మెగాస్టార్ చిరంజీవి అంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అభిప్రాయం ఏంటి? జగన్ మనసులో చిరుకు స్థానం ఏంటి? లాంటి ప్రశ్నలు సహజంగానే చాలా మంది మనసుల్లో ఉంటాయి.
ఎందుకంటే రాజకీయ పరంగా జగన్ అంటే మెగాస్టార్ చిరు సోదరుడు పవన్‌కల్యాణ్ తీవ్రంగా వ్యతిరేకిస్తారు. అలాగే పవన్ అంటే జగన్ కూడా అదే విధంగా చూస్తారు. ఇదంతా రాజకీయ పరమైన వైరం. ఈ నేపథ్యంలో చిరు, జగన్ మధ్య ఎలాంటి సంబంధాలుంటాయనే ప్రశ్నకు గతంలోనే ముఖ్యమంత్రి తన చర్యల ద్వారా సమాధానం చెప్పారు.
కానీ ఇటీవల ఆన్‌లైన్‌లో టికెట్లు అమ్మాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో చిరు, జగన్ మధ్య విభేదాలు సృష్టించేలా కొన్ని మీడియా సంస్థలు, ప్రతిపక్ష పార్టీలు తమ వంతు పాత్ర పోషించాయి, ఇంకా పోషిస్తున్నాయి. ఈ క్రమంలో టాలీవుడ్ ప్రముఖులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అపాయింట్‌మెంట్ ఇవ్వడంలో జాప్యం జరగడం మరిన్ని ఆరోపణలకు కారణమైంది.
ఈ నేపథ్యంలో సోమవారం ఏపీ ప్రభుత్వంతో సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు, థియేటర్ యజమానులు భేటీ అయ్యారు. అనంతరం సమావేశ వివరాలను మంత్రి పేర్ని నాని వివరించారు.
చిరంజీవి అంటే సీఎం జగన్‌కు ఎంతో గౌరవం ఉందని స్పష్టం చేశారు. చిరంజీవిని సోదర భావంతో చూస్తారని ఆయన చెప్పుకొచ్చారు. దీంతో చిరంజీవిపై జగన్ సానుకూల వైఖరితో ఉన్నారనే విషయం స్పష్టమైంది.