కరోనాపై విజయం అనే మాట ఇప్పటి వరకూ ఎక్కడా గట్టిగా వినిపించడం లేదు. ఊహకు అంతుబట్టని పరిస్థితులకు కారణం అయిన ఈ వైరస్ గురించి కొన్ని దేశాలు పాక్షిక విజయం సాధించాయి. సౌత్ కొరియాను ఈ విషయంలో ఉదాహరించారు. అయితే అక్కడ రికవరీ అయిన కేసుల్లో కూడా కొన్ని మళ్లీ పాజిటివ్ రిజల్ట్స్ వచ్చాయనేది అంతుబట్టని అంశంగా మారింది. కరోనా కట్టడి విషయంలో సౌత్ కొరియా సత్తా చూపించిందని మొదట వార్తలు వచ్చాయి. అయితే డిశ్చార్జి చేసిన కొందరు కరోనా పేషెంట్లలో ఇప్పుడు మళ్లీ కరోనా పాజిటివ్ తేలిందనే వార్తలు వస్తున్నాయి. ఆ వ్యవహారం ఏం తేలుతుందో చూడాల్సి ఉంది.
ఆ సంగతలా ఉంటే.. దేశంలో తొలి కరోనా కేసు రిజిస్టర్ అయిన కేరళ మాత్రం ఇప్పుడు కరోనాను బాగా నియంత్రిస్తోందనే పేరును తెచ్చుకుంటూ ఉంది. కేరళలో కరోనా పాజిటివ్ కేసులు ఇప్పుడు సింగిల్ డిజిట్ కు పరిమితం కావడం గమనార్హం. ఈ విషయాన్ని అంతర్జాతీయ పత్రికలు సైతం ప్రస్తావిస్తూ ఉన్నాయి. ఒక కమ్యూనిస్టు పార్టీ పాలనలో ఉన్న రాష్ట్రంలో కరోనా కట్టడి అయ్యిందని అంటూ అమెరికన్ పత్రికలు కూడా ప్రస్తావిస్తూ ఉండటం గమనార్హం.
జనవరి 30న కేరళలో తొలి కరోనా కేసు రిజిస్టర్ అయ్యింది. చైనా నుంచి వచ్చిన ఒక నర్సుకు కరోనా పాజిటివ్ గా తేలింది అప్పట్లో. అలా ఇండియాలో ఖాతా తెరించింది కేరళే. ఆ తర్వాత అక్కడ కరోనా కేసుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతూ వచ్చింది. ప్రస్తుతం అక్కడ మొత్తం కరోనా కేసుల సంఖ్య 378. వీరిలో ఇద్దరు మరణించారట. మరో 198 మంది కరోనా నుంచి కోలుకున్నట్టుగా కేరళ ప్రభుత్వం ప్రకటించింది!
మిగతా రాష్ట్రాల్లాగానే కేరళలోనూ లాక్ డౌన్ అమలవుతూ ఉంది. అందునా కేరళ జనాలు ప్రపంచ వ్యాప్తంగా విస్తరించి ఉంటారు. అయినా అక్కడ కరోనా వ్యాప్తి మాత్రం తక్కువే అని చెప్పాలి. మహారాష్ట్ర, ఢిల్లీ తో పోల్చి చూస్తే కేరళ చాలా మంచి స్థాయిలో ఉన్నట్టే. అన్నింటికి మించి రికవరీ కేసులు ఎక్కువగా ఉండటం, గత కొన్నాళ్లుగా డైలీ సింగిల్ డిజిట్ స్థాయిలోనే కేసులు పెరుగుతూ ఉండటం.. వీటితో అందరి దృష్టీ కేరళ మీద పడే పరిస్థితి ఏర్పడింది.