దుబ్బాక ఉప ఎన్నిక ఓటమి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను బాగా పెడుతున్నట్టుంది. అందుకే ఆయన హుజూరాబాద్ ఉప ఎన్నిక విషయంలో అతి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దుబ్బాకలో సునాయాసంగా గెలుస్తామని టీఆర్ఎస్ అతి విశ్వాసానికి పోయి… ఎన్నికల్లో బొక్క బోర్లా పడింది.
రఘునందన్‌రావు గెలుపొంది తెలంగాణలో బీజేపీకి ఆశలు చిగురింపజేశారు. ఆ తర్వాత గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కూడా బీజేపీ మంచి ఫలితాలనే సాధించింది.
ఈ నేపథ్యంలో నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే బీజేపీకి ఏ మాత్రం అవకాశం ఇవ్వకూడదనే తలంపుతో హుజూరాబాద్‌లో ఘన విజయం సాధించేందుకు టీఆర్ఎస్ సర్వశక్తులు ఒడ్డుతోంది. ఈ ఉప ఎన్నిక నుంచే దళిత బంధు పథకం పుట్టుకొచ్చింది. అలాగే కులాల వారీగా తమ వైపు తిప్పుకునేందుకు అధికారాన్ని అడ్డు పెట్టుకుని టీఆర్ఎస్ తన వంతు ప్రయత్నాలను తీవ్రతరం చేసింది.
తాజాగా తానే ఎన్నికల ప్రచారానికి వెళ్లాలని కేసీఆర్ నిర్ణయించుకోవడం కీలక పరిణామంగా చెప్పొచ్చు. ఇదే సమయంలో ఆంధ్రాలో బద్వేలు ఉప ఎన్నిక చడీచప్పుడు లేకుండా సాగిపోతుంది. అసలు ఆంధ్రాలో ఉప ఎన్నిక జరుగుతోందన్న భావన కూడా ఎవరికీ లేదు. హుజూరాబాద్ విషయానికి వస్తే పరిస్థితి అందుకు పూర్తి భిన్నం.
ఉప ఎన్నిక జరిగే నియోజకవర్గానికి పొరుగున ఉన్న జిల్లాల్లో సభలు, సమావేశాలు నిర్వహించరాదనే కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల నేపథ్యంలో టీఆర్ఎస్ వ్యూహం మార్చింది. హుజూరాబాద్‌కు సమీపంలోని హుస్నాబాద్ నియోజకవర్గంలోని ఎల్క తుర్తి మండలం పెంచికల్‌పేటలో ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభ విషయంలో పునరాలోచిస్తున్నట్లు సమాచారం.
ఒకవేళ సభ నిర్వహించడం వీలు కాకపోతే, హుజూరాబాద్ నియోజకవర్గంలోనే రెండు రోజుల పాటు కేసీఆర్ రోడ్‌షోలు నిర్వహించే అవకాశం ఉంది. ఏది ఏమైనా చిన్న పామునైనా పెద్ద కట్టెతో కొట్టాలనే ఆలోచనతో కేసీఆర్ ఉన్నట్టు హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్రచారమే నిదర్శనం.