తనది 40 ఏళ్ల పొలిటికల్ ఇండస్ట్రీ అని, 14 ఏళ్లు సీఎంగా పనిచేశానని చెప్పుకుంటున్న చంద్రబాబు అందుకు తగ్గట్టు హూందాగా ఏనాడూ మాట్లాడరు. ఇప్పుడు రాజధాని విషయంలో కూడా ఆయన మాటలు వినేవారికి నవ్వాలో ఏడ్వాలో తెలియని స్థితి. ఎలాగైనా అమరావతిని కాపాడుకోవాలని ఆయన కొడుతున్న పల్టీలు సర్కస్‌ను మరిపిస్తున్నాయి.
‘విశాఖ ప్రజలు చాలా మంచివాళ్లు. నీతి, నిజాయితీ ఉన్నవాళ్లు. అందుకే వాళ్లు రాజధాని కోరలేదు, కోరుకోరు. ఎవరు అడిగారని విశాఖలో రాజధాని పెడుతున్నారు’ అని ప్రతి మీటింగ్‌లో చంద్రబాబు అడుగుతున్న ప్రశ్న. ఈ సందర్భంగా బాబు నుంచి కొన్ని సమాధానాలను జనం ఆశిస్తున్నారు.
అడగకుండానే చేసేవాడిని ‘రూలర్’ అంటారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలు ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత వెనుకబడిన ప్రాంతాలు కాదా? ఉత్తరాంధ్రలో ఒక్క విశాఖ నగరం మినహాయించి మిగిలిన ప్రాంతాల్లో ఎక్కడైనా అభివృద్ధి కనిపిస్తోందా? బతుకుతెరువు కోసం శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో వలసలు వెళుతుండడం వాస్తవం కాదా?
రాజధాని రాక వల్ల తమ భూములకు ధర పెరిగి లబ్ధి పొందవచ్చని, ఆంధ్రజ్యోతి ఆర్‌కే చెప్పినట్టు తమ ఆడబిడ్డలకు రూ.2 కోట్లు కట్న కానుకల కింద ఇవ్వొచ్చనే స్పృహ, ముందు చూపు కలిగించడంలో మీ 40 ఏళ్ల రాజకీయం ఎందుకు విఫలమైంది?
తమిళనాడు నుంచి విడిపోయినప్పటి నుంచి విజయవాడలోనే రాజధాని పెట్టాలని డిమాండ్ చేయడం వెనుక ఉన్న చైతన్యం, వ్యాపార కోణం విశాఖ వాసుల్లో లేకపోవడానికి కారణం ఉత్తరాంధ్రలో ఆర్థిక, సామాజిక అసమానతలు, వెనుకబాటు కాదా? వాటిని రూపుమాపడానికి 40 ఏళ్ల రాజకీయంలో, 14 ఏళ్లుగా సీఎంగా పనిచేసిన వ్యక్తి ఏనాడైనా చేశారా?
శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం తమకు రాజధాని లేదా కనీసం హైకోర్టు అయినా ఇవ్వాలని దశాబ్దాలుగా డిమాండ్ చేస్తున్న ఆ ప్రాంత ఆకాంక్షను పట్టించుకున్నెదెప్పుడు? రాజధాని అడగకపోతే మంచి వాళ్లు, అడిగితే మీ దృష్టిలో ఫ్యాక్షనిస్టులా?
రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రజల అజ్ఞానం, అమాయకత్వంపై మీ ఆర్థిక సామ్రాజ్యాలను నిర్మించుకుని, అధికారాన్ని సుస్థిరం చేసుకోవాలనే కుట్రలు బద్దలవుతున్నాయని గిలగిలలాడుతున్నారా? అమరావతిపై మరెందుకు అంత ప్రేమ? పదేపదే కుటుంబ సభ్యుల్ని కూడా తీసుకెళ్లి రాజధాని రైతుల దీక్షకు సంఘీభావం ప్రకటించడానికి కారణం ఏంటి?
తమకు రాజధాని వల్ల కలిగే ప్రయోజనాల గురించి కనీస ఆలోచన, ఆకాంక్ష, చైతన్యం లేకుండా ఉత్తరాంధ్ర , విశాఖ వాసులను చీకట్లో మగ్గేలా చేసిన 14 ఏళ్ల ముఖ్యమంత్రి…ఇది మీరు సిగ్గుపడాల్సిన సందర్భం కాదా? విశాఖవాసులు ఎప్పుడైనా రాజధాని కావాలని కోరారా అని అడగడం కంటే సిగ్గుమాలిన పని మరొకటి ఉందా?