విశాఖ నాలుగు దశాబ్దాల క్రితం ఈ విధంగా లేదు. మునిసిపాలిటీ నుంచి కార్పోరేషన్ గా అపుడే ప్రమోట్ అయింది. ఒక విధంగా సాధారణ పట్టణంగా ఉన్న విశాఖలో మెగా సిటీని చూసిన దార్శికుడు తాజాగా కన్ను మూసిన రిటైర్డ్ ఐఎఎస్ అధికారి ఎస్వీ ప్రసాద్ అని చెప్పాలి.
ఆయన సర్వీసు తొలి రోజులలో విశాఖ మునిసిపల్ కార్పోరేషన్ కి కమిషనర్ గా పనిచేశారు. విశాఖ అందాలను రెట్టింపు చేసే కార్యక్రమానికి ఆయన నాడే శ్రీకారం చుట్టారు.
విశాఖ ఆసియాలోనే అభివృద్ధి చెందే నగరాల్లో ఒకటి అవుతుందని ఊహించి ఆయన ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. విశాఖ తొలి మేయర్ ఎన్ ఎస్ ఎన్ రెడ్డి ఎస్వీ ప్రసాద్ ని విశాఖ సుందరిగా అభివర్ణించేవారు అంటే విశాఖతో ఆయనకు ఉన్న బంధం చెప్పనలవికాదు.
విశాఖతో ఎస్వీ ప్రసాద్ అనుబంధం అంతటితో ఆగిపోలేదు. ఆయన విశాఖ కలెక్టర్ గా 1985 ప్రాంతాల్లో పనిచేశారు. విశాఖ సర్వతోముఖాభివృద్ధికి ఆయన నాడే పునాది రాయి వేశారు.
తనదైన పనితీరుతో విశాఖలో ఎందరో అభిమానులను సంపాదించుకున్న ఆయన కరోనాతో కన్ను మూయడం, ఆయన సతీమణి లక్ష్మి కూడా ఇదే వ్యాధితో అసువులు బాయడం పట్ల నాటి తరం ఆయన మిత్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఈ రోజు మన మధ్య లేకున్నా విశాఖ కోసం చేసిన పనులు మాత్రం ఎప్పటికీ చరిత్రలో మిగిలే ఉంటాయని వారంతా నివాళి అర్పిస్తున్నారు.