ప్రమాదాలు చాలా వరకూ మానవ తప్పిదాలే. మరి కొన్ని దురదృష్టవశాత్తూ జరిగే ఘటనలు. వీటిని నగరాలకు ఆపాదించడం మాత్రం చాలా దుర్మార్గం. వైజాగ్ లో ఇటీవలి కాలంలో చోటు చేసుకున్న కొన్ని ప్రమాదాలతో ఆ ప్రాంతానికి రాజధాని అర్హత లేదని అంటూ తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీ సానుభూతి పరులు వ్యాఖ్యానించసాగారు. ఎంతలా అంటే.. వైజాగ్ అంటేనే ఒక భయాన్ని పెంచే ప్రయత్నం చేశారు.
ఎక్కడో విదేశాల్లో అమ్మోనియం నైట్రేట్ పేలినా.. దానికీ విశాఖపట్నం తీరానికి ముడిపెట్టేసిన శాడిజం అది. విశాఖ తీరంలో చీలిక వచ్చిందని, సునామీలు వస్తాయంటూ తోచింది రాసేశారు. అలాంటి రాతలకూ, కోతలకూ అంతా కారణం.. కులాభిమానం మాత్రమే అంటే ఆశ్చర్యం కలగక మానదు!
రాజధాని అమరావతిలో మాత్రమే ఉండాలనే విపరీత స్థాయికి చేరిన కులాభిమానం అలా విశాఖకు కళంకాన్ని అద్దడానికి వెనుకాడలేదు. ఇలాంటి క్రమంలో ఇప్పుడు విజయవాడలో ప్రమాదం చోటు చేసుకుంది. ఇలాంటి ప్రమాదం విజయవాడలోనే కాదు, అహ్మదాబాద్ లోనూ చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం. పది మంది వరకూ మరణించారు. ఇదంతా విధివశాత్తూ జరిగిందనే అనుకోవాలి. ఈ విషయంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించనున్నట్టుగా కృష్ణా జిల్లా కలెక్టర్ ప్రకటించారు.
ఈ పరిస్థితుల్లో ఇలాంటి ప్రమాదమే విశాఖలో జరిగి ఉంటే? అప్పుడు తెలుగుదేశం వర్గాలు, ఆ సామాజికవర్గం వాళ్లు ఎలా స్పందించేవారో ఊహించుకుంటేనే ఆందోళన కలుగుంది. జగన్ ప్రభుత్వం తమకు నచ్చని నిర్ణయం తీసుకుందని చెప్పి.. వైజాగ్ మీదే ఏదో ముద్ర వేయడానికి వాళ్లు ఇన్నాళ్లూ తీవ్రంగా శ్రమించారు. ప్రతిదాన్నీ రాజకీయ కోణంలో చూపిస్తూ.. రాజకీయ లబ్ధి పొందాలనే ప్రయత్నం చేశారు.
విజయవాడ ఘటనలో ఆసుపత్రి యాజమాన్యం సరైన సమాచారం కూడా ఇవ్వలేదని వార్తలు వస్తున్నాయి. ఐదు మంది పేషెంట్లు మాత్రమే ఉన్నట్టుగా రికార్డుల్లో చూపించారట. ఏదేమైనా ఈ ప్రమాదం విచారకరం. అది విజయవాడలో జరిగినా, వైజాగ్ లో జరిగి ఉండినా.. ప్రమాదాలు జరిగినప్పుడు కాస్త మానవీయ కోణంలో ఆలోచించాలి. అంతే కానీ.. వ్యక్తిగత స్వార్థాలకు, రాజకీయ ప్రయోజనాలకూ మనుషుల ప్రాణాలను కూడా వాడుకుంటే అంతకన్నా దారుణం మరోటి ఉండదు. అమరావతి కోసం వైజాగ్ పై విషముద్ర వేసే ప్రయత్నం చేసిన వారు ఇకనైనా తమ నీఛ ప్రయత్నాలను కాస్త తగ్గించుకుంటే మంచిది.