ఏ ఇండియా సిమెంట్స్ శ్రీనివాసనో, అతడి పప్పెట్స్ ఎవరైనా బీసీసీఐ ప్రెసిడెంట్ గా ఉండి ఉంటే, మహేంద్రసింగ్ ధోనీకి టీమిండియాలోకి ఎంట్రీ అనేది చాలా ఈజీగా ఉండేది. ధోనీ కావాల్సినప్పుడు ఆడుకుని, వద్దనుకున్నప్పుడు రెస్టు తీసుకోవడానికి అవకాశం ఉండేది. అయితే ఇప్పుడు బీసీసీఐ ప్రెసిడెంట్ గా ఉన్నది సౌరవ్ గంగూలీ. ఆటలో ప్రమాణాలు మెరుగు చేయడమే కాదు, ఎవరిని ఎక్కడ ఎలా తొక్కాలో, నొక్కాలో గంగూలీకి తెలియనిది కాదు! అద్భుతమైన మేనేజ్ మెంట్ స్కిల్స్ ఉన్న వ్యక్తి సౌరవ్. అలాగే ఎవరినైనా అదుపులో ఉంచడమూ గంగూలీకి వెన్నతో పెట్టిన విద్యే!
ఇలాంటి క్రమంలో ధోనీ ఆటలు సాగే అవకాశాలు చాలా వరకూ ఉండవు. తన హవా సాగిన రోజుల్లో ధోనీ చాలా మంది సీనియర్లను, తన సాటి ఆటగాళ్లను ముప్పు తిప్పలు పెట్టాడు. టీమ్ లో ధోనీ తో తట్టుకోలేకే లక్ష్మణ్, సెహ్వాగ్, గంభీర్ వంటి ఆటగాళ్లు తప్పుకున్నారనే అభిప్రాయాలున్నాయి. ద్రావిడ్, సచిన్ లను ధోనీ టచ్ చేయలేకపోయాడేమో కానీ.. తన కన్నా కాస్త సీనియర్లే అయిన సెహ్వాగ్, యువీ, గంభీర్ వంటి వాళ్లను బయటకు కనిపించని రీతిలో తిప్పలు పెట్టాడనే అభిప్రాయాలున్నాయి.
వాళ్లు రిటైర్మెంట్ కు దగ్గర పడినప్పుడు ధోనీ ఆడుకున్నాడు. ఇప్పుడు వాళ్లు బయట నుంచి ధోనీ టార్గెటెడ్ గా బుల్లెట్ లు సంధిస్తున్న వైనం స్పష్టం అవుతోంది. 'ధోనీ ఇక ఎలా జాతీయ జట్టుకు ఆడతాడు?' అని తాజాగా ప్రశ్నించేశాడు గంభీర్. గత ఏడాది జూలై లో జరిగిన వరల్డ్ కప్ సెమిస్ ధోనీ ఆడిన చివరి మ్యాచ్. ఆ తర్వాత రెస్ట్ అంటూ వెళ్లాడు. మళ్లీ టీ20 వరల్డ్ కప్ విషయంలో ధోనీ పేరు వినిపిస్తూ ఉండటం పై గంభీర్ చెలరేగాడు. ధోనీ అంతర్జాతీయ మ్యాచ్ కానీ, దేశీయ మ్యాచ్ కానీ ఆడి 10 నెలలు గడిచిపోతున్న తరుణంలో అతడి ఫిట్ నెస్ ఏంటో, ఫామ్ ఏంటో .. జట్టు పరిస్థితి ఏమిటో అంచనాకు రాకుండా ఎలా అతడిని ఎంపిక చేస్తారన్నట్టుగా గంభీర్ విమర్శించాడు.
ఈ ఏడాది ఐపీఎల్ జరిగి ఉంటే, అందులో ధోనీ సత్తా చూపి ఉంటే అతడి సెలక్షన్ కు అంతో ఇంతో అవకాశం ఉండేది. అయితే అది ఎప్పుడు జరుగుతుందో ఎవరికీ తెలీదు. ఇలాంటి నేపథ్యంలో ధోనీకి రీ ఎంట్రీ కష్టం అయిపోతూ ఉంది. ఇదే సమయంలో ధోనీ హవా సాగిన రోజుల్లో ఆటకు దూరం అయిన మాజీలు ఇప్పుడు ధోనీని ఎలా జట్టులోకి తీసుకుంటారంటూ ప్రశ్నించేస్తూ ఉన్నారు. ధోనీకి కొహ్లీ, రవిశాస్త్రిలు సానుకూలంగా ఉన్నా, గంగూలీ ఏ మేరకు ఆమోదిస్తాడనేది సందేహమే. అసలు బీసీసీఐలో ఇప్పుడు గంగూలీది ఏకఛత్రాధిపత్యంగా ఉంది. యంగ్ ట్యాలెంట్ ను ప్రోత్సహించడానికో, కేఎల్ రాహుల్ వంటి ప్రతిభావంతుడికి అవకాశాలు ఇవ్వడానికనో ధోనీని పూర్తిగా పక్కన పెట్టే అవకాశాలు లేకపోలేదు! అలా చూస్తే.. ధోనీ తన చివరి మ్యాచ్ ను 2019లోనే ఆడేశాడని మరో మాజీ ఆటగాడు ఆకాశ్ చోప్రా వ్యాఖ్యానించడం గమనార్హం!