కర్ణాటక ప్రభుత్వం పెద్ద తేనె తుట్టెను కదిలించింది. పాఠశాలల్లో, కాలేజీల్లో చదివే ముస్లిం యువతులు హిజాబ్ ను ధరించడానికి బొమ్మై సర్కారు అభ్యంతరం చెప్పింది. ఈ విషయంలో కాలేజీల యాజమాన్యాలు కూడా దిక్కుతోచని స్థితిలో పడ్డాయి. కాలేజీల్లో యూనిఫామ్ విషయంలో ఒక్కో చోట ఒక్కో ప్రాతిపదికన నడుస్తుంటాయి వ్యవహారాలు. కొన్ని ప్రైవేట్ కాలేజీలు యూనిఫామ్ విషయంలో అంత కచ్చితంగా ఉండవు.
ఇంటర్ నుంచినే పిల్లలకు కలర్ డ్రస్సుల అనుమతులు ఇస్తూ ఉంటాయి. ఇంటర్, డిగ్రీ విద్యార్థులకు యూనిఫామ్ నిబంధనలు ఉండవు చాలా చోట్ల. అలాంటి నిబంధనే లేని చోట హిజాబ్ విషయంలో అభ్యంతరాలు కుదరకపోవచ్చు. పక్కా యూనిఫామ్ అనే కాలేజీల్లో మాత్రమే హిజాబ్ విషయంలో ప్రభుత్వ నియమాలు వర్తిస్తాయి. అయితే ఇప్పుడు ఈ అంశం కోర్టులో ఉంది.
విద్యార్థుల్లో స్పష్టమైన చీలిక కనిపిస్తోంది. ఉడిపి ప్రాంతంలో కొందరు యువకులు కాషాయ కండువాలను ధరించి రచ్చ చేశారు. ఇక అంబేద్కర్ వాదులు కూడా తమ కండువాలను వేసుకుని కాలేజీల్లో కనిపించారు. ఇలా మూడు చీలికలు కనిపిస్తున్నాయి. అయితే అంతా చీలిపోయారని అనలేం. వీటితో నిమిత్తం లేకుండా ఉండే వారే నూటికి 90 శాతం ఉంటారు. పది శాతం మందితోనే ఇంత రచ్చ.
ఇక హిజాబ్ పై తను ఏం తేల్చలేనట్టుగా కర్ణాటక హైకోర్టు జడ్జి ధర్మాసనానికి పిటిషన్ ను షిఫ్ట్ చేశారు. విస్తృత ధర్మాసనం ఈ అంశంపై తేల్చాలని ఆయన కోరారు.
మరోవైపు ఈ అంశంపై కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అయితే ఈ అంశంపై ముందుగా కర్ణాటక హైకోర్టు ఏం చెబుతుందో చూడాలంటూ సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ చెప్పినట్టుగా తెలుస్తోంది. కర్ణాటక హైకోర్టు ధర్మాసనం నుంచి వచ్చే తీర్పుపై సుప్రీం కోర్టు స్పందించే అవకాశం ఉంది.
ఏతావాతా ఈ తీర్పులు చారిత్రాత్మకం కాబోతున్నాయి. ఒక్కసారి తీర్పు వస్తే అనేక మత విశ్వాసాలు, యూనిఫామ్ లతో ముడిపడతాయి. హిజాబ్ ఒక్కటినీ నిషేధించలేరు. సిక్కు యువత ధరించే తలపాగాలు కూడా చర్చలోకి, తీర్పులోకి వస్తాయి. ఒక్క హిజాబ్ లపై నిషేధం, సిక్కు విద్యార్థులకు మాత్రం అనుమతి అంటూ కోర్టు అంటుందా? లేక యూనిఫామ్ సివిల్ కోడ్ అంటుందా? అనేది చర్చనీయాంశం.
మరి సిక్కు యువత తలపాగాలతో విద్యాలయాల్లోకి ప్రవేశించకూడదనే నియమం వస్తే మాత్రం దేశం భగ్గుమనే అవకాశాలూ లేకపోలేదు. దేశంలోని ఏ మూల ఇలాంటి నిషేధం పడినా సిక్కుల సాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోంచి నిరసనలు వస్తాయి.
అలాగే హిందూ అయ్యప్ప మాల ధరించే యువత కూడా ఉంటుంది. అయ్యప్ప మాలను చదువుకునే అబ్బాయిలు కూడా ధరిస్తారు. అలాంటప్పుడు వారు నల్ల దుస్తుల్లోనే పాఠశాలలకూ, స్కూళ్లకూ హాజరవుతూ ఉంటారు. మరి ఈ అంశాలన్నింటిపైనా క్లారిటీ ఇచ్చే కోర్టు తీర్పులు చారిత్రాత్మకం కాబోతున్నాయి.