సెక్యూరిటీ కోసం విలాపం ఎందుకు బాబూ!

పదవుల్లోంచి దిగిపోయిన తర్వాత.. నాయకులకు మునుపు ఉన్నంత సెక్యూరిటీని కొనసాగించకుండా తగ్గించడం అనేది కొత్తవిషయం కాదు. నిజానికి అధికారంలో ఉండే వ్యక్తి భద్రతకు అవసరమైనంత సెక్యూరిటీ..  మాజీ అయ్యాక ఎందుకు? దేశంలో ఎక్కడైనా సరే..…

పదవుల్లోంచి దిగిపోయిన తర్వాత.. నాయకులకు మునుపు ఉన్నంత సెక్యూరిటీని కొనసాగించకుండా తగ్గించడం అనేది కొత్తవిషయం కాదు. నిజానికి అధికారంలో ఉండే వ్యక్తి భద్రతకు అవసరమైనంత సెక్యూరిటీ..  మాజీ అయ్యాక ఎందుకు? దేశంలో ఎక్కడైనా సరే.. ఇదే తరహాలో భద్రతపరమైన నిర్ణయాలు ఉంటూ ఉంటాయి.. కానీ.. దేశం మొత్తంలో ఒక్క చంద్రబాబునాయుడు మాత్రమే.. తన సెక్యూరిటీ అంశాన్ని రచ్చరచ్చ చేసుకుంటూ రాజకీయ లబ్ధి పొందాలని చూస్తుంటారు. పైగా నాకు భద్రత అనవసరం, నన్ను ప్రజలే కాపాడుకుంటారు అన్నట్లుగా నాటకీయ డైలాగులు కూడా వల్లిస్తుంటారు.

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కు కేంద్ర ప్రభుత్వం గతంలోనే జడ్ ప్లస్ భద్రతను కేటాయించింది. ఇప్పటికీ ఆయనకున్న జడ్ ప్లస్ భద్రత ప్రమాణాలకు ఏమాత్రం లోటు జరగడం లేదు. నిజానికి జడ్ ప్లస్ అంటే 58 మంది సెక్యూరిటీ వారుండాలి. కానీ ప్రస్తుత ప్రభుత్వం అంతకంటె ఎక్కువ మందితోనే ఆయనకు  భద్రత కల్పిస్తోంది. గతంలో చంద్రబాబు సీఎంగా ఉండగా ఉన్న భద్రతకంటె ఇప్పుడు తగ్గిన మాట నిజమే. కానీ.. ఆయనకున్న అర్హత ప్రమాణాలకంటె చాలా ఎక్కువ.

అయినా సరే.. ఈ విషయాన్ని రాద్ధాంతం చేసి ప్రజల సానుభూతి పొందాలనేది తెదేపా నేతల కుట్ర. చంద్రబాబుకు ఉండవిల్లి, హైదరాబాదు రెండు నివాసాలకు కలిపి 183 మందితో భద్రత కల్పిస్తున్నాం అని ప్రభుత్వం చెబుతోంది. జడ్ ప్లస్ కేటగిరీ కింద 67 మందిని  భద్రతకు నియమించినట్లు పోలీసు అధికారులు చెప్పారు. అయితే ఈ రెండింటి వ్యత్యాసం తెలుసుకోకుండా.. తెదేపా వారు యాగీ చేస్తున్నారు.

183 కాకుండా కేవలం 67 మంది మాత్రమే భద్రతలో ఉంటే వారికి స్పష్టంగా తెలిసిపోతుంది కదా.. అనేది ప్రజల సందేహం. కేవలం మొత్తం సిబ్బంది, జడ్ ప్లస్ కేటగిరీ సంఖ్యల మధ్య ఉండే తేడాను పట్టుకుని గొడవ చేస్తున్నారని అంటున్నారు. నిజానికి భద్రత డిమాండు చేయడానికి నాయకులు సిగ్గుపడాలి. మన్మోహన్ సింగ్ కుటుంబాన్ని ఆదర్శంగా తీసుకోవాలి. ప్రధానిగా దిగిపోయాక వారి కుటుంబానికి కల్పించే భద్రతను తిరిగి యిచ్చేసినట్లుగా గతంలో వార్తలు వచ్చాయి. ఆ మాటకొస్తే సోనియా కుటుంబం  భద్రత తగ్గించినా కూడా ఎక్కడా రభస జరగలేదు.

ఇలాంటి కారణంపై .. అంటే ప్రజల నుంచి భద్రతకు ప్రమాదం ఉన్నదని నిత్యం భయపడుతూ.. మళ్లీ ప్రజల్లోకి వెళ్లినప్పుడు.. ప్రజలే నన్ను కాపాడుకుంటారు.. అని నాటకాల డైలాగులు వల్లిస్తూ కాలం గడపడం తెలుగుదేశానికే చెల్లింది.

అంత ధైర్యం ఎవడికైనా ఉందా?