చాలా రోజుల తర్వాత పవన్ కల్యాణ్ సోలోగా జనసేన టీమ్ కోసం ఇంటర్వ్యూ ఇచ్చారు. బయట మీడియాని పిలిస్తే ఆ ప్రశ్నలను తట్టుకోలేరు కాబట్టి.. జనసేన సోషల్ మీడియా విభాగానికి ఇంటర్వ్యూ అనే పేరు పెట్టి మమ అనిపించారు. ఇందులో ప్రముఖంగా దత్తపుత్రుడు అంటూ జగన్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. తానెవరికీ దత్తపుత్రుడ్ని కాదని, కేవలం ప్రజలకే దత్తపుత్రుడిని అంటూ కవర్ చేసుకున్నారు.
అంతా బాగానే ఉంది కానీ, అసలు పవన్ కల్యాణ్ వార్త.. ఈనాడు న్యూస్ పేపర్ లో కనిపించలేదేంటి అనేది అసలు సమస్యగా మారింది. జనసేనాని మాట్లాడితే బ్యానర్ ఐటమ్ గా పెట్టుకుంటారు ఈనాడులో. సీఎం జగన్ కంటే ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు. అందులోనూ ఆయన చాలాకాలం తర్వాత నేరుగా మీడియాకు విడుదల చేసిన ఇంటర్వ్యూ ఇది. కానీ దీనికి ఈనాడులో చోటు దక్కలేదు.
ఈనాడులో పవన్ ప్రసంగ పాఠాన్ని లోపలి పేజీల్లో ఓ మూల వేశారు. కనీసం చిన్న బాక్స్ కూడా కొట్టలేదు, మందిలో కలిపేశారు. అసలేం జరిగింది? రామోజీరావు పత్రికలో పవన్ కు ప్రయారిటీ ఎందుకింత దిగజారింది. నిన్న మొన్నటి వరకూ పవన్ ని నెత్తిన మోసిన ఈనాడు ఈరోజెందుకు అతడ్ని లోపలికి తోసేసింది అనుకుంటున్నారు జనసైనికులు.
ఈనాడులో జగన్ కి ఎలాగూ ప్రయారిటీ ఇవ్వరనేది అందరికీ తెలిసిన విషయమే. చంద్రబాబు ప్రెస్ నోట్ రిలీజ్ చేసినా, నారా లోకేష్ ట్వీట్ చేసినా అది ఈనాడుకి మహాప్రసాదం. వీరిద్దరితోపాటు పవన్ కల్యాణ్ ని కూడా బాగానే మోస్తుంది ఈనాడు. చంద్రబాబుతో ఆయన కలిసి ఉన్నా లేకపోయినా పవన్ ప్రయారిటీ ఎక్కడా తగ్గలేదు, తగ్గించలేదు. అలాంటిది ఇప్పుడెందుకు పవన్ ని లోపలికి తోసేశారనేదే తేలడంలేదు.
ఆల్రడీ చంద్రబాబు వన్ సైడ్ లవ్ ఉందని అన్నారు, పవన్ కూడా జగన్ ని పూర్తిగా వ్యతిరేకిస్తూనే ఉన్నారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే మరికొన్ని రోజుల్లో బాబు, పవన్, బీజేపీ లోపాయికారీ ఒప్పందం బయటపడే అవకాశముంది. ఈ దశలో పవన్, జగన్ కి కౌంటర్ ఇచ్చారు. దాన్ని ఈనాడు ఎందుకు హైలెట్ చేయలేకపోయిందనేది జనసైనికులు బాధ. ఇంతకీ జనసేనకి-ఈనాడుకి మధ్య గ్యాప్ ఎందుకొచ్చింది? కావాలనే గ్యాప్ తీసుకున్నారా లేక అనుకోకుండా వచ్చిందా? బహుశా దీనికి పవన్ కంటే, చంద్రబాబే కరెక్ట్ గా సమాధానం చెప్పగలరు?