కొత్త రకం కరోనా వైరస్ విజృంభనతో మరోసారి తెలుగు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. ఆల్రెడీ అనుభవం ఉండడంతో యంత్రాంగం అంతా సిద్ధంగా ఉంది. అయితే హైదరాబాద్ యంత్రాంగానికి ఈ కొత్త రకం కరోనా వల్ల ఊహించని ఇబ్బంది ఎదురైంది.
బ్రిటన్ లో కరోనా మ్యూటెటెడ్ వెర్షన్ ను కనుగొన్న టైమ్ లో.. ఆ దేశం నుంచి హైదరాబాద్ కు ఏకంగా 3వేల మంది వచ్చారు. వీళ్లలో 800 మంది ఇప్పుడు హైదరాబాద్ లోనే ఉన్నారు.
గడిచిన నెల రోజుల్లో బ్రిటన్ నుంచి తెలంగాణకు 3వేల మంది వచ్చినట్టు స్వయంగా అధికారులు వెల్లడించారు. వీళ్లను రెండు వర్గాలుగా విభజించారు. మొదటి 2 వారాల్లో వచ్చిన వాళ్లు 1800 మంది ఉన్నారు. వీళ్ల నుంచి పెద్దగా ఎలాంటి ఇబ్బంది లేదనేది నిపుణుల అభిప్రాయం. అయినప్పటికీ వీళ్లకు కూడా పరీక్షలు చేస్తున్నారు.
ఎటొచ్చి డిసెంబర్ 9 తర్వాత తెలంగాణకు వచ్చిన 1200 మంది ఇప్పుడు సమస్యాత్మకంగా మారారు. అలా వచ్చిన ప్రతి ఒక్కరితో పాటు, వాళ్ల కుటుంబ సభ్యులకు తప్పనిసరిగా కరోనా పరీక్షలు చేయాల్సిందే. ఈ 1200 మందిలో 800 మంది హైదరాబాద్ లోనే ఉన్నారనే విషయం ఇప్పుడు కలకలం రేపుతోంది.
ఆ 800 మందిని గుర్తించే పనిని జీహెచ్ఎంసీ వేగవంతం చేసింది, ఇప్పటివరకు 200 మందిని మాత్రమే గుర్తించారు. మిగతావాళ్లందర్నీ ట్రేస్ చేసే పనిలో పడ్డారు. పరీక్షలతో సంబంధం లేకుండా వీళ్లను కొన్ని రోజుల పాటు ఐసొలేషన్ లో ఉంచాలని నిర్ణయించారు. అయితే అలా వచ్చిన వాళ్లు ఇంట్లోనే కూర్చోరు కదా. ఈ 10 రోజుల్లో హైదరాబాద్ లో చాలా ప్రాంతాల్లో తిరిగే ఉంటారు. షాపింగ్ తో పాటు బంధువులు, స్నేహితుల ఇళ్లకు వెళ్లే ఉంటారు. అదే ఇప్పుడు పెద్ద చిక్కుగా మారింది.
ప్రస్తుతానికైతే ఎలాంటి ప్రమాదం లేదంటున్న అధికారులు, ముందుజాగ్రత్త చర్యగా 3 ప్రధాన ఆస్పత్రుల్ని సిద్ధం చేశారు. గచ్చిబౌలిలో ఉన్న తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్-టిమ్స్ లో 3 అంతస్తుల్ని కేవలం లండన్ నుంచి వచ్చిన వాళ్ల కోసం ప్రత్యేకంగా కేటాయించారు.
మొత్తమ్మీద హైదరాబాద్ లో పరిస్థితి మాత్రం నివురుగప్పిన నిప్పులా ఉంది. ఇంకా 600 మందిని గుర్తించాలి. వాళ్లు ఎక్కడెక్కడ తిరిగారో వివరాలు సేకరించాలి. ప్రస్తుతానికైతే ప్రజలంతా కొన్ని రోజుల పాటు షాపింగ్స్, హోటళ్లకు దూరంగా ఉంటే మంచిది. ఎప్పట్లానే భౌతికదూరం పాటిస్తూ, మాస్కులు మస్ట్ గా ధరించాలని చెబుతున్నారు.