ఇళ్ల పట్టాల ఆశ అప్పుడే నెరవేరదా..?

వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోలో అన్నింటి కంటే ప్రధానమైన అంశం ఇళ్ల పట్టాల పంపిణీ. గతంలో ఇందిరమ్మ గృహాలు, రాజీవ్ గృహకల్ప, ఎన్టీఆర్ హౌసింగ్ పేరుతో ప్రభుత్వాలు పేదలకు ఇళ్లు కట్టించి ఇచ్చినా.. వాటితో లబ్ధిదారులకు…

వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోలో అన్నింటి కంటే ప్రధానమైన అంశం ఇళ్ల పట్టాల పంపిణీ. గతంలో ఇందిరమ్మ గృహాలు, రాజీవ్ గృహకల్ప, ఎన్టీఆర్ హౌసింగ్ పేరుతో ప్రభుత్వాలు పేదలకు ఇళ్లు కట్టించి ఇచ్చినా.. వాటితో లబ్ధిదారులకు పూర్తిస్థాయిలో న్యాయం జరగలేదు. ఊరికి దూరంగా కట్టిన ఇళ్లు సగానికి సగం నిరుపయోగంగా మారాయి. ఇక టీడీపీ హయాంలో షేర్ వాల్ టెక్నాలజీ పేరుతో నాసిరకం ఇళ్లు కట్టి పేదలను దారుణంగా మోసం చేశారు చంద్రబాబు.

ఇలాంటి వ్యవహారాలతో ప్రభుత్వం కట్టిచ్చే ఇళ్లంటేనే పేదలు భయపడే పరిస్థితి వచ్చింది. ఆ డబ్బులేవో మాకే ఇస్తే మేమే కట్టుకుంటాం కదా అనే పరిస్థితులున్నాయిప్పుడు. తన సుదీర్ఘ పాదయాత్రలో పేదల కష్టాలను, కన్నీళ్లను సరిగా అంచనా వేసిన జగన్ ఇళ్ల పట్టాల కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రతి పేదవాడికి ఇళ్లు కట్టి ఇవ్వాలనే సదాలోచన చేశారు. ముందుగా వారికి స్థలం కేటాయించి, ఆ తర్వాత ఇళ్లు కట్టుకోడానికి ఆర్థిక భరోసా కల్పించబోతున్నారు.

గ్రామాల్లో ఒకటిన్నర సెంటు, పట్టణాల్లో సెంటు భూమిని పేదలకు కేటాయిస్తున్నారు. ఈ ఏడాది ఉగాదికి ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం పూర్తిచేయాలనే లక్ష్యంతో అధికారులు అన్ని పనులు చేసినా కరోనా కారణంగా అది వాయిదా పడింది. దానికితోడు టీడీపీ కోర్టులలో వేసిన కొర్రీలు కూడా అడ్డంకిగా మారాయి. అసైన్ మెంట్ స్థలాలలో ఇల్లు కట్టకుండా రిజిస్ట్రేషన్ ఎలా చేస్తారని, వాటిపై లబ్ధిదారులకు పూర్తి స్థాయిలో హక్కులు ఎలా బదలాయిస్తారని అడ్డంకులు సృష్టించారు. 

చట్టప్రకారం ఇది కాస్త క్లిష్టమైన విషయమే అయినా, జగన్ సదాశయంతో కోర్టుల నుంచి అనూకుల తీర్పు కోసం ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వ స్థలాలు పోను 20వేల కోట్ల రూపాయలు వెచ్చించి దాదాపు 62వేల ఎకరాలు సమీకరించింది ప్రభుత్వం. పేదవాడికి ఇంటి స్థలం కేటాయించి, ప్రాణం మీదకి వచ్చినా దాన్ని అమ్ముకోకుండా అడ్డంకులు సృష్టిస్తే దానివల్ల ఉపయోగం ఏంటి? పిల్లల చదువులకు, పెళ్లిళ్లకు అక్కరకు రాని ఆస్తి ఎందుకు? ఈ కారణాల వల్లే పేదలకు పూర్తి హక్కులు కేటాయించబోతున్నారు సీఎం జగన్.

అయితే ఈ పథకం అమలు మాత్రం రోజు రోజుకీ వెనక్కి వెళ్లిపోతోంది. ఉగాదికి జరగాల్సిన ఇళ్ల పట్టాల పండగ వాయిదా పడింది. తాజాగా ఆగస్ట్ 15న పేదల కళ్లలో ఆనందం చూడాలనుకున్నా.. కోర్టు తీర్పు పెండింగ్ లో ఉండటంతో ఆ ముచ్చట ఇప్పుడప్పుడే తీరేలా లేదు. వారంలోగా ఈ తీర్పు వెలువడుతుందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తున్నా.. ఆగస్ట్ 15 నాటికి మాత్రం పట్టాల పంపిణీ సాధ్యపడేలా లేదు. 

రైతులు త్యాగం చేశారా.. డీల్ చేసుకున్నారా ?