తను ఎంతగానో కోరుకున్న పదవి ఎంతో కష్టం తర్వాతే దక్కినా, అందులో కూర్చున్న తర్వాత ప్రశాంతంగా ఉండలేకపోతున్నట్టుగా ఉన్నారు కర్ణాటక సీఎం బీఎస్ యడియూరప్ప. గత పదేళ్లలో సీఎం సీటు కోసం యడియూరప్ప ఎన్నో ప్రయత్నాలు చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా కుంపటి పెట్టారు. అలా ఎదుర్కొన్న ఎన్నికల్లో బీజేపీ చిత్తు అయ్యింది, యడియూరప్ప కూడా దెబ్బతిన్నారు. ఆ తర్వాత ఐదేళ్లు పోరాడారు. అయినా కనీస మెజారిటీ రాలేదు.
ముఖ్యమంత్రి అయ్యారు కానీ, మూడు రోజులకే రాజీనామా చేయాల్సి వచ్చింది. మరో ఏడాదిన్నర పాటు రకరకాల కుయుక్తులు పన్నితే కానీ యడియూరప్పకు సీఎం సీటు దక్కలేదు. అలా చివరకు సీఎం కాగలిగారు కానీ, అంతలోనే ముగ్గురు డిప్యూటీ సీఎంలను నియమించి అధిష్టానం కట్టడి చేసింది. పేరుకు యడియూరప్ప సీఎం అయినా.. ఆయనను అన్ని రకాలుగానూ అధిష్టానం కట్టడి చేస్తోందనే ప్రచారం జరుగుతూ ఉంది.
ఇక తన సీటును నిలబెట్టిన తిరుగుబాటు ఎమ్మెల్యేల మీద యడియూరప్ప చాలా ప్రేమను వ్యక్తం చేస్తూ ఉన్నారు. వారందరినీ మంత్రులుగా చేస్తామని పదే పదే ప్రకటనలు చేస్తూ ఉన్నారు. అయితే పార్టీలో మరింత మంది మంత్రి పదవుల మీద మోజుతో ఉన్నారు. అలాంటి వారు స్వామీజీల సిఫార్సులను తీసుకొస్తున్నట్టుగా ఉన్నారు. ఈ క్రమంలో ఒక స్వామీజీ ఒక బహిరంగ వేదిక మీద ఒక ఎమ్మెల్యేకు మంత్రి పదవి విషయంలో యడియూరప్పకు ఆదేశంలాంటి సలహా ఒకటి ఇవ్వడంతో ఆయన అసహనభరితుడు అయిపోయారు.
మంత్రి పదవుల విన్నపాలతో విసిగిపోయిన యడియూరప్ప తను పదవిని వదులుకోవడానికి కూడా సిద్ధమనేంత స్థాయిలో అసహనం వ్యక్తం చేయడం గమనార్హం. అవతల అధిష్టానం కట్టడి చేయడం, మరోవైపు మంత్రి పదవుల డిమాండ్లు.. పైగా వృద్ధాప్యం.. ఈ పరిణామాల్లో యడియూరప్ప అసహనం వ్యక్తం చేసి ఉండవచ్చునేమో!