175 స్థానాల్లో 151 సీట్లు గెల్చుకోవడమంటే మాటలు కాదు. పటిష్టమైన స్థితిలో ఉన్న వైసీపీకి ఇంకా నేతలు అవసరమా? ప్రతి నియోజకవర్గంలో అంతోఇంతో బలమైన నేతలు ఉన్న నేపథ్యంలో.. ఇతర పార్టీల నుంచి మరికొంతమందిని తీసుకోవడం ఇప్పుడున్న పరిస్థితుల్లో అవసరమా? గతంలో చంద్రబాబు చేరికలను ప్రోత్సహించినప్పుడు విమర్శించిన జగన్.. ఇప్పుడు వైసీపీలోకి టీడీపీ నేతలు వస్తానంటే పచ్చజెండా ఊపడం కరెక్టేనా. పోనీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే వస్తారనుకుందాం.. అంతమాత్రాన ఏ లాభాపేక్షా లేకుండా కేవలం ప్రజా సేవ కోసమే వారంతా పార్టీ మారుతున్నారంటే జనం నమ్ముతారా? అర్థంపర్థం లేని ఉప ఎన్నికలను ప్రజలు సమర్థిస్తారా?
జగన్ మనసులో ఏముందో కానీ.. గన్నవరం నుంచి మాత్రం చేరికలు మొదలవుతున్నాయనే సంకేతాలు స్పష్టంగా వెలువడుతున్నాయి. తను రాజకీయాలకు దూరం అంటూ ప్రస్తుతానికి వల్లభనేని వంశీ చెబుతున్నప్పటికీ ఊహాగానాలు మాత్రం ఆగడం లేదు. దీనికితోడు మరికొంతమంది కూడా వంశీ బాట పట్టే అవకాశముంది. అయితే ఈ చేరికలతో వైసీపీకి లాభం ఏంటనేది ఇక్కడ ప్రధానమైన ప్రశ్న. అప్పటి వరకూ పార్టీని నమ్ముకుని ఉన్నవారు గొడవచేస్తే ఎవరికి నష్టం. ఇప్పటికే గన్నవరంలో నియోజక వర్గ ఇంచార్జి యార్లగడ్డ వెంకట్రావు సందడి మొదలు పెట్టారు.
అటు పర్చూరు నియోజకవర్గంలో కూడా కొంతమంద చోటా మోటా నేతలు టీడీపీ నుంచి వైసీపీలోకి రావడాన్ని దగ్గుబాటి వర్గం జీర్ణించుకోలేకపోతోంది. ఇలాంటి టైమ్ లో జగన్ వలసల్ని ప్రోత్సహించడం కరెక్టేనా అనే చర్చ నడుస్తోంది. పార్టీలోకి వస్తోంది ఎమ్మెల్యేనా, లేక ఓడిపోయిన నేతా అనేది అప్రస్తుతం ఇక్కడ. అసలు వలస అనేది ఎందుకనేది ప్రశ్న.
వాస్తవాలు మాట్లాడుకోవాలంటే.. వైఎస్సార్ మరణం తర్వాత వైసీపీ స్థాపన సమయంలో జగన్ వెంట ఉన్నవారే అసలు సిసలు నమ్మకస్తులు. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ లాయలిస్ట్ ల లిస్ట్ కూడా సగానికి సగం తగ్గింది. అధికారంలో లేకపోయినా జగన్ వెంట ఐదేళ్లు నమ్మకంగా నిలబడిన నేతలే నిఖార్సయిన వైసీపీ నేతలు. సమయం సందర్భం చూసుకుని అలా అలా వచ్చి చేరిన వారంతా అవకాశవాదులే. అంటే వైసీపీలో ఇప్పుడు మహానేత అభిమానులు, జగన్ అనుచరులతో పాటు.. అవకాశవాదులు కూడా ఉన్నారన్న మాట.
అయితే జగన్ విషయంలో ఒకటి మాత్రం నిజం. తనని నమ్ముకున్నవారికి ఏనాడూ అన్యాయం చేయలేదు అధినేత. మొదటినుంచీ తనతోపాటు ఉన్నవారికి ఎన్నికల్లో ఓడిపోయినా మంత్రి పదవులిచ్చారు. సరిగ్గా ఎన్నికల ముందు పార్టీలో చేరిన వారు ఎంత సీనియర్లయినా తన కేబినెట్ లో చోటివ్వకుండా పక్కనపెట్టారు. జగన్ వ్యవహార శైలి తెలిసినవారెవరైనా.. కొత్తవారిని పార్టీలో చేర్చుకున్నంత మాత్రాన నొచ్చుకోరు. పార్టీయే ముందు, ఆ తర్వాతే మనం అనుకుంటారు. అలాంటి వారికి జగన్ ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి, వారికి పార్టీలో కూడా ఇబ్బంది ఉండదు.
సో… టీడీపీ నుంచి వస్తున్న వలసలు ఎవరూ ఆక్షేపించ తగ్గవి కాదు. కొత్తవాళ్లు వచ్చినంత మాత్రాన ఆల్రెడీ పార్టీలో ఉన్నవాళ్లకు ప్రాధాన్యం తగ్గుతుందని భావించాల్సిన అవసరం లేదు. జగన్ నిర్ణయాన్ని బలపరిచే వారంతా.. కొత్తనీరుని స్వాగతించాల్సిందే. రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడపాలంటే.. అందర్నీ కలుపుకొని పోవాల్సిందే.