ఏమై పోయావ్ క‌న్నా?

త‌న‌ను అనుమానించే రీతిలో ప్ర‌భుత్వ పెద్ద‌లున్నార‌ని క‌న్నా కినుక వ‌హించార‌ని అంటున్నారు. అందుకే క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ మీడియాకు దూరంగా వుంటున్నారు.

టీడీపీ సీనియ‌ర్ నేత‌, ప‌ల్నాడు జిల్లా స‌త్తెనప‌ల్లె ఎమ్మెల్యే క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ ఉలుకూప‌లుకూ లేకుండా ఉన్నారు. అధికార పార్టీలో ఉన్న‌ప్ప‌టికీ, ఎందుకో ఆయ‌న అసంతృప్తిగా ఉన్న‌ట్టు తెలుస్తోంది. మ‌రోవైపు ఆయ‌న కుమారుడు భారీగా అవినీతికి పాల్ప‌డుతున్నార‌నే ఫిర్యాదులు సీఎం చంద్ర‌బాబుకు వెళ్లిన‌ట్టు స‌మాచారం. ఈ నేప‌థ్యంలో క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ రాజ‌కీయంగా ఉనికి లేకుండా ఉండిపోవ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది.

క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌… ఒక‌ప్పుడు కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌. వైఎస్సార్ కేబినెట్‌లో మంత్రిగా ప‌ని చేశారు. వైఎస్సార్ మ‌ర‌ణం, ఆ త‌ర్వాత రాష్ట్ర విభ‌జన నేప‌థ్యంలో ఏపీ రాజ‌కీయాలు మారిపోయాయి. కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కులు త‌లో దారి ఎంచుకున్నారు. క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ బీజేపీలో చేరారు. ఆ త‌ర్వాత 2019 ఎన్నిక‌ల సంద‌ర్భంలో వైసీపీలో చేర‌డానికి ఏర్పాట్లు చేసుకున్నారు. తెల్ల‌వారితే వైసీపీ కండువా క‌ప్పు కోవాల్సిన స‌మ‌యంలో ఢిల్లీ నుంచి బీజేపీ పెద్ద‌లు ఫోన్‌. దీంతో వైసీపీ నిర్ణ‌యాన్ని మార్చుకున్నారు.

ఏపీ బీజేపీకి అధ్య‌క్షుడ‌య్యారు. చంద్ర‌బాబు, జ‌గ‌న్‌ల‌పై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. ఏపీ బీజేపీ అధ్య‌క్ష ప‌ద‌వీ కాలం పూర్త‌యిన త‌ర్వాత ఆయ‌న మౌనాన్ని ఆశ్ర‌యించారు. టీడీపీ కండువా క‌ప్పుకున్నారు. స‌త్తెన‌ప‌ల్లె నుంచి గ‌త ఎన్నిక‌ల్లో పోటీ చేసి గెలుపొందారు. మంత్రి ప‌ద‌విని ఆశించారు. ద‌క్క‌లేదు. అప్పుడే అసంతృఫ్తికి బీజం ప‌డిన‌ట్టు క‌న్నా అనుచ‌రులు చెబుతున్నారు. మ‌రోవైపు స‌త్తెన‌ప‌ల్లె టీడీపీ రెండు వ‌ర్గాలుగా విడిపోయింది. క‌న్నా సామాజిక వ‌ర్గం, చంద్ర‌బాబు సామాజిక వ‌ర్గం వేర్వేరుగా అధికారాన్ని చెలాయిస్తున్నాయి.

త‌న‌ను అనుమానించే రీతిలో ప్ర‌భుత్వ పెద్ద‌లున్నార‌ని క‌న్నా కినుక వ‌హించార‌ని అంటున్నారు. అందుకే క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ మీడియాకు దూరంగా వుంటున్నారు. మ‌రోవైపు త‌న‌పై తీవ్ర ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో వ‌చ్చేసారి టికెట్ ఇస్తార‌నే న‌మ్మ‌కం కూడా ఆయ‌న‌కు లేనట్టు చెబుతున్నారు. అందుకే క‌న్నా మ‌న‌సులో వేరే ఆలోచ‌న‌లున్నాయ‌ని, అందుకు త‌గ్గ‌ట్టుగానే నోరు తెర‌వ‌డం లేద‌ని చెబుతున్నారు.

5 Replies to “ఏమై పోయావ్ క‌న్నా?”

Comments are closed.