21 రోజుల తొలి దశ లాక్ డౌన్ ముగిసిన నేపథ్యంలో.. ప్రధానమంత్రి నరేంద్రమోడీ దేశ ప్రజలకు ఏం చెప్పబోతున్నారనే అంశం గురించి సర్వత్రా ఆసక్తితో ఎదురుచూశారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం పది గంటలకు ప్రధానమంత్రి జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ముందుగా అంబేద్కర్ జయంతిని ప్రస్తావించిన మోడీ.. ఆ తర్వాత కరోనా పై స్పందించారు. అంబేద్కర్ స్ఫూర్తితో దేశ ప్రజలు కరోనా పై పోరాడాలని మోడీ పిలుపునిచ్చారు.
21 రోజుల లాక్ డౌన్ ను పాటించి, దేశం కరోనాను నియంత్రిస్తోందని, ఈ యుద్ధం మరింతగా సాగాలని మోడీ అన్నారు. అందుకోసం మే 3వ తేదీ వరకూ లాక్ డౌన్ ను పాటించాల్సి ఉంటుందని మోడీ స్పష్టం చేశారు. లాక్ డౌన్ ను మరో మూడు వారాల పాటు పొడిగిస్తూ మోడీ ప్రకటన చేశారు.
రాబోయే వారం రోజులు మరింత కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుందని, హాట్ స్పాట్ ఏరియాల్లో మరింత కఠినంగా ఉండాలని మోడీ సూచించారు. అయితే చిన్న మినహాయింపు ఉంటుందని కూడా మోడీ చెప్పడం గమనార్హం. ఏప్రిల్ 20వ తేదీ నుంచి లాక్ డౌన్ లో పాక్షిక మినహాయింపు ఉంటుందని ఆయన పేర్కొన్నారు. అయితే ఈ పాక్షిక మినహాయింపు అందరికీ కాదని, కొందరికే అని స్పష్టం చేశారు. అదెవరికి అనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
కరోనాపై పోరాటంలో భాగంగా ఎక్స్ ట్రా కేర్ తీసుకోవాలని, వ్యాధినిరోధకతను పెంచుకోవాలని మోడీ సూచించారు. ఆరోగ్య సేతు యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలని మోడీ సూచించారు.