తన పార్టీ నాయకుడి కుమారుడి మృతిపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర కలత చెందారు. భారమైన పదాలతో తన ఆవేదనను పంచుకున్నారు. మాజీ ఎంపీ మాగంటి బాబు కుమారుడు రవీంద్రనాథ్ మృతికి చంద్రబాబు నివాళులర్పిస్తూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. రవీంద్రనాథ్ మరణవార్త తనను తీవ్రంగా కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.
మాజీ ఎంపీ మాగంటి బాబు ఇప్పటికే ఒక కుమారుడిని కోల్పోయారని, ఇప్పుడు మరో కుమారుడిని కోల్పోవడం అత్యంత విషా దకరమని పేర్కొన్నారు. మాగంటి బాబు దంపతులు ఇద్దరు కుమారులను కోల్పోయి తీవ్ర పుత్రశోకంతో ఉండడాన్ని చూసిన బాధలో తన గుండె బరువెక్కిందని చంద్రబాబు తల్లడిల్లారు.
ఈ కష్టకాలంలో గుండె నిబ్బరం చేసుకుని, పరిస్థితుల్ని తట్టుకుని నిలబడేలా ఆ కుటుంబానికి మనో ధైర్యం ఇవ్వాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నట్లు చంద్రబాబు పేర్కొన్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లో ఓ హోటల్‌లో రవీంద్రనాథ్ అనుమానాస్పద స్థితిలో నిన్న మృతి చెందిన సంగతి తెలిసిందే.
బంజారాహిల్స్ పోలీసులు వివరాలు సేకరించి, మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మాగంటి బాబు ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.