పెద్ద గీత ముందు చిన్న గీత ఎంత? టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి బూతు మాటల కేంద్రంగా గత మూడు రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఆవేశకావేశాల మధ్య సాగుతున్నాయి. అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీలు ఢీ అంటే ఢీ అని తలపడుతున్నాయి. ఈ పరిణామాలు ఊహించినవి, ఆశిస్తున్నవి ఎంత మాత్రం కాదు. అయితే పట్టాభి బూతు మాటల కంటే ఆ పార్టీ ముఖ్యనేతల డిమాండ్ పెద్ద బూతు అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
పట్టాభి బూతు పురాణం పార్ట్ -1 అనుకుంటే, దాన్ని అడ్డుపెట్టుకుని చంద్రబాబు మొదలుకుని మిగిలిన నేతలంతా ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని, తమ పార్టీ కార్యాలయాలపై జరిగిన దాడులపై సీబీఐ విచారణ చేపట్టాలనే డిమాండ్‌ను బూతు పురాణం పార్ట్-2గా కొందరు అభివర్ణిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన విధించాలట, అలాగే సీబీఐ విచారణ జరిపించాలట! ఈ డిమాండ్‌తో గవర్నర్‌కు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశ్, నిమ్మల రామానాయుడు తదితరులు వినతిపత్రం సమర్పించడం ప్రాధాన్యం సంతరించుకుంది. అనంతరం అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై నివేదిక తెప్పించుకుని కేంద్రానికి, రాష్ట్రపతికి పంపిస్తామని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ స్పష్టమైన హామీ ఇచ్చారన్నారు.
తమ అధినేత చంద్రబాబు నాయకత్వంలో ప్రతినిధి బృందం దిల్లీ వెళ్లి రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర హోంమంత్రిని కలవాలని నిర్ణయిం చుకున్నట్టు ఆయన చెప్పారు. అసలు గవర్నర్ పోస్టే అనవసరమని ఇదే చంద్రబాబు గతంలో అన్న మాటలను నెటిజన్లు గుర్తు చేస్తున్నారు.
మరి ఏ ముఖం పెట్టుకుని గవర్నర్‌కు వినతిపత్రం సమర్పించారనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్రహోంమంత్రి అమిత్‌షాపై తమ పాలనలో దాడికి పాల్పడితే, అప్పుడు రాష్ట్రపతి పాలన, సీబీఐ విచారణ గుర్తు రాలేదా? అని నిలదీస్తున్నారు.
అపార ప్రజాభిమానంతో అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వాన్ని రద్దు చేయాలని కోరడం కంటే బూతు మరొకటి లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీ నేతల డిమాండ్లు, బూతులు వింటుంటే అధికారం కోల్పోయి ఎంత ఆవేదన చెందుతున్నారో అర్థం చేసుకోవచ్చు.