నెల్లూరు జిల్లా వైసీపీలో నివురుగప్పిన నిప్పులా ఉన్న రాజకీయ విభేదాలు ఒక్కసారిగా రచ్చకెక్కాయి. ఆనం వివేకానందరెడ్డి జయంతి సందర్భంగా ఆనం, అనిల్ వర్గాల మధ్య గొడవ మొదలైంది.
వివేకానందరెడ్డి ఫ్లెక్సీలు తొలిగించారంటూ స్వయానా ఆయన తనయుడు రంగమయూర్ రెడ్డి, అనిల్ వర్గంపై తీవ్ర ఆరోపణలు చేశారు. బెట్టింగ్ రాయుళ్ల ఫ్లెక్సీలు వారాల తరబడి కనపడుతున్నాయని, ఆనం వివేకా ఏం పాపం చేశారంటూ పరోక్షంగా మంత్రి అనిల్ ని టార్గెట్ చేశారు. వివేకా పెట్టిన రాజకీయ భిక్షతో పైకెదిగారంటూ అనిల్ పేరు ప్రస్తావించారు కూడా.
ఇక వెంకటగిరి ఎమ్మెల్యే, మాజీ మంత్రి, వివేకా సోదరుడు ఆనం రామనారాయణ రెడ్డి కూడా నెల్లూరు సిటీ పాలిటిక్స్ పేరు తెరపైకి తేవడంతో కాక మొదలైంది. ఇకపై నెల్లూరు నుంచే తన రాజకీయాలుంటాయని, పరోక్షంగా సిటీ ఎమ్మెల్యే, మంత్రి అనిల్ వర్గానికి హెచ్చరికలు జారీ చేశారు రామనారాయణ.
బీజం అప్పుడే పడింది..
బీడీఎస్ కోర్స్ చేసి డాక్టర్ గా స్థిరపడదామని అనుకుంటున్న టైమ్ లో అనుకోకుండా అనిల్ ని కాంగ్రెస్ పార్టీ తరపున కార్పొరేటర్ గా నిలబెట్టి గెలిపించారు ఆనం వివేకానందరెడ్డి. ఆ తర్వాత సిటీ ఎమ్మెల్యే అభ్యర్థిగా అనిల్ అసెంబ్లీ బరిలో నిలిచారు. అప్పటికే ఆనం కుటుంబంతో అనిల్ కి కాస్త బెడిసింది. తీరా ఎన్నికల టైమ్ కి అనిల్ వేరు కుంపటి పెట్టుకోవడంతో వివేకా కన్నెర్రజేశారు.
అనూహ్యంగా ఆ ఎన్నికల్లో అప్పటి ప్రజారాజ్యం అభ్యర్థి ముంగమూరు శ్రీధర కృష్ణారెడ్డి, అనిల్ పై స్వల్ప మెజార్టీతో విజయం సాధించారు. దీని వెనక ఆనం హస్తం ఉందనేది అనిల్ అనుమానం. అప్పట్నుంచి రెండు వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది. తర్వాత అనిల్ వైసీపీలో చేరడం ఎమ్మెల్యే కావడం, కాలక్రమంలో ఆనం కుటుంబం టీడీపీలోకి వెళ్లడం, చివరిగా తిరిగి వైసీపీ గూటికి రావడం జరిగిపోయాయి.
ఒకే పార్టీలో ఉన్నా కూడా అనిల్, ఆనం వర్గాల మధ్య శతృత్వం అలాగే మిగిలిపోయి ఉంది. అది కాస్తా అలా పెరిగి పెద్దదైంది.
2019 ఎన్నికల తర్వాత సీనియార్టీ పరంగా ఆనం రామనారాయణ రెడ్డికి మంత్రి పదవి వరిస్తుందని అనుకున్నారంతా. అయితే నెల్లూరు జిల్లా నుంచి మేకపాటి గౌతమ్ రెడ్డి, అనిల్ కుమార్ కి మంత్రి పదవులు వచ్చాయి. వైఎస్సార్, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో మంత్రిగా చేసి, ఓ దశలో ముఖ్యమంత్రి అవుతారని జోరుగా ప్రచారం జరిగిన ఆనం రామనారాయణ రెడ్డిని, జగన్ ఎందుకో పక్కనపెట్టేశారు.
తనకు మంత్రి పదవి రాకపోవడం ఓవైపు, తమ కుటుంబం చలవతో రాజకీయాల్లోకి వచ్చిన అనిల్ చకచకా ఎదగడం మరోవైపు.. జిల్లా రాజకీయాల్లో ఆనం పెత్తనం చేజారిపోతుందనే భావనతో రామనారాయణ రగిలిపోయారు.
వివేకానందరెడ్డి ఇద్దరు కొడుకులు రాజకీయాల్లో ఉన్నా కూడా నెల్లూరు రాజకీయాల్లో వారికి పట్టు లేదు. రామనారాయణ రెడ్డి నెల్లూరుకి దూరంగా వెంకటగిరి ఎమ్మెల్యేగా అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. అదే సమయంలో నెల్లూరు సిటీపై అనిల్ పూర్తిగా పట్టు సాధించారు.
ఈ నేపథ్యంలో ఎలాగైనా సిటీలో తమ మాట చెల్లించుకోవాలనే ఉద్దేశంతో ఆనం వర్గం సమయం కోసం ఎదురు చూస్తోంది. జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పాలనే ఆలోచనతో ఉన్నారు రామనారాయణ రెడ్డి.
తాజాగా ఆనం వివేకా ఫ్లెక్సీలు తొలగించడంతో రెండు వర్గాల మధ్య వివాదం రచ్చకెక్కింది. నేరుగా అనిల్ వర్గాన్ని టార్గెట్ చేసుకుని మాట్లాడుతున్నారు ఆనం కుటుంబ సభ్యులు. ఈ వివాదం జగన్ వరకు వెళ్తుందా..? జిల్లాలోనే సామరస్యంగా పరిష్కారం అవుతుందా..? వేచి చూడాలి.