ఒక్కోసారి అంతే…కళ్లెదుటే ప్రమాదం పొంచి ఉన్నా గుర్తించలేని దుస్థితి. కాలం కలిసిరాక పోతే ఎంత తెలివైన వాళ్లైనా బోల్తా పడక తప్పదు మరి. ఇప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్ పరిస్థితి కూడా అట్లే ఉంది. తెలంగాణలో రోజురోజుకూ కరోనా వ్యాప్తి చెందుతుండటంతో ఆయన తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పదేపదే మీడియా సమావేశాలు పెడుతూ ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు. కానీ కరోనా వైరస్ కంట్రోల్‌లోకి రాకపోగా, మరింత విజృంభిస్తోంది.
తెలంగాణ ఉద్యమాన్ని ఒంటి చేత్తో నడిపి, దశాబ్దాల తన ప్రాంత ప్రజల రాష్ట్ర సాధన ఆశయ కలలను సాకారం చేసిన కేసీఆర్‌కు…కంటికి కనిపించని వైరస్ పెద్ద సవాల్‌గా నిలిచింది. ఇప్పటి వరకు తెలంగాణలో 592 కరోనా కేసులు నమోదయ్యాయి. అలాగే 17 మంది ప్రాణాలు కోల్పోయారు. సోమవారం ఒక్కరోజే తెలంగాణలో 61 కేసులు నమోదు కావడం సమస్య తీవ్రతకు అద్దం పడుతోంది. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే జనాభాలో తెలంగాణ కంటే ఎక్కువే. కానీ కరోనా కేసుల్లో 439 నమోదయ్యాయి. అలాగే 9 మంది మృతి చెందారు. సోమవారం ఒక్క రోజు కేవలం 9 మాత్రమే కొత్తవి నమోదయ్యాయి. తెలంగాణతో పోలిస్తే ఏపీలో కరోనా ప్రభావం తక్కువే.
కానీ తెలంగాణ సీఎం కేసీఆర్ కళ్లెదుటే కరోనా హాట్ స్పాట్ ఉన్నప్పటికీ….దాన్ని గుర్తించలేకున్నారాయన. దేశంలోనే ఆయనంత డర్టీయిస్ట్ పొలిటీషియన్ లేడని, తనను ఓడించడానికి శక్తివంచన లేకుండా కృషి చేసిన ఆ నాయకుడికి రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని, అలాగే అంతకు ముందు ఓటుకు నోటు కేసులో బ్రహ్మదేవుడు దిగి వచ్చినా నిన్ను కాపాడలేడని ఎవరినైతే హెచ్చరించారో…ఆయన నివాసమే కరోనాకు హాట్‌స్పాట్ అని కేసీఆర్ గుర్తించలేకున్నారు.
జబ్బు నయం కావాలంటే…ముందు సమస్య ఏంటో గుర్తించాలి. ఆ తర్వాత జబ్బుకు తగిన మందు వేయాలి. ఆ పని చేయకుండా మిగిలివన్నీ చేస్తే ప్రయోజనం శూన్యం. ఎంతో తెలివైన సీఎంగా పేరొందిన కేసీఆర్ తన రాష్ట్రంలో కరోనా వ్యాప్తికి హాట్‌స్పాట్ గుర్తించడంలో విఫలమవుతున్నారు. కేసీఆర్ అధికారులతో ఎన్ని సమీక్షలు నిర్వహించినా ఫలితం ఏముంటుంది? కరోనా పాజిటివ్ కేసుల ఆధారంగా తెలంగాణ వ్యాప్తంగా 246 కంటైన్మెంట్లు ఏర్పాటు చేశామని ముఖ్యంత్రి కె.చంద్రశేఖర్‌రావు తెలిపారు.
కేవలం హైదరాబాద్ నగరంలోనే 126 కంటైన్మెంట్లు ఉన్నాయన్నారు. ప్రతి కంటైన్మెంటుకూ ప్రత్యేక పోలీసు, నోడల్ అధికారిని నియమించాలని, వారి ఆధ్వర్యంలో అత్యంత కఠినంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు. జీహెచ్‌ఎంసీలో అత్యధిక జనసమ్మర్థం ఉంటుందని, అక్కడ పాజిటివ్‌లు ఎక్కువగా నమోదవుతుండటాన్ని తీవ్రంగా పరిగణించాలని సూచించారు.
కేసీఆర్ తక్షణం చర్యలు చేపట్టాల్సింది…కరోనా హాట్‌స్పాట్ అయిన జూబ్లీహిల్స్‌లో. ఎందుకంటే అక్కడ కరోనా కంటే ప్రమాదకరమైన తండ్రీకొడుకులున్నారు. వాళ్లిద్దరూ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలకమైన నేతలు. ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టం కొద్ది ప్రధాని మోడీ జనతా కర్ఫ్యూ, లాక్‌డౌన్ ప్రకటించే సమయానికి అబ్బాకొడుకులు జూబ్లీహిల్స్‌లోని సొంతింటిలో ఉన్నారు. అందువల్లే ఏపీలో కరోనా అదుపులో ఉంది. కానీ తెలంగాణ ప్రజల దురదృష్టం…ఆ నేతలిద్దరూ అక్కడుండటం. కావున కేసీఆర్ తక్షణం మేల్కొని కరోనా వైరస్ కట్టడికి జాగ్తత్తలు తీసుకోవాలి.