నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజును ఏపీ హైకోర్టు దులిపేసింది. ప్రశ్నల వర్షంతో ఉక్కిరిబిక్కిరి చేసింది. ఏపీ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకు అయినదానికి కానిదానికి ఆయన కోర్టు మెట్లు ఎక్కుతున్న సంగతి తెలిసిందే.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బెయిల్ రద్దు చేయాలని సీబీఐ కోర్టులో పిటిషన్ వేయడం, ప్రతికూల తీర్పు పొందడం చర్చనీయాంశమయ్యాయి. అప్పటికీ ఆయన వెనక్కి తగ్గలేదు. ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
తాజాగా అమూల్ విషయంలో ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై హైకోర్టును ఆశ్రయించి అభాసుపాలయ్యారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ డెయిరీ డెవల్‌పమెంట్ ఫెడరేషన్(ఏపీడీడీఎఫ్) ఆస్తులను లీజు పద్ధతిలో అమూల్‌కు బదిలీ చేయాలని రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ రఘురామ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్)పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ సి.ప్రవీణ్‌కుమార్‌తో కూడిన ధర్మాసం మరోసారి విచారణ చేపట్టింది.
ఈ సందర్భంగా హైకోర్టు ధర్మాసనం పిటిషనర్‌కు కీలక ప్రశ్నలు వేసింది. మీకేంటి నష్టమంటూ నిలదీసింది.
‘ఆంధ్రప్రదేశ్ డెయిరీ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ (ఏపీడీ డీసీఎఫ్) ఆస్తులను గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్‌కు లీజుకిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే మీకొచ్చిన ఇబ్బంది ఏంటి? అమూల్ విషయంలో ప్రభుత్వ నిర్ణయం వల్ల మీరే విధంగా నష్టపోతారో చెప్పండి? ఫలానా విధంగానే ప్రభుత్వం వ్యవహరించాలని ఎలా శాసిస్తారు? ఎవరితో ఒప్పందం చేసుకోవాలో అది ప్రభుత్వ ఇష్టం. వ్యక్తులు, రాజకీయ పార్టీల ఆధారంగా న్యాయస్థానాలు వ్యాజ్యాలు పరిష్కరించవు. కోర్టు ముందున్న దస్త్రాలు, వివరాలు ఆధారంగా చట్ట, రాజ్యాంగ నిబంధనల ఉల్లంఘన జరిగిందో లేదో మాత్రమే పరిశీలిస్తాం’ అని స్పష్టం చేసింది.
జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎలాంటి పిటిషన్ వేసినా తమకు అనుకూలంగా తీర్పు వస్తుందనే భావించి ఇష్టానుసారం వ్యవహరిస్తున్నరఘురామకు ధర్మాసనం వ్యాఖ్యలు చెంపపెట్టు లాంటివనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జగన్ బెయిల్‌పై ఉంటే మీకేంటి నష్టమని ప్రశ్నించి వుంటే…రఘురామ పునరాలోచనలో పడి వుండేవారని న్యాయవర్గాలు అంటున్నాయి.