ఆంధ్ర శాసనసభ రెండోరోజు వైఎస్ జగన్ చేసిన ప్రసంగం కానీ, చంద్రబాబు చేసిన కామెంట్లు కానీ భలేగా వున్నాయి. జగన్ మాట్లాడుతూ, తాను తలుచుకుని వుంటే చంద్రబాబుకు ప్రతిపక్షనేత హోదా కూడా దక్కేది కాదని, తాను కూడా బాబు మాదిరిగా ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టడం మొదలుపెడితే, ప్రతిపక్షం అనేది వుండదని, అయిదుగురు సభ్యులు అటు నుంచి ఇటువస్తే, చంద్రబాబుకు ప్రతిపక్షనేత హోదా వుండదని, కానీ తను అలా చేయనని జగన్ అన్నారు. చంద్రబాబు ప్రతిపక్ష నేతగా సభలో వుండాలనే తాను కోరుకుంటున్నానని అన్నారు.
దానికి బాబు స్పందిస్తూ, జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా పార్టీ మారిన వ్యక్తేనని, ఆ సంగతి ముందు జగన్ అంగీకరించాలని అన్నారు. కానీ దానికి కూడా జగన్ గట్టిగా సమాధానం ఇచ్చారు. మర్డర్ ఎందుకు చేసావు అంటే, గతంలో ఎందరో మర్డర్లు చేయలేదా? అని చెప్పినట్లు వుందని అన్నారు. నిజానికి పురానా జమానా సంగతులకు వెళ్తే, చంధ్రబాబు కూడా కాంగ్రెస్ నుంచి తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయించిన వ్యక్తే. కానీ బాబుగారికి ఫిరాయింపులు అంటే పెద్దగా అభ్యంతరం లేదు.
జగన్ పార్టీకి చెందిన 23 మంది శాసనసభ్యులను లాక్కోవడం, వారిని మంత్రులను చేయడం వంటి వ్యవహారాలను ఎత్తిచూపిస్తూ, ఘాటుగా విమర్శిస్తుంటే చంధ్రబాబు ముసిముసి నవ్వులు నవ్వడం విశేషం. జగన్ ఘాటు విమర్శలకు బాబు లోలోపల ఏలా ఫీల్ అయ్యారో కానీ, పైకి మాత్రం ఈ నవ్వులు చిందించడం చూసేవారికి ఏమీ అనలేక, కాదనలేక, పైకి నవ్వులు చిందించినట్లు కనిపించింది.