చంద్రబాబుకు విశాఖ మీద మా చెడ్డ ప్రేమ అని చెబుతారు తెలుగు తమ్ముళ్ళు. మరి ఆయన ప్రేమ ఎంత అంటే ఉమ్మడి ఏపీకి సీఎం గా ఉన్నప్పటి నుంచే విశాఖను ఆర్ధిక రాజధాని, సినీ రాజధాని అంటూ వచ్చారే తప్ప చేసినదేమీ లేదని అంటారు తటస్థ జనాలు.
ఇక విభజన తరువాత ఏపీకి విశాఖయే సరైన రాజధాని అని అంతా ఒక్కటిగా చెప్పినా కూడా బాబు అపర విశ్వామిత్ర సృష్టి చేసి అమరావతిని రాజధానిగా బయటకు తీశారు తప్ప ఈ నగరం ఊసే ఎత్తనేలేదు. ఇక విశాఖను జాతీయ అంతర్జాతీయ కార్యక్రమాల నిర్వహణకు వేదికగా మాత్రం 2014 నుంచి 2019 మధ్యకాలంలో బాగానే వాడుకున్నారని వైసీపీ నేతలు అంటారు.
ఇపుడు బాబు విపక్షంలోకి వచ్చారు, విశాఖను రాజధాని చేస్తామని వైసీపీ సర్కార్ ప్రతిపాదిస్తే శతవిధాల అడ్డుకున్నారు. ఇక విశాఖ సిటీలో లక్షన్నర మంది పేదలకు ఇళ్ళ పట్టాలు ఇస్తామని అంటే దాని మీద కూడా తమ్ముళ్ళు కోర్టుకు వెళ్లారు.
ఇదేనా బాబూ విశాఖ మీద నీకు ఉన్న ప్రేమ అంటూ మంత్రి అవంతి శ్రీనివాసరావు గట్టిగానే విమర్శిస్తున్నారు. విశాఖను తమ ప్రభుత్వం అభివృద్ధి చేయాలనుకుంటే మోకాలడ్డడమేనా బాబు మార్క్ ప్రేమ అంటే అని ఆయన కస్సుమంటున్నారు. బాబును ఏకంగా పేపర్ టైగర్ తో పోల్చేశారు.
బాబు తాటాకు చప్పుళ్లకు బెదిరే పరిస్థితి లేదని, న్యాయం తమ వైపు ఉందని, అందరికీ తమ ప్రభుత్వంలో అవకాశాలు దక్కుతాయని చెప్పుకొచ్చారు. విశాఖ అభివృద్ధిని కూడా తామే చేసి చూపెడతామని కూడా మంత్రి అవంతి స్పష్టం చేస్తున్నారు. మొత్తానికి బాబు విశాఖ ప్రేమను నేతి బీరకాయలో నేతి మాదిరే అంటూ వైసీపీ నేతలు ఎకసెక్కం చేస్తున్నారు.