డైరెక్ట్ రిక్రూట్‌మెంట్, ప్రమోషన్ల ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో 239 మంది ఐఏఎస్ అధికారులను నియమించాల్సి ఉండగా ప్రస్తుతం వారి సంఖ్య 181 మాత్రమే ఉంది. రాజ్యసభలో గురువారం వైఎస్సార్సీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు జవాబిస్తూ కేంద్ర సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేందర్ సింగ్ ఈ విషయం వెల్లడించారు.
ఖాళీలను డైరెక్ట్ రిక్రూట్‌మెంట్, ప్రమోషన్ల ద్వారా భర్తీ చేయడం నిరంతరం ప్రక్రియ అని మంత్రి చెప్పారు. కాలానుగుణంగా ఐఏఎస్ పోస్టులను డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా అలాగే స్టేట్ కేడర్ అధికారులకు పదోన్నతి కల్పించడం ద్వారా భర్తీ చేస్తామని ఆయన తెలిపారు. వివిధ రాష్ట్రాలలో ఏళ్ళ తరబడి భర్తీ కాకుండా మిగిలిపోతున్న ఐఏఎస్ పోస్టులను భర్తీ చేయడానికి ప్రభుత్వం అదనంగా 1000 ఐఏఎస్‌లను నియమిస్తుందా అన్న మరో ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ అలాంటి ఆలోచన లేదని చెప్పారు.
కేడర్ మేనేజ్‌మెంట్‌లో సమన్వయం పాటించడం, ఐఏఎస్ అధికారుల భవిష్యత్తు అవకాశాలు వంటి అంశాలను దృష్టిలో పెట్టుకునే ఏడాదికి 180 మంది ఐఏఎస్‌లను మాత్రమే రిక్రూట్ చేసుకోవాలన్నది ప్రభుత్వ విధానం అని అన్నారు. ప్రమోషన్ కోటాలోని ఖాళీలను కూడా నిర్ధారించిన రీతిలోనే కేడర్ ప్రాతిపదికపై భర్తీ చేయడం జరుగుతుందని మంత్రి తెలిపారు.
2017 నుంచి 2019 వరకు ఏటా 180 ఐఏఎస్‌లను డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా తీసుకోవడం జరుగుతోంది. ఆ విధంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2017లో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా 6, ప్రమోషన్ల ద్వారా 6, 2018లో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా 12, ప్రమోషన్ల ద్వారా 21, 2019లో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా 11, ప్రమోషన్ల ద్వారా 6 చొప్పున ఐఏఎస్ పోస్టుల భర్తీ జరిగినట్లు మంత్రి వివరించారు