కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామి దర్శన భాగ్యం ఇకపై అందరికీ కలిగించాలని టీటీడీ నిర్ణయించింది. ఇక మీదట చిత్తూరు జిల్లా వాసులకే కాకుండా, ప్రతి ఒక్కరికీ స్వామివారిని సర్వదర్శనం చేసుకునే అవకాశం కల్పించింది.
కరోనా సెకెండ్ వేవ్‌లో ముందు జాగ్రత్తలో భాగంగా గతంలో తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించి సంబంధిత అధికారులు, పాలక మండలి కీలక నిర్ణయం తీసుకుంది.
సర్వ దర్శనాన్ని రద్దు చేస్తూ, కేవలం బ్రేక్, సుపథం దర్శన సౌకర్యం మాత్రమే కల్పించింది. ఈ క్రమంలో శ్రీవారిని దర్శనం చేసుకునే భక్తుల సంఖ్య బాగా తగ్గిపోయింది. కరోనా సెకెండ్ వేవ్ ఉధృతి క్రమంగా తగ్గడంతో …సర్వ దర్శనానికి అవకాశం కల్పించాలనే డిమాండ్స్ భక్తుల నుంచి పెరిగాయి. ఈ నేపథ్యంలో టీటీడీ భక్తుల వినతిని పరిగణలోకి తీసుకుంది.
ముందుగా ప్రయోగాత్మకంగా చిత్తూరు జిల్లా వాసులకు మాత్రమే శ్రీవారిని దర్శనం చేసుకునే మహాభాగ్యాన్ని టీటీడీ కల్పించింది. అది కూడా రోజుకు రెండు వేల టికెట్లను జారీ చేసేవారు. ప్రస్తుతం ఆ సంఖ్యను 8 వేలకు పెంచుతూ టీటీడీ నిర్ణయం తీసుకోవడంపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
పెరటాసి నెల కావడంతో స్వామి దర్శించుకోవాలనే తమ ఆశను టీటీడీ నెరవేర్చడంపై అన్ని ప్రాంతాల భక్తులు స్వాగతిస్తున్నారు. రోజువారీ టోకెన్లను ఏరోజుకారోజు తెల్లవారుజాము నుంచి తిరుపతిలోని శ్రీనివాసంలో జారీ చేయనున్నట్టు టీటీడీ అధికారులు తెలిపారు.