ఆర్‌కేపై సెటైర్ల‌తో గాలి తీసిన జీవీఎల్‌

ఆంధ్ర‌జ్యోతి -ఏబీఎన్ ఎండీ వేమూరి రాధాకృష్ణ (ఆర్‌కే) ఇటీవ‌ల కాలంలో బీజేపీ నుంచి బాగా ఎదురు దెబ్బ‌లు తింటున్నారు. చింత చ‌చ్చినా పులుపు చావ‌ద‌న్న‌ట్టు..టీడీపీ చంద్ర‌బాబునాయుడు రాజ‌కీయంగా భూస్థాపితం అవుతున్నా…ఆయ‌న ప‌ర‌మ భ‌క్తుడు ఆర్‌కేలో…

ఆంధ్ర‌జ్యోతి -ఏబీఎన్ ఎండీ వేమూరి రాధాకృష్ణ (ఆర్‌కే) ఇటీవ‌ల కాలంలో బీజేపీ నుంచి బాగా ఎదురు దెబ్బ‌లు తింటున్నారు. చింత చ‌చ్చినా పులుపు చావ‌ద‌న్న‌ట్టు..టీడీపీ చంద్ర‌బాబునాయుడు రాజ‌కీయంగా భూస్థాపితం అవుతున్నా…ఆయ‌న ప‌ర‌మ భ‌క్తుడు ఆర్‌కేలో మాత్రం ఆ పార్టీపై, అధినాయ‌కుడిపై భ‌క్తి చావ‌లేదు. దీంతో త‌న వారాంత‌పు ప‌లుకులో పొంత‌న లేని వ్యాఖ్యానాలు చేస్తూ అభాసుపాల‌వుతున్నారు.

గ‌త ఆదివారం రాసిన కొత్త‌ప‌లుకు వ్యాసంలో మీ జీవీఎల్‌…మీ ఇష్టం అంటూ బీజేపీకి ఆ పార్టీ జాతీయ అధికార ప్ర‌తినిధి, రాజ్య‌స‌భ స‌భ్యుడు జీవీఎల్ న‌ర‌సింహారావు తీర‌ని న‌ష్టం క‌లిగిస్తున్నార‌ని ఆవేద‌న చెందుతూ అక్ష‌ర విన్యాసం చేశారు. అంతే కాదు, జీవీఎల్‌ను కంట్రోల్ చేయ‌క‌పోతే ఏపీలో బీజేపీ స‌ర్వ‌నాశ‌న‌మ‌వుతుంద‌ని హెచ్చ‌రించిన విష‌యం తెలిసిందే. ఆర్‌కే కామెంట్స్‌పై అదేరోజు బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు సోము వీర్రాజు తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. జీవీఎల్‌పై ఆర్‌కే కామెంట్ప్‌…సోము వీర్రాజు స్పంద‌న ఏంటో ఒక‌సారి చూద్దాం.

‘గతంలో అడ్డగోలుగా ప్రధాని మోదీ గారిని, వారి కుటుంబాన్ని, బీజేపీని టార్గెట్ చేసిన మీకు సడెన్‌గా బీజేపీపై ప్రేమ పుట్టిందని, మేము ఆంధ్రప్రదేశ్‌లో ఎదగటం లేదని మీరు తెగ ఫీల్ అవుతున్నారని మీ విశ్లేషణ ద్వారా తెలిసింది. ఆ విశ్లేషణ వెనుక కొత్తగా బీజేపీ పైన పుట్టిన ప్రేమ కాదని, ఇది పతనానికి చేరువలో ఉన్న చంద్రబాబునాయుడు గారిని, టీడీపీని రక్షించే ప్రయత్నమని ఇట్టే పిల్లలకు కూడా అర్థమైపోతుంది. మరీ ఇంత పబ్లిక్‌గా, నిర్లజ్జగా పత్రికను అడ్డం పెట్టుకుని మా అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవడం తగునా చెప్పండి’ ….అని ఆర్‌కే వీపు విమానం మోత మోగించారు. వీర్రాజు వాత‌లు మాన‌క‌నే జీవీఎల్ కూడా ఆర్‌కేపై వ్యంగ్యాస్త్రాలు విసిరారు.

జీవీఎల్ మీడియాతో మాట్లాడుతూ ప‌రోక్షంగా ఆర్‌కేకు త‌గ‌లాల్సిన చోట త‌గిలేలా మాట్లాడారు. ఆ మాట‌లేంటో తెలుసుకుందాం.

‘కాంగ్రెస్ తరహాలోనే టీడీపీ కూడా అలాగే ఉంది. ఏపీలో టీడీపీ కూడా అదే పరిస్థితి ఎదుర్కొంటోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ ప్రజల అభిమానం చూరగొని అధికారంలోకి వస్తుందనే నమ్మకం ఉంది. టీడీపీకి ఇంకో మైనస్ పాయింట్ అధికారంలో లేక పోవడం, మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశం లేకపోవడమే. తెలుగుదేశం పార్టీని అభిమానించే పత్రికాధినేతలు ఉన్నారు. కాం గ్రెస్, టీడీపీలను కూడా ‘మీ రాహుల్ మీ ఇష్టం …మీ లోకేశ్‌ మీ ఇష్టం’ అంటారో లేదో చూడాలి’ అంటూ చెణుకులు విసిరారు.

ఇటీవ‌ల కాలంలో సోము వీర్రాజు బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు అయిన త‌ర్వాత ప్ర‌ధానంగా ఎల్లో మీడియాను టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు. ఓ ప‌థ‌కం ప్ర‌కారం బీజేపీని ప్ర‌జ‌ల్లో అభాసుపాలు చేయ‌డానికి టీడీపీ త‌న ఎల్లో మీడియాను అడ్డుపెట్టుకుని ఆడుతున్న డ్రామాల‌కు చెక్ పెట్టే య‌త్నంలో బీజేపీ చురుగ్గా పావులు క‌దుపుతోంది.

ఇందులో భాగంగానే వీర్రాజు, జీవీఎల్‌, విష్ణు త‌దిత‌ర నేత‌లంతా ఏ మాత్రం స‌మ‌యం, సంద‌ర్భం దొరికినా ఎల్లో మీడియాను ఉతికి ఆరేస్తున్నారు. ఆ ప‌రంప‌ర‌లోనే ఆర్‌కేపై జీవీఎల్ తాజా వ్యాఖ్యాల‌ను చూడాల‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. మొత్తానికి త‌న‌పై  ఆర్‌కే విష‌పూరిత‌ రాత‌ల‌కు జీవీఎల్ అదును చూసి స‌రైన సెటైర్లు విసిరి గాలి తీశారని సోష‌ల్ మీడియాలో నెటిజ‌న్లు కామెంట్స్ చేస్తున్నారు.

బాబు వెన్నుపోటుకు 25 ఏళ్ళు

ఆ సినిమా ఎవడూ చూడడని ముందే తెలుసు