స్థానిక సంస్థల ఎన్నికలపై విచారణలో భాగంగా హైకోర్టు వ్యవహరించిన తీరు ప్రశంసలు అందుకుంటోంది. ఇటు ప్రభుత్వంపై, అటు ఎస్ఈసీపై ఘాటు వ్యాఖ్యలు, కోపతాపాలు లాంటివేవీ లేవు.
పాయింట్ టు పాయింట్ తప్ప, అనవసర విషయాలేవీ హైకోర్టులో ప్రస్తావనకు రాలేదు. అందుకే ఇరు పక్షాలు కూడా హైకోర్టు సూచనలను అంగీకరించాయి. చర్చల ద్వారానే సమస్యను పరిష్కరించుకోవాలని హైకోర్టు చేసిన సూచన ఎంతో విలువైందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ సందర్భంగా ప్రజల కోణంలో హైకోర్టు చేసిన వ్యాఖ్య ఇటు ప్రభుత్వానికి, అటు ఎస్ఈసీకి కనువిప్పు కలిగించేలా ఉందనే అభిప్రాయాలు లేకపోలేదు.
“పంచాయతీ ఎన్నికలైనా, కరోనా వ్యాక్సిన్ అయినా అంతిమంగా ప్రజల ప్రయోజనాలే ముఖ్యం! దీనికి సామరస్యపూర్వక పరిష్కారం కనుగొనాలి. ఇతర అంశాలేవీ ఈ కోర్టుకు అవసరం లేదు” అని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ వ్యాఖ్యలు చేసిన గౌరవ న్యాయమూర్తికి చేతులెత్తి దండం పెట్టాలని తప్పక అనిపిస్తుంది.
ఎందుకంటే పౌర సమాజం ఆకాంక్షలకు అనుగుణంగా నడుచుకునే ఏ వ్యవస్థ పట్లైనా, ప్రజలు ఎంతో గౌరవాన్ని చాటుకుంటారు. ఎందుకంటే రాజ్యాంగ వ్యవస్థ బలంగా ఉంటే, అంతిమంగా అది ప్రజలకు ప్రయోజనం కలిగిస్తుంది.
రాజకీయాలు, రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు, వ్యక్తులు శాశ్వతం కాదు. అందుకే ప్రజలెప్పుడూ రాజ్యాంగ వ్యవస్థల పునాదులు బలంగా ఉండాలని తపిస్తుంటారు. అవి దారి తప్పుతున్నాయనే భావన కలిగినప్పుడు ఆవేదన చెందుతాడు. తాము కోరుకున్న పారదర్శకత రాజ్యాంగ వ్యవస్థల్లో కనిపించినప్పుడు ఆనందంతో తబ్బిబ్బవుతారు. జస్టిస్ శేషసాయి నిన్న చేసిన కీలక కామెంట్స్ కూడా అదే రకమైన నమ్మకాన్ని, సంతోషాన్ని ప్రజలకు కల్పించాయనడంలో అతిశయోక్తి లేదు.
ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గత నెల 17న ప్రొసీడింగ్స్ జారీ చేసింది. దీన్ని సవాల్ చేస్తూ పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిసన్పై జస్టిస్ ఏవీ శేషసాయి విచారణ జరిపారు. విచారణలో భాగంగా పైన పేర్కొన్న కీలక వ్యాఖ్యలు చేశారు.
ఈ వ్యాఖ్యలు చాలు న్యాయమూర్తి నిష్పాక్షితకతను తెలియజేయడానికి. అంతిమంగా ప్రజల శ్రేయస్సే తమకు ముఖ్యమని న్యాయమూర్తి అనడం ప్రశంసలు అందుకుంటోంది. ప్రభుత్వం, ఎస్ఈసీ పరస్పరం పట్టింపులకు వెళుతూ తమకిష్టం వచ్చినట్టు వ్యవహరిస్తుండడాన్ని పౌర సమాజం జాగ్రత్తగా గమనిస్తోంది. పౌరుల అభిప్రాయాలను ప్రతిబింబించేలా న్యాయమూర్తి వ్యాఖ్యలు ఉండడం వల్లే ఆయనకు మద్దతు నైతిక లభిస్తోంది.
వివిధ పిటిషన్లపై విచారణలో భాగంగా కొన్ని వ్యాఖ్యలు ఒక పక్షానికి వ్యతిరేకంగా, మరో పక్షానికి అనుకూలమనే అభిప్రాయం కలిగించినవి లేకపోలేదు. అయితే అలాంటి వాటికి భిన్నంగా, న్యాయ వ్యవస్థ ఔన్నత్యాన్ని, న్యాయమూర్తుల గౌరవాన్ని పెంచేలా జస్టిస్ శేషసాయి చేసిన కీలక వ్యాఖ్యలు సదా అభినందనీయం.
హైకోర్టు సూచించినట్టు ప్రజల ఆరోగ్యాన్ని, శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని సముచితమైన నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత ఇటు రాష్ట్ర ప్రభుత్వం, అటు ఎస్ఈసీపై ఉంది.
ఈ విషయాన్ని ఆ రెండు పక్షాలు గుర్తెరిగి నడుచుకోవాల్సి ఉంది. లేదంటే ఆ రెండు వ్యవస్థలు ప్రజల్లో మరింత అభాసుపాలు కాక తప్పదు.