సుజ‌నాను ర‌క్షించండి-ఆయ‌న బ్యాంకుల‌ను ర‌క్షిస్తాడు

‘సుజ‌నాచౌద‌రిని ర‌క్షించండి…ఆయ‌న బ్యాంకుల‌ను ర‌క్షిస్తాడు’ అనే స‌రికొత్త నినాదం ఏపీలో మార్మోగుతోంది. బీజేపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు సుజ‌నాచౌద‌రి మంగ‌ళ‌వారం ముచ్చ‌ట‌గా సీఎం జ‌గ‌న్‌కు ప‌ది పేజీల లేఖ‌ను రాశాడు. రాజ‌ధాని మార్పుపై ఆయ‌న తీవ్ర…

‘సుజ‌నాచౌద‌రిని ర‌క్షించండి…ఆయ‌న బ్యాంకుల‌ను ర‌క్షిస్తాడు’ అనే స‌రికొత్త నినాదం ఏపీలో మార్మోగుతోంది. బీజేపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు సుజ‌నాచౌద‌రి మంగ‌ళ‌వారం ముచ్చ‌ట‌గా సీఎం జ‌గ‌న్‌కు ప‌ది పేజీల లేఖ‌ను రాశాడు. రాజ‌ధాని మార్పుపై ఆయ‌న తీవ్ర ఆవేద‌న‌తో రాసుకున్న ఉత్త‌రం అది. ఆ ఉత్త‌రం మొత్తం సారాంశం ఏంటంటే ‘అయ్యా జ‌గ‌న్ అమ‌రావ‌తిని ర‌క్షించండి – అది ఆంధ్ర‌ను ర‌క్షిస్తుంది’  అని. అమ‌రావ‌తిని రాజ‌ధానిగా కొన‌సాగిస్తే రూ.1.13 ల‌క్ష‌ల కోట్ల ఆదాయం ద‌క్కుతుంద‌ని లెక్క‌లేసి మ‌రీ చెప్పాడాయ‌న‌. ఒక‌వేళ త‌న మాట కాదు కూడ‌ద‌ని విశాఖకు బ‌ల‌వంతాన తీసుకెళితే రైతుల‌కు రూ.4 ల‌క్ష‌ల కోట్ల ప‌రిహారం చెల్లించాల్సి వ‌స్తుంది…జాగ్ర‌త్త అని కూడా హెచ్చ‌రించాడు.

ఈ సంద‌ర్భంగా వేమ‌న శ‌త‌కాన్ని గుర్తు చేసుకుందాం.

అల్పుడెపుడు పల్కు నాడంబరము గాను
సజ్జనుండు బల్కు చల్లగాను
కంచు మ్రోగినట్లు కనకంబు మ్రోగునా
విశ్వ దాభిరామ! వినుర వేమ!

అంటే  అల్పుడు ఆడంబరంగా మాట్లాడుతాడు. మంచివాడు శాంతంగా మాట్లాడుతాడు. కంచు మోగిన‌ట్టు  బంగారం మోగునా! అల్పుడు కంచుతోనూ, సజ్జనుడు బంగారంతోనూ సమానమ‌ని వేమ‌న చెప్పిన నీతి.

అయ్యా సీఎం గారూ మ‌న కాలపు సుజ‌నుడు (వేమ‌న చెప్పిన స‌జ్జ‌నుడు) మీ మేలు కోరి చ‌ల్ల‌ని మాట‌లు చెప్పాడు. ఇప్ప‌టికైనా ఆయ‌న మాట‌లు విని రాజ‌ధానిని త‌ర‌లించ‌కుండా, బుద్ధిగా అమ‌రావ‌తిలోనే ఉంటూ సుజ‌న‌తో పాటు వారికి సంబంధించిన భూముల‌కు రేట్లు బాగా ఉండేలా చూసుకో. వేమ‌న చెప్పిన‌ట్టు బంగారు లాంటి సుజ‌నాచౌద‌రి మాట కాద‌నకు. ఒక‌వేళ ఆయ‌న చెప్పిన‌ట్టు వినక‌పోతే ఏ గ‌తి ప‌డుతుందో కూడా చెప్పాడు క‌దా!
 
మీరు ఎప్పుడైనా తిరుమ‌ల కొండ ఎక్కేట‌ప్పుడు జాగ్ర‌త్త‌గా గ‌మ‌నిస్తే అడుగ‌డుగునా ‘ధ‌ర్మో ర‌క్ష‌తి ర‌క్షితః’ ;  ‘వృక్షోః ర‌క్ష‌తి ర‌క్షితః’ అని క‌నిపిస్తుంటాయి.   ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుందని, అలాగే వృక్షాల‌ను మ‌నం ర‌క్షిస్తే అవి మ‌న‌ల్ను ర‌క్షిస్తాయ‌ని వాటి భావం. బ‌హుశా ఈ నినాదాల నుంచి స్ఫూర్తి పొందిన సుజ‌నాచౌద‌రి సీఎంకు ఓ అద్భుత‌మైన సందేశాన్ని ఇచ్చాడు. అదేంటంటే  ‘అమ‌రావ‌తిని ర‌క్షించండి – అది ఆంధ్ర‌ను ర‌క్షిస్తుంది’  అని జ‌గ‌న్‌కు జ్ఞానోద‌యం క‌లిగించే గొప్ప సూక్తిని లేఖ ద్వారా చేర‌వేశాడు.

అయితే గొప్ప మాట చెప్పిన సుజ‌నాచౌద‌రి రుణాన్ని సోష‌ల్ మీడియా ఊరికే ఉంచుకోద‌ల‌చ‌లేదు.  సీఎం సార్ ‘సుజ‌నాచౌద‌రిని ర‌క్షించండి- ఆయ‌న బ్యాంకుల్ని ర‌క్షిస్తాడు’ అని త‌న‌దైన శైలిలో సోష‌ల్ మీడియా చెప్పింది. అయ్యా జ‌గ‌న్ గారూ సుజ‌నాచౌద‌రి మాట‌లే కాదు…కాస్తా నాణేనికి రెండో వైపు కూడా చూడండి.