ఇటీవల భీమ్లా నాయక్ సినిమా విడుదల సందర్భంగా జరిగిన హడావిడి అంతా ఇంతా కాదు. భీమ్లా పోస్టర్లపై ఎమ్మార్వోలు, వీఆర్వోల నెంబర్లు రాసి మరీ దిగజారిపోయారు అధికారులు. ముఖ్యమంత్రికి ఏదో ఫేవర్ చేయబోతున్నామనే ఉద్దేశంలో పూర్తిగా ప్రభుత్వం పరువు తీసేశారు. అలాంటి పరువు తీసే ఘటన మరొకటి గుంటూరు కార్పొరేషన్లో జరిగింది.
పబ్లిక్ టాయిలెట్ల నిర్వహణ కాంట్రాక్ట్ ముగిసిందని చెప్పి గుంటూరులోని ఐదు ప్రాంతాల్లో వార్డు సెక్రటరీలకు అదనంగా డ్యూటీలు వేశారు. 8 గంటల చొప్పున రోజుకు ముగ్గురు, ఐదు చోట్ల కలిపితే 15మందికి డ్యూటీలు వేస్తూ అడిషనల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి జారీ చేసిన ఆదేశాలో సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. సహజంగానే టీడీపీ అనుకూల మీడియా దీన్ని హైలెట్ చేసింది, ఆ తర్వాత సచివాలయ ఉద్యోగుల సంఘం తీవ్రంగా ధ్వజమెత్తింది.
చేతులు కాలాయి, ఆకులు పట్టుకున్నారు. అవి మరుగుదొడ్ల దగ్గర ఉండి చేయాల్సిన డ్యూటీలు కాదు, శానిటరీ సిబ్బంది వసూలు చేసిన సొమ్ముని తీసుకొచ్చి రెవెన్యూ ఇన్ స్పెక్టర్లకు ఇవ్వాల్సిన డ్యూటీలంటూ వివరణ ఇచ్చుకున్నారు. ఆ తెలివి ముందు ఏమైంది, ప్రభుత్వంపై బురదపడ్డాక అడిషనల్ కమిషనర్ ఫినాయిల్ తో కడుగుతా, గంగాజలంతో శుద్ధి చేస్తానంటే కుదరదు. అక్కడితో ఆ వ్యవహారంపై ప్రజల్లోకి నెగెటివ్ మెసేజ్ వెళ్లిపోయింది.
వార్డు సెక్రటరీలకు పబ్లిక్ టాయిలెట్ల వద్ద డబ్బులు వసూలు చేసే డ్యూటీలు వేస్తారా అంటూ సచివాలయ ఉద్యోగ సంఘాలు ఆవేదన, ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. జీతాలు పెంచాలని అడిగితే ఇలా కక్ష సాధిస్తారా అంటూ మరో వర్గం రెచ్చిపోయింది. ఎందుకిదంతా, దీంతో ఎవరికి లాభం.
అత్యుత్సాహంతో అవస్థలు..
కింది స్థాయి సిబ్బందిని ఎలాగైనా వాడేద్దాం అనే అత్యుత్సాహంతో పై స్థాయి అధికారులు చేసే అవకతవక పనులతోనే ఇలాంటి ఇబ్బందులన్నీ వస్తున్నాయి. సోషల్ మీడియా విజృంభిస్తున్న రోజుల్లో ఇలాంటి ఆర్డర్లు ఆఫీసు గేటు దాటకముందే వాట్సప్ లలో ప్రపంచం చుట్టి వచ్చేస్తాయి.
తప్పుడు నిర్ణయాలని చెప్పలేం కానీ, తప్పించుకోవాల్సిన అవసరాన్ని తెప్పించే నిర్ణయాలివి. ప్రతి నిర్ణయానికి ఆనక వివరణ ఇచ్చుకోవాల్సి వస్తుందంటే.. దాంట్లో ఎంతో కొంత ఇబ్బంది ఉంది అనే విషయాన్ని అధికారులు అర్థం చేసుకోవాలి. అది సినిమా థియేటర్ ముందు డ్యూటీ అయినా, పబ్లిక్ టాయిలెట్ ముందు కలెక్షన్ అయినా.