Advertisement

Advertisement


Home > Politics - Gossip

వైసీపీ సీనియ‌ర్ నేతది మౌన‌మా? వైరాగ్య‌మా?

వైసీపీ సీనియ‌ర్ నేతది మౌన‌మా? వైరాగ్య‌మా?

వైసీపీ సీనియ‌ర్ నేత‌, రాజ్య‌స‌భ స‌భ్యుడు వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్‌రెడ్డి కొంత కాలంగా ఆయ‌న మౌనంగా ఉన్నారు. అస‌లు ఆయ‌న పార్టీలో ఉన్నారా?  లేదా? అనే అనుమానం త‌లెత్తుతోంది. నెల్లూరు జిల్లా వైసీపీ అధ్య‌క్షుడు కూడా అయిన వేమిరెడ్డి మౌనం ఆ పార్టీకి తీవ్ర న‌ష్టం క‌లిగిస్తుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఎన్నిక‌ల ముందు, వైసీపీ సీనియ‌ర్ లీడ‌ర్ అయిన వేమిరెడ్డి మౌనం వెనుక ఏదైనా బ‌ల‌మైన కార‌ణం ఉందా? అనే చ‌ర్చ‌కు తెర‌లేచింది.

వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్‌రెడ్డి, ఆయ‌న భార్య ప్ర‌శాంతిరెడ్డి వైసీపీలో యాక్టీవ్‌గా వుండేవారు. వేమిరెడ్డి ప్ర‌శాంతిరెడ్డి ఉత్త‌ర భార‌త‌దేశంలోని టీటీడీ దేవాల‌యాలు, ఆస్తుల అడ్వ‌యిజ‌రీ క‌మిటీ అధ్య‌క్షురాలు.  అంత‌కు ముందు ఆమె టీటీడీ స‌భ్యురాలిగా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించారు.

నెల్లూరు జిల్లాకు చెందిన ఈ దంప‌తులు రాజ‌కీయ మౌనందాల్చ‌డంపై వైసీపీలో భిన్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి. వీరికి వ్య‌తిరేకంగా సొంత పార్టీకే చెందిన ఎమ్మెల్యేను వైసీపీలోని ఒక బ‌ల‌మైన వ‌ర్గం ప్రోత్స‌హిస్తోంద‌ని చెబుతున్నారు. రాష్ట్ర మంత్రి అండ చూసుకుని నెల్లూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యే అన‌వ‌స‌రంగా వేమిరెడ్డి దంప‌తుల‌పై నోరు పారేసుకుంటున్న‌ట్టు చ‌ర్చ జ‌రుగుతోంది. దీంతో వేమిరెడ్డి దంప‌తులు మ‌న‌కెందుకీ రాజ‌కీయాలు అని నిరాశ‌తో ఇంటికే ప‌రిమితం అయ్యార‌ని స‌మాచారం.

ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్ శ్రేయోభిలాషిగా వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్‌రెడ్డి క్షేత్ర‌స్థాయిలో ప్ర‌భుత్వంపై ఫీడ్ బ్యాక్‌ను ఎప్ప‌టిక‌ప్పుడు అందించేవారు. దీంతో జ‌గ‌న్ చుట్టూ ఉన్న కోట‌రీకి వేమిరెడ్డి వ్య‌వ‌హార శైలి న‌చ్చ‌లేద‌ని తెలిసింది. క్షేత్ర‌స్థాయిలో వైసీపీకి అద్భుతంగా ఉంద‌ని ఒక‌వైపు ఈ కోట‌రీ ఎప్ప‌టిక‌ప్పుడు సీఎం జ‌గ‌న్‌కు నివేదిస్తోంది. మ‌రోవైపు ప్ర‌భుత్వంపై అంతా సానుకూలత ఉంద‌న్న ప్ర‌చారం అబ‌ద్ధ‌మ‌ని, స‌రిదిద్దుకోవాల్సిన లోపాలు చాలా ఉన్నాయ‌ని సీఎంకు వేమిరెడ్డి చెప్పేవారు.

ఎప్పుడూ నెగెటివ్ అంశాలే మాట్లాడుతున్నాడ‌నే ముద్ర వేమిరెడ్డిపై వ్యూహాత్మ‌కంగా కొంత మంది కోట‌రీ నాయ‌కులు వేసిన‌ట్టు తెలిసింది. మ‌రోవైపు లోపాల గురించి చెప్పినా జ‌గ‌న్ ప‌ట్టించుకోక‌పోవ‌డం, అలాగే సొంత జిల్లాకు చెందిన యువ ఎమ్మెల్యేని తమ‌పై ఎగ‌తోయ‌డాన్ని వేమిరెడ్డి దంప‌తులు జీర్ణించుకోలేక‌పోతున్నారు. ఈ నేప‌థ్యంలో నెల్లూరు లోక్‌స‌భ స్థానం నుంచి పోటీ చేయ‌డంపై వేమిరెడ్డి దంప‌తులు పున‌రాలోచ‌న‌లో ప‌డ్డ‌ట్టు తెలిసింది.

వైసీపీ రాజ‌కీయాల్లో కూరుకుపోయి మ‌నశ్శాంతి కోల్పోతామ‌ని వేమిరెడ్డి దంప‌తులు భావిస్తున్నార‌ని స‌మాచారం. అందువ‌ల్ల స‌న్నిహితుల వ‌ద్ద త‌మ రాజ‌కీయ వైరాగ్యాన్ని వెల్ల‌డిస్తున్నారు. ఏది ఏమైనా నిజంగా జ‌గ‌న్‌ను అభిమానించే వేమిరెడ్డి జంట‌ను కోల్పోతుండ‌డం ఎన్నిక‌ల స‌మ‌యంలో వైసీపీకి చెడు సంకేత‌మే.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?