ముక్కలు ముక్కలుగా నరికేస్తారు, ఒక గాడిద (మంత్రిని ఉద్దేశించి), వాడొక మంత్రి…పేరు బొత్స…సహజంగా ఇలాంటి మాటలు సభ్యత, సంస్కారం ఉన్న మనుషులెవరూ మాట్లాడరు. ఇలా సంస్కార హీనంగా, సభ్యత లేకుండా మాట్లాడిన వారిని ఏ వీధి రౌడిగానో పరిగణిస్తారు. అంతేకాదు, వాక్‌శుద్ధి లేనివాళ్ల నోళ్లను పారిశుధ్య కార్మికు చేతులతో శుభ్రం చేయించాలి, చేయిస్తారు. ఎందుకంటే ఇలాంటి అశుద్ధమైన మాటల వల్ల ఆ పరిసర ప్రాంతాలు కలుషితమవుతాయి.
పైన పేర్కొన్న దూషణలు ఏ రాజకీయ నేతో మాట్లాడితే? ఇప్పుడు సామాన్య జనం పద్ధతిగా మాట్లాడుతున్నారు…సమస్యల్లా వైసీపీ, టీడీపీ, కొద్దోగొప్పో జనసేన వాళ్లతోనే అని ఎవరైనా అంటారు. ఎందుకంటే ఈ పార్టీ నేతల నేపథ్యం వ్యాపారాలు, డబ్బు. సైద్ధాంతిక , సామాజిక, ఆర్థిక అవగాహన అంతంత మాత్రంగానే ఉంటుందని అనుకుంటుంటారు. ఒకవేళ నరకడం, గాడిద, వాడు లాంటి దూషణలను ఏ కమ్యూనిస్టు నాయకుడో అన్నారని చెబితే….చాలు చాలు…ఏం మతి ఉండే మాట్లాడుతున్నారా? అని ప్రశ్నిస్తారు. పార్టీలకు అతీతంగా కమ్యూనిజం సిద్ధాంతంపై ఉన్న గౌరవం అలాంటిది.
కానీ ఆంధ్రప్రదేశ్‌లో సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ వందలాది మంది రైతుల సమక్షంలో ఈ మాటలు మాట్లాడారంటే….ఏమనాలి? భలే వారండి అలా మాట్లాడిన వారు కమ్యూనిస్టులు ఎందుకవుతారనే సమాధానం వెంటనే వస్తుంది. నిన్న తాడికొండలో చంద్రబాబు సమక్షంలో రామకృష్ణ మాట్లాడుతూ ‘సీఎం జగన్ తుళ్లూరులో కనిపిస్తే మహిళలు ముక్కలు ముక్కలుగా నరికేస్తారు. అందుకే ఆయన పోలీసుల్ని అడ్డు పెట్టుకుని తిరుగుతున్నారు. ఒక గాడిద అమరావతిని స్మశానమంటాడు. వాడొక మంత్రి. వాడి పేరు బొత్స. ఇక్కడి ప్రజలకు భయపడి గుండు కొట్టించుకుని తిరుగుతున్నాడు. ఇక్కడి ప్రజలు ఎంతో శాంతమూర్తులు. 50 రోజులైనా శాంతియుతంగా ఉద్యమిస్తున్నారు. అదే మా రాయలసీమలో అయితే ఎక్కడికక్కడ పగలగొట్టేవాళ్లం’…ప్రసంగం సాగింది.
రాయలసీమ వాళ్లు ఎక్కడికక్కడ పగలగొట్టేవాళ్లంటూ విలన్లగా చిత్రకరించడం సీపీఐకే చెల్లింది. మరోవైపు కోస్తా ప్రాంతం వాళ్లు ఎంతో శాంతమూర్తులంటూనే…సీఎం జగన్ కనిపిస్తే ముక్కలు ముక్కలుగా నరికేస్తారని చెప్పుకొచ్చాడు. ఇదేనా శాంతమూర్తులకు సీపీఐ ఇచ్చే నిర్వచనం మహాశయా? ఏంటీ మాటలు? ఆంధ్ర రాష్ట్రం ఏర్పడక ముందు నుంచీ రాయలసీమకు కమ్యూనిస్టులు అన్యాయం చేస్తూనే ఉన్నారు కదా! మరి ఎప్పుడైనా మిమ్మల్ని ఈడ్చి తన్నిన దాఖలాలు ఉన్నాయా? మరెందుకు సీమ ప్రాంతవాసులను , ఇతర ప్రాంత ప్రజల వద్ద చులకనగా మాట్లాడటం. నిజంగా రాయలసీమ వాసులు ఏవైనా పగలగొట్టాల్సి వస్తే…మొట్ట మొదటగా కమ్యూనిస్టుల మూతీపళ్లు రాలగొట్టాలి.
మంత్రి బొత్సను పట్టుకుని వాడు, గీడు అని మాట్లాడటం కమ్యూనిస్టు సంస్కృతా? అవున్లే అవు సేలో మేస్తే, దూడ గట్టున మేస్తుందా? మీ గురువు నారాయణ నుంచి స్ఫూర్తి పొందుతూ ఇలాంటి బుద్ధులు అలవరచుకున్నావా రామకృష్ణ? ఎంతో గొప్పదైన కమ్యూనిస్టు పార్టీ సీపీఐకి రాష్ట్ర కార్యదర్శిగా ఉంటూ, చంద్రబాబు కోసం ఇలాంటి సిగ్గుమాలిన మాటలు మాట్లాడటం సబబేనా? ఎందుకీ కమ్యూనిస్టు ముసుగు? మనసంతా చంద్రాబు పెట్టుకుని, పైకి మాత్రం కమ్యూనిస్టునని చెప్పుకోవడం…రాజకీయ వ్యభిచారం కాదా? చివరిగా ఒక్క మాట…నరకడం, గాడిద, వాడు…లాంటి దూషణ పదజాలం వాడిన నిన్నేమని పిలవాలి రామకృష్ణ?