పిల్లి మెడలో ముందు ఎవరు గంట కడతారు అనే సామెత తెలిసిందే. అదే విధంగా తయారైంది ఆర్టీసీతో ప్రభుత్వం చర్చల వ్యవహారం. ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయాలనే ప్రధాన డిమాండ్ పై స్పష్టత ఇచ్చిన తర్వాతే చర్చలు ప్రారంభించాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తుంటే.. అది మినహా మిగతా 21 అంశాలపైన ముందుగా చర్చిద్దామని ప్రభుత్వం నియమించిన అధికారుల బృందం అంటోంది. ఇదే కారణంతో శనివారం నాటి చర్చలు విఫలమవ్వగా, సరిగ్గా ఇదే కారణంతో ఇవాళ కోర్టు వాదనలు కూడా వాయిదాపడ్డాయి.
తాము 45 డిమాండ్లు చేశామని, వాటిలో ఆర్టీసీ విలీనం కూడా ఒకటని, కాబట్టి అన్ని డిమాండ్లపై సమగ్రంగా చర్చ జరగాలని ఆర్టీసీ కార్మిక సంఘాల తరఫు న్యాయవాది వాదించారు. అటు ప్రభుత్వం మాత్రం ఆర్థిక భారం పడని 21 డిమాండ్లపై ముందుగా చర్చించాలని కోర్టుకు విన్నవించింది. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు.. అటు ప్రభుత్వానికి, ఇటు కార్మిక సంఘాలకు కలిపి చీవాట్లు పెట్టింది.
రాత్రికి రాత్రి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయమని అడగడం సమంజసం కాదని, ఆర్థికభారం పడని డిమాండ్లపై ముందుగా చర్చించాలని కార్మిక సంఘాలకు సూచించింది కోర్టు. అటు ప్రభుత్వానికి కూడా అక్షింతలు వేసింది. చర్చల విషయంలో ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని.. పూర్తిగా బస్సు రవాణాపై ఆధారపడిన ప్రాంతాల్లో.. రవాణా సౌకర్యం అందక ఓ చిన్నారి మరణిస్తే, అందుకు ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా అని సూటిగా ప్రశ్నించింది.
అదే సమయంలో కార్మికుల డిమాండ్లు సాధ్యం కావని ప్రభుత్వం ముందుగానే ఎలా ఓ అంచనాకు వస్తుందని కోర్టు ప్రశ్నించింది. ఆర్టీసీ సమ్మె చట్టవిరుద్ధమని చెబుతున్న ప్రభుత్వం.. గతంలో ఇదే ఆర్టీసీ కార్మికులు చేసిన పలు సమ్మెలను గుర్తించి, అప్పట్లో అడిగిన డిమాండ్లను ఎందుకు నెరవేర్చిందని ప్రశ్నించింది. పనిలోపనిగా మరోసారి ప్రజలు పడుతున్న ఇబ్బందుల్ని ప్రభుత్వానికి గుర్తుచేసింది.
ఇలా ఇటు కార్మిక సంఘాలకు, అటు ప్రభుత్వానికి మొట్టికాయలు వేసిన కోర్టు.. తదుపరి విచారణను రేపటికి వాయిదావేసింది. ఎల్లుండి వరకు గడువు ఇవ్వాలని ప్రభుత్వం కోరినప్పటికీ, కోర్టు నిరాకరించింది. రేపటికి ఓ మధ్యేమార్గ ఆలోచనతో రావాలని సూచించింది. ఇటు ప్రభుత్వం, అటు కార్మిక సంఘాలు పట్టువిడుపులు ప్రదర్శించాలని, ఏదో ఒక పాయింట్ దగ్గర కాంప్రమైజ్ కావాలని సూచించింది.
ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయాలనేదే కార్మికుల ప్రధాన డిమాండ్. దానికే కోర్టులో పరోక్ష వ్యతిరేకత వ్యక్తమైన నేపథ్యంలో, కార్మికులు అయోమయంలో పడ్డారు. రాత్రికిరాత్రి విలీనం సాధ్యమా అంటూ కోర్టు ప్రశ్నించడం కార్మికులకు కాస్త ఎదురుదెబ్బ అనే చెప్పాలి. అలాఅని అటు ప్రభుత్వాన్ని కూడా కోర్టు పూర్తిగా సమర్థించకోవడంతో కార్మిక సంఘాలు కాస్త ధైర్యంగా ఉన్నాయి. ఈ వ్యవహారం రేపు సాయంత్రానికి ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉందంటున్నారు. మరోవైపు ఖమ్మం జిల్లా సత్తుపల్లి డిపోకు చెందిన ఓ మహిళా కండక్టర్ ఆత్మహత్య చేసుకున్నారు. ఈ అంశం రేపు కోర్టులో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది.