భారతదేశంలో ఏటా ధనికుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ధనికుల వద్ద సంపద ఎప్పటికప్పుడు రెట్టింపు అవుతోంది. ఈ విషయాన్ని ఫోర్బ్స్ లాంటి అంతర్జాతీయ సంస్థలు ఎప్పుడో చెప్పాయి. మరి ఈ ధనికులంతా దేశంలో ఎక్కడ ఉంటున్నారు? ఢిల్లీలో ఎక్కువమంది ఉంటున్నారా లేక ముంబయిలో ఎక్కువమంది ఉంటున్నారా? అసలు సౌత్ లో ధనికులు ఎక్కువగా ఎక్కడ ఉంటున్నారు? ఇలాంటి ఆసక్తికర అంశాలతో విడుదలైంది నైట్ ఫ్రాంక్ వెల్త్ రిపోర్ట్-2022.
ఈ నివేదిక ప్రకారం.. దేశంలో అత్యథికంగా ధనికులు ఉన్న ప్రాంతం ముంబయి. ఈ విషయం అందరికీ తెలిసిందే. ఇందులో పెద్దగా ఆశ్చర్యపోవడానికేం లేదు. కానీ ఆశ్చర్యపోవాల్సిన అసలు విషయం ఇంకోటి ఉంది. ముంబయి తర్వాత దేశంలో అత్యథికంగా ధనికులు ఉన్న సిటీ హైదరాబాద్. అవును.. కాస్త ఓవర్ అనిపించినా ఇది నమ్మాల్సిందే.
దేశంలో ముంబయి తర్వాత అత్యధికంగా ధనికులు హైదరాబాద్ లోనే ఉంటున్నారట. ఈ విషయంలో బెంగళూరు, పూణె, ఇండోర్ లాంటి నగరాల్ని హైదరాబాద్ ఎప్పుడో దాటేసిందనేది నివేదిక సారాంశం.
2021లో నికర ఆస్తి విలువ 227 కోట్ల రూపాయల కంటే ఎక్కువగా ఉన్న వ్యక్తుల జాబితాను ఈ నివేదికలో పొందుపరిచారు. వీరిలో 1596 మంది ముంబయిలో ఉండగా, 467 మంది హైదరాబాద్ లో ఉంటున్నట్టు నివేదిక తెలిపింది. అంతేకాదు.. మరో నాలుగేళ్లలో (2026 నాటికి) హైదరాబాద్ లో ధనికుల సంఖ్య 728కి చేరుతుందని కూడా లెక్కకట్టింది.
దేశవ్యాప్తంగా ధనికుల సంఖ్య 2020 నుంచి 2021నాటికి ఏడాదిలో 11 శాతం పెరగగా.. ఇదే టైమ్ లో హైదరాబాద్ లో ధనికుల సంఖ్య దాదాపు రెట్టింపు అయిందట. మరో నాలుగేళ్లలో దేశవ్యాప్తంగా ధనికుల సంఖ్య 19వేలు దాటుతుందట.
ధనికుల పెట్టుబడులు ఎక్కడ?
విదేశాల్లో ధనికులంతా తమ డబ్బును కళాఖండాలు, ఖరీదైన కార్లు కొనుగోలు చేసేందుకు వెచ్చిస్తున్నారు. అయితే ఇండియాలో మాత్రం ధనికులు తమ డబ్బును రియల్ ఎస్టేట్ లో ఎక్కువగా పెడుతున్నారు.
దాదాపు 60శాతం మొత్తాన్ని రియల్ ఎస్టేట్ రంగానికి వెచ్చిస్తున్న ధనికులు.. మిగతా మొత్తాన్ని తమ అభిరుచికి తగ్గట్టు ఖరీదైన వాచీలు, కార్లు, బ్యాగులు కొనేందుకు వెచ్చిస్తున్నారు. ఇంకా డబ్బు ఉంటే షేర్ మార్కెట్, క్రిప్టో కరెన్సీలో పెడుతున్నారు.