మండలి రద్దుపై లాజిక్ పాయింట్

శాసనమండలి రద్దుపై టీడీపీ నానా యాగీ చేస్తోంది. లోకేష్ కు పదవి పోతుందని, యనమల లాంటి వాళ్లు రాజకీయ నిరుద్యోగులుగా మారుతారని ఆ పార్టీ భయపడుతోంది. అందుకే రకరకాల లా-పాయింట్లు బయటకు తీస్తూ.. మండలిని…

శాసనమండలి రద్దుపై టీడీపీ నానా యాగీ చేస్తోంది. లోకేష్ కు పదవి పోతుందని, యనమల లాంటి వాళ్లు రాజకీయ నిరుద్యోగులుగా మారుతారని ఆ పార్టీ భయపడుతోంది. అందుకే రకరకాల లా-పాయింట్లు బయటకు తీస్తూ.. మండలిని రద్దు చేయడం ఎవరితరం కాదన్నట్టు మాట్లాడుతోంది. ఇలాంటి పాయింట్లకు తిరుగులేని సమాధానం ఇచ్చారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్.

ఉన్నదున్నట్టు మాట్లాడే ఈ నేత, మండలి రద్దుపై సూటిగా సుత్తిలేకుండా మాట్లాడారు. అసలు ప్రస్తుతం కొనసాగుతున్న మండలికి చట్టబద్ధతే లేదంటున్నారు ఉండవల్లి. రాష్ట్ర విభజన తర్వాత తీర్మానం చేయకుండానే మండలిని కొనసాగిస్తున్నారని, అది రాజ్యంగ విరుద్ధమనేది ఉండవల్లి మాట.

“కౌన్సిల్ రద్దు కోసం తీర్మానం పెట్టారు. అసలు కౌన్సిల్ అనేది రాజ్యాంగబద్ధమైంది కాదు. మండలి నిర్మాణం అవ్వాలంటే అసెంబ్లీ తీర్మానం చేయాలి. మండలిని రద్దు చేయాలన్నా అసెంబ్లీనే తీర్మానం చేయాలి. ఏపీ, తెలంగాణ విడిపోయినప్పుడు కౌన్సిల్ పై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ అప్పట్లో తీర్మానం చేయాలి. కానీ చేయలేదు. రాష్ట్రం విడిపోయింది కాబట్టి కౌన్సిల్ ను కూడా విడగొట్టారు. కానీ తీర్మానం చేయలేదు. అలాంటప్పుడు అది చట్టబద్ధం కాదు.”

గతంలో మద్రాసు నుంచి ఆంధ్రా విడిపోయినప్పుడు కౌన్సిల్ పై చర్చ జరిపారని, అలాంటి చర్చ ఏపీ-తెలంగాణ విడిపోయిన తర్వాత జరగలేదన్నారు ఉండవల్లి. అలా అసెంబ్లీలో చర్చ జరగకుండా ఏర్పడిన కౌన్సిల్ కు చట్టబద్ధత ఎక్కడ్నుంచి వస్తుందని ప్రశ్నించారు.

“మద్రాస్ నుంచి ఆంధ్రా విడిపోయినప్పుడు కౌన్సిల్ ఉండాలా వద్దా అని చర్చించారు. ఏకే సేన్ అనే రాజ్యాంగ నిపుణుడు అప్పుడే చెప్పాడు. అసెంబ్లీలో తీర్మానం చేసి పంపిస్తేనే కౌన్సిల్ వస్తుందని, అసెంబ్లీ తీర్మానం చేస్తేనే రద్దవుతుందని ఆయన క్లియర్ గా చెప్పాడు. అప్పట్లో మద్రాస్ అసెంబ్లీలో తీర్మానం చేసిన తర్వాతే తిరిగి కౌన్సిల్ ఏర్పాటైంది. కాబట్టి, రూల్స్ ప్రకారం చూసుకుంటే ఇప్పుడున్న కౌన్సిల్ రాజ్యాంగ విరుద్ధం. దీని రద్దుకు తీర్మానం కూడా అవసరం లేదు. జస్ట్ జగన్ రద్దని ఓ ప్రకటన చేస్తే చాలు.”

ఇలా మండలి రద్దుపై లాజిక్ గా మాట్లాడారు ఉండవల్లి. మండలి రద్దుపై అసెంబ్లీలో ఎలా తీర్మానం చేస్తారంటూ వాగుతున్న టీడీపీ నేతలకు ఉండవల్లి మాటలతో సమాధానం దొరికి ఉంటుంది. అసెంబ్లీలో తీర్మానం చేశారు కాబట్టి ఒకరోజు కాకపోతే మరో రోజు పార్లమెంట్ ఆ తీర్మానాన్ని ఆమోదించాల్సిందేనని, ఆ విషయం కూడా రాజ్యాంగంలో ఉందని ఉండవల్లి కుండబద్దలుకొట్టారు.ఇకనైనా టీడీపీ నేతలు మండలి రద్దుపై రాద్దాంతం ఆపితే బెటరేమో.