టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఎంత పట్టుదల మనిషో ఇప్పుడిప్పుడే తెలిసి వస్తోంది. టెన్త్, ఇంటర్ పరీక్షలను ఎలాగైనా రద్దు చేయించి క్రెడిట్ కొట్టాలనే లోకేశ్ పోరాటం ముచ్చటేస్తోంది. టెన్త్, ఇంటర్ పరీక్షల విషయంలో లోకేశ్ ఎంటర్ కాకపోయి ఉంటే… అసలీ సమస్యే ఉండేది కాదు. ఈ పరీక్షలను మిగిలిన అన్ని రాష్ట్రాల మాదిరిగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా వాయిదా వేసేది.
పొరపాటో, గ్రహపాటో …ఏ రోజైతే టెన్త్, ఇంటర్ పరీక్షలను రద్దు చేయాలనే డిమాండ్‌ను లోకేశ్ తెరపైకి తెచ్చారో, అప్పుడే అది రాజకీయ రంగు పులుముకుంది. తాజాగా సీబీఎస్ఈ పరీక్షలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు లోకేశ్ మరింత దూకుడుగా వ్యవహరిస్తున్నారు.
కరోనా పరిస్థితుల దృష్ట్యా రాష్ట్రంలో టెన్త్, ఇంటర్ పరీక్షల రద్దును డిమాండ్ చేస్తూ పలువురు విద్యార్థులు, తల్లిదండ్రులతో బుధవారం ఆయన వర్చువల్‌గా ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ అక్రమ సంపాదనపై ధ్యాస తప్ప విద్యార్థుల బాగోగులు పట్టించుకునే సమయం సీఎం జగన్‌కు లేకపోవడం దురదృష్టకరమన్నారు.
ఆగస్ట్, సెప్టెంబర్‌లో కరోనా థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందని.. అది పిల్లలపై ఎక్కువ ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారని లోకేశ్ గుర్తుచేశారు. విద్యార్థుల్ని బలిచేయవద్దని సీఎంను కోరారు. టెన్త్, ఇంటర్ పరీక్షల రద్దుపై ఎంతో పట్టుదలతో పోరాడుతున్న లోకేశ్ …ఎన్నికల పరీక్షల్లో తాను పాస్ ఎందుకు కాలేకపోయా రన్నదే ఇప్పుడు అందరి డౌట్.
టీడీపీ భవిష్యత్ నాయకుడిగా, ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడిగా ఎన్నికల బరిలో నిలిచి గెలవాలనే పట్టుదల ఎందుకు లేకపోయిందనేదే అందరి అనుమానం. ఎన్నికలనే సరికి లోకేశ్‌లో ఏదో తెలియని భయం ఆవహిస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే చతికిల పడ్డారని చెబుతున్నారు.
ఎన్నికల కురుక్షేత్రంలో కూడా ఇదే పట్టుదలతో వ్యవహరిస్తే లోకేశ్ తప్పక విజయం సాధిస్తారంటున్నారు. తానే కాదు, తన పార్టీని కూడా గెలుపు బాటలో నడిపించాల్సిన కర్తవ్యం తనపై వుందని లోకేశ్ గుర్తెరిగి హూందాగా నడుచుకోవాల్సి వుంది.