కరోనా కట్టడికి ప్రధాని మోడీ 21 రోజుల పాటు లాక్‌డౌన్ విధించారు. ఆ గడువు నేటితో అంటే ఏప్రిల్ 14వ తేదీతో ముగియనుంది. లాక్‌డౌన్ పొడిగింపైపు భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రం లాక్‌డౌన్‌ను ఈ నెలాఖరు వరకు పొడిగిస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. ఆయన బాటలో మహారాష్ట్ర, పంజాబ్, పశ్చిమబెంగాల్, ఒడిస్సా రాష్ట్రాలు నడిచాయి. కానీ పొరుగునే ఉన్న మరో తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రం ఏ నిర్ణయం తీసుకోలేదు.
ఈ నేపథ్యంలో ప్రధానితో ఇటీవల జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఏపీ సీఎం జగన్ చాలా కీలకమైన అంశాలు ప్రస్తావించారు. కరోనాకు సంబంధించి రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లను గుర్తించి కరోనా నియంత్రణ చర్యలు చేపట్టాలని సూచించారు. అలాగే లాక్‌డౌన్‌ను రెడ్‌జోన్ ప్రాంతాల్లో కఠినంగా అమలు చేయడం, ఆరెంజ్ జోన్లలో కొంత సడలింపు, గ్రీన్ జోన్లలో పూర్తిగా లాన్‌డౌన్ ఎత్తివేసి రోజువారీ కార్యక్రమాలను కొనసాగించడం ద్వారా ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకోవచ్చని ఏపీ సీఎం జగన్ సూచించారు. దీనిపై ప్రధాని మోడీ కూడా ఇంప్రెస్ అయ్యారు.
జాతినుద్దేశించి ప్రధాని ఈ వేళ ఉదయం 10 గంటలకు ప్రసంగించనున్నారు. ఏదైతే జగన్ సూచించారో….దాన్నే జాతీయస్థాయిలో అమలు చేసే దిశగా కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేసినట్టు వార్తలొస్తున్నాయి. జగన్ సూచించిన విధంగానే ప్రధాని కూడా ప్రకటించనున్నారని సమాచారం.
అయితే ప్రధానితో జగన్ సూచనలపై ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాయి. సాక్ష్యాత్తు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ ప్రధానికి లేఖ రాస్తూ పూర్తిస్థాయిలో లాక్‌డౌన్ కొనసాగించాలని కోరాడు. సీఎం జగన్ నిర్ణయాన్ని తప్పు పట్టాడు. బీజేపీ మిత్రపక్షమైన జనసేన అధినేత పవన్ కూడా కన్నా అభిప్రాయంతో ఏకీభవించాడు. ఇక ప్రధాన ప్రతిపక్షం టీడీపీ గురించి చెప్పేదేముంది? జగన్‌కు స్థానిక సంస్థల ఎన్నికలు తప్ప మరేం అవసరం లేకుండా పోయాయని విరుచుకుపడ్డారు. జగన్ నిర్లక్ష్యం వల్లే ఏపీలో కరోనా విజృంభిస్తోందని ఆరోపిస్తున్నారు.
ప్రధానితో సీఎం మాటలు బాధ్యతా రాహిత్యాన్ని, ప్రజల ఆరోగ్యంపై నిర్లక్ష్యాన్ని ప్రతిబింబిస్తున్నాయని మండిపడ్డారు. అంతేకాదు, లాక్‌డౌన్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ప్రధానికి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ కూడా రాశాడు. అయితే ప్రతిపక్షాల ఆరోపణలు అలా ఉంటే…జగన్ సూచనలను ప్రధాని ఫాలో అవుతున్నారనే వార్తలపై ప్రతిపక్షాలు నోరు మెదపడం లేదు.
ఇప్పటికే సోమవారం 22 మంది కేంద్రమంత్రులు, సీనియర్ అధికారులు, ఇతర సిబ్బంది ఢిల్లీలో తమ కార్యాలయాలకు వెళ్లి ఫైళ్ల క్లియరెన్స్ మొదలు పెట్టారు. ప్రధాని లాక్‌డౌన్‌పై సడలింపు నిర్ణయానికి ఇదే సంకేతం. ప్రధాని నిర్ణయంపై ఏపీలో ప్రతిపక్షాలు, వాటికి వంత పాడే ఎల్లో మీడియా నోరు తెరవడం, ఒక్క అక్షరం వ్యతిరేకంగా రాస్తే ఒట్టు. ప్రధాని అంటే వీళ్లకు లాగు తడుస్తుంది మరి. కానీ జగన్ వషయానికి వస్తే మాత్రం ఎల్లో బ్యాచ్ వీరంగం సృష్టిస్తోంది.
లాక్‌డౌన్‌ను ప్రధాని సడలిస్తారనే సమాచారం రావడం, జగన్ చెప్పిన రీతిలో అనుసరిస్తున్నారని వార్తలు బయటికి పొక్కడంతో ఎల్లో మీడియా తన కలాన్ని, పచ్చ తమ్ముళ్లు తమ స్వరాలను సవరించుకున్నారు. ఆ రాతలు ఎలా ఉన్నాయంటే…
“దాదాపు ఆరేళ్లుగా ఆర్థికరంగం తిరోగమనంలో ఉంది. లాక్‌డౌన్ కారణంగా వేలమంది ఉద్యోగాలు కోల్పోయారు. చిన్న, మధ్యతరహా పరిశ్రమలు పూర్తిగా చతికిల బడ్డాయి. లక్షల మంది పేద ప్రజానీకం ఉపాధి లేక విలవిల్లాడుతున్నారు. ఈ పరిస్థితి నుంచి తిరిగి ఆర్థికాన్ని పైకి లేపేందుకు కొన్ని నిర్దిష్ట చర్యలు ప్రకటిస్తారంటున్నారు. పరిమిత సంఖ్యలో పరిశ్రమల పునఃప్రారంభానికి అనుమతిస్తారని విశ్వసనీయ వర్గాల సమాచారం. నగరాలను, పట్ణణాలను కొవిడ్-19 రోగుల తీవ్రతను బట్టి రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లగా కూడా విభజించే అవకాశాలు హెచ్చుగా ఉన్నాయి. వైరస్ ప్రభావం అసలే లేని దాదాపు 400 జిల్లాలను గ్రీన్ జోన్‌గా ప్రకటించి అక్కడ వ్యవసాయం, నిర్మాణ, తయారీ రంగాల కార్యకలాపాలకు అనుమతిస్తారని గట్టిగా వినిపిస్తోంది. అనేక గ్రామాలు గ్రీన్‌జోన్‌కిందకు వస్తాయని అధికారులు అంటున్నారు”….ఇలా ఉంది ఎల్లో మీడియా, టీడీపీ, దాని మిత్రపక్షాల వ్యవహార శైలి.
దేవునికైనా దెబ్బే గురువంటే ఇదేనేమో మరి. కరోనాపై సడలింపు ఇవ్వాలని జగన్ అంటే రాద్ధాంతం చేసిన టీడీపీ, బీజేపీ, జనసేన, సీపీఐ నాయకులు…. ఇప్పుడు ప్రధాని ఆలోచనపై ఎందుకు విమర్శలు చేయడం లేదు. ఏపీ ప్రతిపక్షాల నోళ్లు ఎందుకు మూగబోయాయి? మోడీ అంటే భయమా? భక్తా? లేక రెండూనా? మరి ప్రజల సంగతి పట్టించుకునేదెవరు స్వామి?