వీ6ను టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే వీ6 నుంచి టీవీ9లోకి సత్తి మారినట్టు తెలుస్తోంది.

సినిమా రివ్యూ: కౌసల్య కృష్ణమూర్తి