మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పాలనలో లేకపోతే నగ్నసత్యాలు చెప్పడంలో ఆయనకు సాటి వచ్చే నేతలే లేరు. జీవితాన్ని శోధించి, మదించి , ఆ అనుభవాల సారం నుంచి చంద్రబాబు భవిష్యత్ తరాల రాజకీయ నాయకులకు ప్రయోజనకరమైన సందేశాలను చెబుతుంటారు. ఆయనలో గొప్ప విషయం ఏంటంటే, తన పాలనలోనే ఘోరాలు, నేరాలు జరిగి ఉంటాయి. అయినా అవేవీ తెలియనట్టు చెప్పడంలోనే ఆయన గొప్పతనం దాగి ఉంది.
తాజాగా ఆయన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు చేసిన హెచ్చరిక కూడా ఆయన జీవతానుభవం నుంచి నేర్చుకున్న గుణపాఠం గానే చూడాలని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇంతకూ ఆయన ఏమంటున్నారంటే…
“ఎద్దు ఏడ్చిన వ్యవసాయం.. రైతు ఏడ్చిన రాజ్యం నిలవదని పెద్దలు చెబుతారు. దీనిని గ్రహించి జగన్ ప్రభుత్వం పని చేయాలి” అని జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా చంద్రబాబు ట్వీట్ చేశారు. అలాగే మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గ టీడీపీ నాయకులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో చంద్రబాబు మాట్లాడుతూ జగన్ సర్కార్ రైతు వ్యతిరేక విధానాలకు పాల్పడుతోందని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
జగన్ రైతు వ్యతిరేక పాలనతో రాష్ట్రంలో రైతులు, కౌలు రైతులు, కూలీల ఆత్మహత్యలు పెరిగాయన్నారు. 1,029 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. ఏపీలో రైతు ఆత్మహత్యలు పెరుగుతున్నాయని, దేశంలోనే మూడో స్థానంలో ఉండటం విషాదకరమన్నారు. అమరావతి రైతులు 372 రోజులుగా నిద్రాహారాలు లేకుండా ఉద్యమిస్తున్నారని, వీరిలో 110 మంది ఇప్పటికి అమరులయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇది ఆటవిక రాజ్యమో, కిరాతక రాజ్యమా వర్ణించలేని పరిస్థితి అని ఎద్దేవా చేశారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబ సభ్యులను పరామర్శిం చి వారిలో మనోధైర్యం నింపాలని పార్టీ శ్రేణులను ఆయన ఆదేశించారు.
ఒకవైపు భూములను కాజేస్తూ.. మరోవైపు భూరక్ష, భూ హక్కు అనడం దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని చంద్రబాబు అభివర్ణించారు. బహుశా ఈ చివరి వాక్యం తనకు కరెక్ట్‌గా సరిపోతుందని చంద్రబాబు భావించినట్టు లేదు.
చంద్రబాబు పాలనలో రైతు వ్యతిరేక విధానాలకు పాల్పడినంతగా, మరే నాయకుడి పాలనలో సాగలేదంటే అతిశయోక్తి కాదు. బాబు పాలనా విధానాలు రైతాంగం నడ్డి విరిచాయి. విద్యుత్ చార్జీలను పెంచి రైతుల వెన్ను విరిచారు.
విద్యుత్ చార్జీల పెంపును వ్యతిరేకిస్తూ కార్మిక, కర్షక లోకం పెద్ద ఎత్తున చేపట్టిన ర్యాలీపై బషీర్‌బాగ్ వద్ద కర్కశంగా కాల్పులు జరిపించిన ఘనత చంద్రబాబుకే దక్కుతుంది. ఆ కాల్పుల్లో ముగ్గురు వామపక్ష కార్యకర్తలు అమరులయ్యారు.
అలాగే 2014 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా రైతుల మొత్తం రుణాలను మాఫీ చేస్తానని, బ్యాంకుల్లో కుదవ పెట్టిన బంగారం అంతా ఇంటికి తెచ్చే బాధ్యతను తీసుకుంటానని నమ్మబలికి రైతుల ఓట్లను గంపగుత్తగా వేయించుకున్నారు.
అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదు విడతలుగా రైతుల రుణాలను మాఫీ చేస్తానన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకున్న రైతాంగం ఆశలను, నమ్మకాన్ని చంద్రబాబు నట్టేట ముంచారు. కేవలం మూడు విడతల రుణాన్ని మాత్రమే జమ చేసి, ఆ తర్వాత చేతులెత్తేశారు. ఇక బ్యాంకుల్లోని బంగారం ఊసే ఎత్తలేదు.
చంద్రబాబు రైతు వ్యతిరేక పాలనకు ఇవి మచ్చుకు కొన్నే. ఇలా చెప్పుకుంటే పోతే చాంతాండంత జాబితా ఇవ్వొచ్చు. అలాంటి నాయకుడు ఇప్పుడు రైతుల కష్టాలపై మొసలి కన్నీళ్లు కారుస్తున్నారు. తన పాలనలో ఎద్దు .. రైతు ఏడ్చడం వల్లే అత్యంత ఘోరంగా తన పార్టీ పరాజయం పాలైందనే విషయాన్ని పరోక్షంగానైనా బాబు అంగీకరిస్తున్నట్టుగా అర్థం చేసుకోవాలి.
తనకెదురైన చేదు అనుభవాలనే బాబు మరో రూపంలో చెబుతూ జగన్‌ను హెచ్చరిస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనా జగన్‌ను హెచ్చరించడానికైనా, విమర్శించడానికైనా బాబు నగ్న సత్యాలు చెబుతుండడాన్ని స్వాగతించాల్సిందే.