దేశంలో కరోనా వైరస్ విస్తరించిన తీరు గురించి ప్రభుత్వం ఒక అంచనాకు రావడానికి అవకాశం ఏర్పడింది. ఇప్పటికే లాక్ డౌన్ మొదలై దాదాపు నెల గడిచిపోయింది. ఈ క్రమంలో ఇప్పటి వరకూ నమోదైన కేసుల గురించి సమాచారాన్ని విశ్లేషించుకుంటే.. సగం భారత దేశంలో ఇప్పటి వరకూ కరోనా వైరస్ వ్యాప్తి లేదనే విషయాన్ని గమనించవచ్చు. ఇప్పటి వరకూ రిజిస్టర్ అయిన కేసులన్నీ 401 జిల్లాల్లో అని తెలుస్తోంది. మిగిలిన 325 జిల్లాల్లో కరోనా కేసుల జాడ లేదని ఆయా రాష్ట్ర ప్రభుత్వాల నివేదికలను బట్టి తెలుస్తోంది. ఇలా దాదాపుగా సగం భారత దేశంలో ఇప్పటి వరకూ ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని స్పష్టం అవుతోంది.
ఇక మరో విషయం ఏమిటంటే.. మొత్తం కరోనా కేసుల్లో దాదాపు 46 శాతం కేసులు కేవలం 18 జిల్లాల పరిధిలోనే నమోదైనవి కావడం! 401 జిల్లాల్లో కరోనా విస్తరించింది. అయితే 18 జిల్లాల్లోనే మొత్తం 46 శాతం కేసులున్నాయి. మిగిలిన దాదాపు 383 జిల్లాల్లో జిల్లాల్లో కలిపి 54 శాతం కేసులున్నాయని నివేదికల ఆధారంగా తెలుస్తోంది.
మహారాష్ట్రంలోని ముంబై, మధ్యప్రదేశ్ లోని ఇండోర్, చత్తీస్గడ్ లోని కోర్బా, జార్ఖండ్ లోని రాంచీ, ఒడిశాలోని కుర్దా, తెలంగాణలోని హైదరాబాద్.. ఆ యా రాష్ట్రాల్లో అత్యధికంగా కేసులు నమోదు అయిన జిల్లాలు ఇవి. ఆయా రాష్ట్రాల్లో నమోదు అయిన కేసుల్లో 50 శాతం కేసులు ఈ జిల్లాల్లోనే ఉన్నాయట.
లాక్ డౌన్ దాదాపు నెల రోజులు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఇదీ పరిస్థితి. దేశంలో 17 వేలకు పైగా కేసులు నమోదు అయ్యాయి. దాదాపు 543 మంది కరోనాతో మరణించారు. 2,547 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 14,175 స్థాయిలో యాక్టివ్ కేసులున్నాయి.