కరోనాతో మరింత పెరిగిన డ్రోన్ కెమెరాల వాడకం

కరోనా విపత్తు వల్ల జరిగే నష్టం జరుగుతూనే ఉంది, అయితే కుటుంబ బాంధవ్యాలు, వ్యక్తిగత పరిశుభ్రత అలవాట్లు, కాలుష్య నియంత్రణ.. వంటి వాటి విషయంలో ప్రజల్లో పెనుమార్పు కరోనాతోనే సాధ్యమైందని సంతోషపడేవారు కూడా ఉన్నారు.…

కరోనా విపత్తు వల్ల జరిగే నష్టం జరుగుతూనే ఉంది, అయితే కుటుంబ బాంధవ్యాలు, వ్యక్తిగత పరిశుభ్రత అలవాట్లు, కాలుష్య నియంత్రణ.. వంటి వాటి విషయంలో ప్రజల్లో పెనుమార్పు కరోనాతోనే సాధ్యమైందని సంతోషపడేవారు కూడా ఉన్నారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా భారత దేశంలో నేరాల సంఖ్య తగ్గుముఖం పట్టింది. కరోనా లాక్ డౌన్ లో ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావడం, పోలీసులు రోడ్లపైనే ఉండటం, మద్యపాన వినియోగం తగ్గిపోవడం వంటివి నేరాల సంఖ్య తగ్గడానికి ప్రధాన కారణాలు.

ఇక కరోనా టైమ్ లో డ్రోన్ కెమెరాల వినియోగం పోలీసులకు మరింత వెసులుబాటునిచ్చింది. సీసీ కెమెరాలతో ఇప్పటికే చాలా ప్రాంతాలు పోలీసుల నిఘా నేత్రాల పరిధిలోకి వచ్చాయి. వీటికి తోడు డ్రోన్ కెమెరాలతో మరింత పగడ్బందీగా తమ విధులు నిర్వహిస్తున్నారు పోలీసులు. కేరళ రాష్ట్రంలో జరుగుతున్న పనులే ఇందుకు సాక్ష్యం. కేరళలో ప్రొఫెషనల్ ఏరియల్ సినిమాటోగ్రాఫర్స్ అసోసియేషన్.. డ్రోన్ కెమెరాల వినియోగంలో పోలీస్ డిపార్ట్ మెంట్ కి అండగా నిలిచింది.

కేరళ పోలీస్ ఇటీవల సోషల్ మీడియాలో విడుదల చేసిన ఓ వీడియా.. డ్రోన్ల పనితీరుని కళ్లకు కట్టింది. డ్రోన్ లను ఎగరేసి.. జనాలు గుంపులు గుంపులుగా తిరగకుండా కట్టడి చేయగలుగుతున్నారు పోలీసులు. సిబ్బంది గస్తీకి వెళ్లలేని ప్రాంతాల్లో ఈ ప్రయోగం మంచి ఫలితాలను ఇచ్చింది. పోలీసులు వస్తున్నారంటే ముందుగానే కొన్ని ప్రాంతాలకు సమాచారం అందుతుంది, అలాంటి చోట్ల కూడా డ్రోన్ కెమెరాలు సాక్ష్యాధారాలతో సహా నేరగాళ్లను పట్టిస్తున్నాయి.

అంబలపూజ అనే ప్రాంతంలో పెళ్లి చూపులు జరుగుతున్నట్టు డ్రోన్ కెమెరాలో గుర్తించిన పోలీసులు, వెంటనే అక్కడికెళ్లి సామాజిక దూరం పాటించాలని కుటుంబ సభ్యులను అలెర్ట్ చేశారు. వడకర అనే గ్రామంలో అక్రమ మద్యం తయారీ గుట్టురట్టు చేశారు. సహజంగా పోలీసులు ఆ ప్రాంతానికి వెళ్లలేరు, ఒకవేళ వెళ్లినా ముందుగానే అక్రమార్కులు మద్యం ఆనవాళ్లు లేకుండా జాగ్రత్తపడతారు. అలాంటి ప్రాంతానికి కూడా డ్రోన్ కెమెరాను పంపించి పని పూర్తిచేశారు అధికారులు. మద్యం స్థావరాలను ధ్వంసం చేశారు. పలుచోట్ల పేకాట స్థావరాలపై దాడులు చేశారు. పోలీసుల హెచ్చరికలు పట్టించుకోకుండా క్రికెట్ ఆడుతున్న యువతను కట్టడిచేయగలిగారు.

కేరళ పోలీసుల ఈ డ్రోన్ ప్రయోగం.. దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. ఇతర రాష్ట్రాల్లో కూడా ఇలా డ్రోన్లను నేర నియంత్రణకు వాడేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. మొత్తమ్మీద నేర నియంత్రణకు కరోనా విపత్తు కొత్త ఐడియానిచ్చింది.

రైతు బావుంటేనే మనం బాగుంటాము